ఒక‌ప్పుడది బీడు భూమి… ఆ వ్య‌క్తి చొర‌వ‌తో అదిప్పుడు ప‌చ్చ‌ని వ్య‌వ‌సాయ క్షేత్రంగా మారింది..!

స‌రైన ఆలోచ‌న‌… అందుకు త‌గిన విధంగా ఆచ‌ర‌ణ‌… దాన్ని అమ‌లులో పెట్టేందుకు కావ‌ల్సిన సంక‌ల్పం… ఇవి ఉంటే చాలు. బంజ‌రు భూమిలోనూ ప‌చ్చ‌ని పంట‌లు పండించ‌వ‌చ్చు. బీడుగా మారిన భూమిని ప‌చ్చ‌ని ప్ర‌కృతికి నెల‌వుగా మార్చ‌వ‌చ్చు… అని నిరూపించాడు ఆ వ్య‌క్తి. చేసింది ఓ వృత్తి అయినా, వ్య‌వ‌సాయం గురించి స‌రిగ్గా తెలియ‌క‌పోయినా అత‌ను ఇప్పుడు రైతుగా అంద‌రిచేత శ‌భాష్ అనిపించుకుంటున్నాడు. అత‌ని పేరే రిచ‌ర్డ్ రెబెలో. ఉంటుంది క‌ర్ణాట‌క‌లో.

Richard-Rebello

క‌ర్ణాట‌క‌లోని ఉడుపి జిల్లా కుందాపూర్, హెరూర్ గ్రామంలో నివ‌సించే రిచ‌ర్డ్ రెబెలోకు 25 ఎక‌రాల వ్య‌వసాయ క్షేత్రం ఉంది. దాని పేరు ఏఆర్ ఫార్మ్స్‌. అయితే అది ఇప్పుడు చూసేందుకు ప‌చ్చ‌ని చెట్లు, మొక్క‌లు, పండ్ల తోట‌ల‌తో అల‌రారుతూ ఉంది కానీ, ఒక‌ప్పుడ‌ది బీడు భూమి. నీరు కూడా స‌రిగ్గా లేక‌పోవ‌డంతో ఆ భూమిలో ఉండే మొక్క‌లు, చెట్లు అన్నీ ఎండిపోయాయి. దీంతో బంజ‌రు నేలగా మారిన ఆ భూమిని అప్ప‌టి య‌జ‌మాని రిచ‌ర్డ్ రెబెలోకు అమ్మేశాడు. అయితే రిచ‌ర్డ్ అప్పుడు, అంటే 1987లోనే కామర్స్ లెక్చ‌ర‌ర్‌గా ప‌నిచేసి రిటైర్ అయ్యాడు. దీంతో ఆ భూమిని కొనుగోలు చేసి దాన్ని వ్య‌వ‌సాయ క్షేత్రంగా తీర్చిదిద్దుదామ‌నుకున్నాడు. అయితే భూమిని అయితే కొన్నాడు కానీ ఆ నేల‌లో ఒక్క చుక్క నీరు లేదు. మ‌రి మొక్క‌ల‌ను ఎలా పెంచ‌డం..? అయితే అప్పుడే రిచ‌ర్డ్‌కు ఓ ఐడియా వ‌చ్చింది. వెంట‌నే దాన్ని అమ‌లులో పెట్టేశాడు.

rain-harvest-pond

ప‌క్క‌నే ఉన్న కొండ ప్రాంతంపై ప‌డ్డ వ‌ర్ష‌పు నీటిని త‌న భూమిలోకి మ‌ళ్లించ‌డం మొద‌లు పెట్టాడు. అలా వ‌చ్చిన వ‌ర్షపు నీటిని ఫాంలో ఏర్పాటు చేసిన ఓ పెద్ద కొల‌నులోకి పంపేవాడు. దీంతో నీరు పెద్ద ఎత్తున అక్క‌డ నిల్వ అయి ఉండేది. ఈ క్ర‌మంలో ఆ కొల‌నులో మోటార్లను పెట్టి వాటితో మొక్క‌ల‌కు నీళ్లు అందించేవాడు. అలా అలా ఆ ఫాం కాస్తా కొద్ది సంవ‌త్స‌రాల్లోనే ప‌చ్చ‌ని ప్ర‌కృతికి నిల‌యంగా మారింది. అక్క‌డ రిచ‌ర్డ్ కొబ్బ‌రి చెట్ల‌తోపాటు, మిరియాలు, పైనాపిల్స్‌, అర‌టి చెట్లు వంటి ర‌క ర‌కాల పండ్లు, కూర‌గాయ‌లు, ఆకుకూర‌ల తోట‌ల‌ను ఏర్పాటు చేశాడు. దీంతోపాటే ఆ ఫాంలో కోళ్లు, గేదెల పెంప‌కం కూడా చేప‌ట్టాడు. ఈ క్ర‌మంలో రిచ‌ర్డ్‌కు ఆ ఫాం ద్వారా ఆదాయం కూడా బాగానే రాసాగింది. చూశారుగా..! రిచ‌ర్డ్ అంకిత‌భావం..! అందుకే బీడు భూమిగా ఉన్న ఆ నేల ఇప్పుడు ప‌చ్చ‌ని దుప్ప‌టి క‌ప్పుకున్న‌ట్టు మొక్క‌లు, చెట్ల‌తో నిండిపోయింది. అన్న‌ట్టు ఇంకో విష‌యం… ఇప్పుడు రిచ‌ర్డ్ త‌న ఫాంలో మొక్క‌ల‌ను పెంచేందుకు వ‌ర్ష‌పు నీటిపై ఆధార ప‌డ‌డం లేదు. ఎందుకంటే ఎన్నో ఏళ్లుగా అలా సేద్యం చేస్తుండ‌డం, ద‌గ్గ‌ర‌ల్లోనే వ‌ర్షపు నీటిని ఒడిసిప‌ట్టే కొలను ఏర్పాటు చేయ‌డంతో ఇప్పుడా ప్రాంతంలో భూగ‌ర్భ జ‌ల వ‌న‌రులు కూడా బాగానే పెరిగాయి. దీంతో బోర్లు వేసి ఆ నీటినే రిచ‌ర్డ్ వాడుకుంటున్నాడు. అయినా వ‌ర్షపు నీటిని మాత్రం కొల‌నులో ఒడిసి ప‌డుతూనే ఉంటాడు. అంతే క‌దా మ‌రి..! ఇప్పుడు మ‌నం పొదుపు చేస్తేనే క‌దా, నీటిని అలా భ‌విష్య‌త్తులోనూ వాడుకునేది..!

Comments

comments

Share this post

scroll to top