ఆహార ప‌దార్థాల క‌ల్తీపై ఆ మ‌హిళా ఐఏఎస్ చేసిన పోరాటం అదుర్స్‌..!

ఇటుక‌లు, ఉప్పు, టాల్కం పౌడ‌ర్ క‌లిపిన కారం… డిటర్జెంట్‌తో తయారు చేయ‌బ‌డిన పాలు… పిండితో త‌యారు చేసిన ప‌న్నీర్‌… చ‌క్కెర పాకంను మార్చి త‌యారు చేసిన తేనె..! ఇవే కాదు… ఇంకా ఎన్నో మ‌న‌కు తెలియని ప‌దార్థాలను కొంద‌రు దుర్మార్గులు క‌లుషితం చేస్తున్నారు. నాసిర‌కం ప‌దార్థాల‌ను అమ్ముతూ ధ‌నార్జ‌న చేయ‌డ‌మే కాక, మ‌న ఆరోగ్యాల‌తో కూడా చెల‌గాట‌మాడుతున్నారు. అయితే ఇలాంటి దందాల‌కు పాల్పడే వారికి చెక్ పెట్టింది ఆ ఐఏఎస్ ఆఫీస‌ర్‌. ఆమె కార‌ణంగా ఇప్పుడు కేర‌ళ‌లో చాలా మంది సొంతంగా పండించిన ఆర్గానిక్ కూర‌గాయ‌లు తింటున్నారు. క‌ల్తీ లేని ప‌దార్థాల‌ను సేవిస్తున్నారు. ఇంత‌కీ ఆ ఆఫీస‌ర్ ఎవ‌రంటే..?

tv-anupama

ఆమె పేరు టి.వి.అనుప‌మ‌. గోవా బిట్స్ పిలానీ క్యాంప‌స్‌లో ఇంజినీరింగ్ చేసింది. 2009లో జ‌రిగిన ఆలిండియా యూపీఎస్సీ ప‌రీక్ష‌లో సివిల్స్‌లో దేశ వ్యాప్తంగా 4వ ర్యాంకును సాధించి ఐఏఎస్ ఆఫీస‌ర్ అయింది. ఈ క్ర‌మంలోనే ఆమె 2015లో కేర‌ళ‌లో ఫుడ్ సేఫ్టీ క‌మిష‌న‌ర్ గా విధులు నిర్వ‌హించింది. అయితే ఆమెకు ఆ పోస్టులో ఎన్నో స‌వాళ్లు ఎదుర‌య్యాయి. ముఖ్యంగా కూర‌గాయల‌తోపాటు ఆయా ఆహార ప‌దార్థాలు, ప్యాక్డ్ ఫుడ్స్‌ల‌లో జ‌రుగుతున్న క‌ల్తీల‌ను ఆమె గుర్తించింది. దీంతో వాటికి వ్య‌తిరేకంగా పోరాటం చేయాల‌ని అనుకుని వెంట‌నే ఆ రాష్ట్రంలో ఉన్న అన్ని కూర‌గాయ‌ల మార్కెట్లు, సూప‌ర్ మార్కెట్లు, దుకాణాల‌పై దాడులు నిర్వ‌హించింది. ఈ క్ర‌మంలో ఆ దాడిలో అనేక ప‌దార్థాల శాంపిల్స్‌ను సేక‌రించి టెస్టింగ్‌కు పంప‌గా అవ‌న్నీ పాజిటివ్ వ‌చ్చాయి.

అలా పెద్ద ఎత్తున ఆహార ప‌దార్థాలు, కూర‌గాయ‌ల క‌ల్తీ జ‌రుగుతుండడాన్ని తెలుసుకోవ‌డంతో కేర‌ళ‌లో ప్ర‌జ‌లంద‌రూ సొంతంగా కూర‌గాయ‌లు పండించి తిన‌డం మొద‌లు పెట్టారు. ప్ర‌భుత్వం కూడా ఆర్గానిక్ పంట‌ల దిశ‌గా రైతుల‌కు ప్రోత్సాహ‌కాలు అందివ్వ‌డంతో కేవ‌లం అనుప‌మ బాధ్య‌త‌లు చేప‌ట్టిన 15 నెల‌ల కాలంలోనే ఆ రాష్ట్రంలో 70 శాతానికి పైగా ప్ర‌జ‌లు సుర‌క్షిత‌మైన ప‌దార్థాల‌ను, కూర‌గాయల‌ను తిన‌డం మొద‌లుపెట్టారు. ఇదంతా ఆ యంగ్ ఆఫీస‌ర్ సాధించిన ఘ‌న‌తే అంటే న‌మ్మ‌గ‌ల‌రా..? అయితే ఆ పోస్టు అనంత‌రం అనుప‌మ మెట‌ర్నిటీ లీవ్‌పై వెళ్ల‌డం, మ‌ళ్లీ డ్యూటీలోకి రావ‌డంతో ఆమెకు పోస్టును మార్చారు. ఆ రాష్ట్ర సోష‌ల్ జ‌స్టిస్ డిపార్ట్‌మెంట్ డైరెక్ట‌ర్‌గా ఆమెను నియ‌మించారు. అయినా ఆ డిపార్ట్‌మెంట్‌లోనూ ఆమె త‌న సత్తా చాటుతోంది. మ‌హిళ‌లు, చిన్నారులు, వృద్ధుల సంర‌క్ష‌ణ కోసం కొత్త ప‌థ‌కాలు తెచ్చేలా ప్ర‌భుత్వంతో క‌ల‌సి ప‌నిచేస్తోంది. నిజంగా ఇలాంటి ఐఏఎస్ ఆఫీస‌ర్లే క‌దా మ‌న‌కు కావ‌ల్సింది..! ప్ర‌జ‌ల‌కు అంత‌టి సేవ చేస్తున్నందుకు గాను ఆమెకు మ‌నం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top