లాట‌రీ త‌గ‌లాల‌ని ఆమె 50 సార్లు ప్ర‌య‌త్నిస్తే… 51వ సారి రూ.17 కోట్లు త‌గిలాయ్‌..!

లాట‌రీ టిక్కెట్ల‌ను కొనేవారంతా త‌మ‌కే లాట‌రీ త‌గ‌లాల‌ని కోరుకుంటారు. కానీ అది కొన్ని కోట్ల మందిలో ఒక‌రికే త‌గులుతుంది. ఇక అది బంప‌ర్ లాట‌రీ అయితే ఆ సంఖ్య ఇంకా ఎక్కువ‌గానే ఉంటుంది. అయితే ఎవరైనా తాము కొన్న టిక్కెట్‌కు లాట‌రీ త‌గ‌ల‌క‌పోతే ఒక‌టి, రెండు సార్లు మ‌ళ్లీ మ‌ళ్లీ ట్రై చేస్తారు. అయినా రాక‌పోతే… త‌మ అదృష్టం బాగా లేద‌ని ఊరుకుంటారు. అయితే ఆమె మాత్రం అలా కాదు. ఏకంగా 50 సార్లు లాట‌రీ త‌గ‌లాల‌ని టిక్కెట్లు కొనుగోలు చేసింది. అలా వాటిని కొన్న ప్ర‌తిసారీ ఆమెకు నిరాశే ఎదురైంది. అయినా ఆమె త‌మ ప్ర‌య‌త్నం మాన‌లేదు. అయితే ఎట్ట‌కేల‌కు 51వ సారి ఆమెకు లాట‌రీ త‌గిలింది. అది ఎంతో తెలుసా..? అక్ష‌రాలా రూ.17 కోట్లు. అవును మ‌రి. మీరు విన్న‌ది క‌రెక్టే.

ఆమె పేరు నిశితా రాధాకృష్ణా పిళ్లై. భ‌ర్త పేరు రాజేష్ థంపీ. వీరిద్దరూ కేర‌ళ వాసులు. అమెరికాలో డాక్ట‌ర్లుగా స్థిర ప‌డ్డారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. వారి పేర్లు రితిక‌, నేహా. అయితే నిశితాకు లాట‌రీ టిక్కెట్ల‌ను కొన‌డం అల‌వాటుగా మారింది. మొద‌టి సారి ఆమె అబుధాబి వెళ్లిన‌ప్పుడు అక్క‌డి ఎయిర్‌పోర్టులో బిగ్ టిక్కెట్ అనే ఓ కంపెనీకి చెందిన లాట‌రీ టిక్కెట్‌ను కొనుగోలు చేసింది. అయితే అప్పుడు ఆమెకు లాట‌రీ త‌గల్లేదు. అలా ఆమె అప్ప‌టి నుంచి లాట‌రీ టిక్కెట్ల‌ను కొనుగోలు చేస్తూనే ఉంది. అయినా ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా త‌గ‌ల్లేదు. అయితే ఆమె త‌న ప్ర‌య‌త్నం మాన‌లేదు.

ఈ క్ర‌మంలో నిశితా ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 50 సార్లు లాట‌రీ టిక్కెట్ల‌ను కొనుగోలు చేయ‌గా అవ‌న్నీ ఆమెకు నిరాశ‌నే మిగిల్చాయి. అయితే తాజాగా 51వ సారి కొన్న టిక్కెట్‌కు మాత్రం ఏకంగా రూ.17 కోట్ల లాట‌రీ త‌గిలింది. ఆ టిక్కెట్ నంబ‌రు 058390. 1 కోటి దిర్హామ్‌లు ఆమెకు లాట‌రీలో త‌గిలాయి. దీంతో ఆమెకు మ‌న ఇండియ‌న్ క‌రెన్సీ ప్ర‌కారం దాదాపుగా రూ.17.68 కోట్లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ఇప్పుడామె ఆనందం అంతా ఇంతా కాదు. గ‌తంలో ఇలాగే శ్రీ‌రాజ్ అనే ఓ వ్య‌క్తికి రూ.12.72 కోట్లు రాగా ఇప్పుడు నిశాకు ఇంత పెద్ద మొత్తంలో డ‌బ్బు వ‌చ్చింది. దీంతో అంత మొత్తం ల‌భించిన జాబితాలో ఇప్పుడామె మొద‌టి స్థానంలో నిలిచింది. ఏది ఏమైనా ల‌క్ అనేది క‌ల‌సి వ‌స్తే… అప్పుడు ఎవ‌రి జీవిత‌మైనా ఇలాగే మారిపోతుంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top