”ఆంటీ… నా కళ్లు ఇప్పుడు బాగా కనిపిస్తున్నాయి. నేను బాగా చూడగలుగుతున్నా…” ఇది ఓ చిన్నారి అభిప్రాయం. ”మేడమ్ నేను గేమ్స్ బాగా ఆడగలుగుతున్నా. ఇప్పుడు అక్షరాలు కూడా నాకు చాలా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. బాగా చదువుకుంటున్నా…” ఇది ఓ స్టూడెంట్ ఒపీనియన్. ”నాకు మంచి జాబ్ దొరికింది. రోజూ చక్కగా దారి చూసుకుంటూ వెళ్తున్నా… ” ఇది ఓ వ్యక్తి చెప్పే మాటలు… కేవలం వీరే కాదు, ఎన్నో వేల మంది ఆ కంటి డాక్టర్‌ను నిత్యం కలుస్తూ చెప్పే మాటలివి. అందుకు ఆ డాక్టర్ చిరునవ్వుతో వారికి సమాధానమిస్తుంది. వారి నేత్రాలను చెక్ చేసి మళ్లీ చెకప్‌కు ఎప్పుడు రావాలో చెబుతుంది. ఆమే… డాక్టర్ సుమా గణేష్. ఎన్నో వేల మంది నేత్రాలకు వెలుగులు ప్రసాదించారు ఆమె. అది కూడా ఉచితంగా..!
డాక్టర్ సుమా గణేష్ ముంబై వాసి. 1994లో ముంబైలోని లోక్మాన్య తిలక్ మెడికల్ కాలేజీలో ఆప్తల్మాలజీలో ఎంఎస్ పూర్తి చేశారు. అనంతరం ఢిల్లీకి మారారు. అక్కడే డాక్టర్ ష్రాఫ్స్ చారిటీ కంటి హాస్పిటల్లో డాక్టర్‌గా చేరారు. అలా ఆమె అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో వేల మందికి కంటి సర్జరీలు చేశారు. చారిటీ హాస్పిటల్ కావడంతో ఆమె తన దగ్గరకు వచ్చే పేషెంట్లకు ఉచితంగానే వైద్యం చేసేవారు. అంతేకాదు, అవసరం ఉన్న వారికి చారిటీ తరఫున ఉచితంగా సర్జరీలు కూడా చేసేవారు. అయితే వాటన్నింటినీ డాక్టర్ సుమా నే స్వయంగా చేసేది. ఇప్పటికీ ఆమె రోజుకు 65 మంది పిల్లలకు కంటి పరీక్షలు చేస్తారు. సంవత్సరానికి 2వేల ఆపరేషన్లు చేస్తారు. ఆమె దగ్గర వైద్యం చేయించుకున్న వారందరికీ ఆమె అంటే ఎనలేని అభిమానం. ఆమె చికిత్స చేస్తే తమ కళ్లకు ఎలాంటి ఢోకా ఉండదని వారి అభిప్రాయం. అది అభిప్రాయం కాదు, నిజమే. ఎందుకంటే ఆమె బాధితులకు అంత ఓర్పుగా చికిత్స చేస్తారు. ఒక వేళ్ల ఆపరేషన్ చేస్తే వారికి నిరంతరాయంగా 8 నుంచి 10 ఏళ్ల పాటు ఎప్పటికప్పుడు చెకప్ చేస్తారు కూడా. దీంతో ఆమె వద్దకు వచ్చే రోగుల సంఖ్య పెరిగింది. అయినా ఎంత మంది వచ్చినా ఆమె చిరునవ్వుతో వైద్యం చేస్తారు.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 5 సెకన్లకు ఒకరు అంధులుగా మారుతున్నారట. అయితే అలాంటి ప్రతి 5 మందిలో నలుగురిని అంధత్వం నుంచి తప్పించవచ్చట. దీంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్‌తో కలిసి ఆయా దేశాల్లో ఉన్న ఇతర సంస్థలు నేత్రదానంపై, నేత్ర వైద్యంపై అంతగా అవగాహన కల్పిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలైతే ఉచిత క్యాంపులు కూడా నిర్వహిస్తూ పేదలకు సహాయం చేస్తున్నాయి. ఈ క్రమంలో డాక్టర్ సుమా గణేష్ కూడా మన దేశంలో ఉన్న అనేక స్వచ్చంద సంస్థలతో కలసి పని చేస్తున్నారు కూడా. ఇప్పటికి ఆమె సర్వీస్ చేయబట్టి చాలా సంవత్సరాలు అవుతున్నా, దేశంలో అవసరం ఉన్న పేదల నేత్రాలకు వెలుగును ప్రసాదించాలని, 2020 వరకు ఆ మిషన్ పూర్తి చేయాలని ఆమె భావిస్తున్నారు. ఆమె లక్ష్యం నెరవేరాలని మనమూ ఆశిద్దాం..!