బానిస‌గా ప‌నిచేసి, వేశ్యాగృహంలో గ‌డిపి చిత్ర‌హింస‌ల‌కు గురైన ఓ యువ‌తి ద‌య‌నీయ కథ ఇది..!

కుటుంబ స‌భ్యుల‌తో జీవితాంతం సుఖంగా, సంతోషంగా గ‌డ‌పాల‌ని ఎవ‌రికి మాత్రం ఉండదు చెప్పండి! చ‌క్క‌ని జీవితం సొంతం చేసుకోవాల‌ని ఎవ‌రైనా క‌ల‌లు కంటారు. ఆ క్రమంలో త‌మ క‌ల‌ల‌ను నిజం చేసుకుంటారు. అలా ఓ బాలిక కూడా అంద‌మైన జీవితం కావాల‌నుకుంది. గొప్ప‌గా చ‌దువుకుని మంచి ఉద్యోగం సాధించి జీవితమంతా సుఖంగా, సంతోషంగా గ‌డ‌పాల‌ని అనుకుంది. అయితే తానొక‌టి త‌లిస్తే దైవ‌మొక‌టి త‌ల‌చిన‌ట్టు ఆ బాలిక క‌న్న క‌ల‌లు మాత్రం నెర‌వేర‌లేదు. ఆగంత‌కుల చేతిలో మోసపోయి, బానిస‌గా ప‌నిచేసి, వేశ్యా వృత్తిలో గ‌డిపి కొద్ది సంవ‌త్స‌రాలు చిత్ర‌హింస‌లకు గురైంది. ఇక జీవితంలో ఏమీ మిగ‌ల‌లేదు, అంతా అయిపోయింది అనుకుంటున్న త‌రుణంలో జ‌రిగిన ఓ సంఘ‌ట‌న ఆ బాలిక జీవితాన్నే మార్చేసింది. త‌న‌కు ఎలాంటి జీవితం లేద‌ని ఒక‌ప్పుడు దుఃఖించిన ఆమే ఇప్పుడు త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డి తాను కోరుకున్న విధంగా సంతోషమైన జీవితాన్ని గ‌డుపుతోంది.

divya

మ‌హారాష్ట్ర‌లోని ఓ మారుమూల గ్రామానికి చెందిన దివ్య అనే బాలిక‌ది పేద కుటుంబం. ఎలాగైన క‌ష్ట‌ప‌డి చ‌దివి మంచి స్థానాన్ని సంపాదించి జీవితమంతా సుఖంగా, సంతోషంగా జీవించాల‌ని అనుకుంది. కానీ పేద‌రికం కార‌ణంగా ఆమెను త‌ల్లిదండ్రులు చ‌దివించ‌లేదు. దీంతో చ‌దువుకోవాల‌నే కోరిక దివ్య మ‌న‌సులో బ‌లంగా ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలో త‌మ ప‌క్కింట్లో నివసించే ఓ వ్య‌క్తి దివ్య‌ను బాగా చ‌దివిస్తాన‌ని ఆశ పెట్టాడు. ఈ క్ర‌మంలో స‌హ‌జంగానే దివ్య అతనికి ఆక‌ర్షిత‌మైంది. అప్పుడామెకు 6 సంవ‌త్స‌రాలు. అలా ఆ వయ‌స్సు ఆ వ్య‌క్తి చూపించిన ఆశ‌కు ఇంట్లో ఎవ‌రికీ చెప్ప‌కుండా దివ్య అతనితో క‌లిసి ముంబై వెళ్లింది. కానీ ఆ వ్య‌క్తి దివ్య‌ను మోసం చేశాడు. ఓ నేపాలీ కుటుంబానికి బానిస‌గా ప‌నిచేసేందుకు గాను రూ.50వేల‌కు ఆమెను ఆ వ్య‌క్తి అమ్మేశాడు. దీంతో ఒక్క‌సారిగా దివ్య షాక్‌కు గురైంది. తాను మోస‌పోయాన‌ని గ్ర‌హించింది. అయితే అప్ప‌టికే ప‌రిస్థితి చేయి దాటి పోయింది. త‌న‌కు వెనక్కి వెళ్లే అవ‌కాశం కూడా లేక‌పోయింది.

అలా ఆ నేపాలీ కుటుంబంలో ప‌ని మ‌నిషిగా చేస్తున్న దివ్య నిత్యం చిత్ర‌హింస‌ల‌ను ఎదుర్కొనేది. వారు ఆమెను పని స‌రిగ్గా చేయ‌డం లేదంటూ కొట్టేవారు. వాటికి దివ్య తాళ‌లేక‌పోయేది. అలా ఆమె త‌న‌కు 8 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు వ‌చ్చే వ‌ర‌కు వారి ద‌గ్గ‌ర చేసింది. అనంత‌రం బార్‌లో డ్యాన్స్ చేసే బార్ గ‌ర్ల్‌గా కొంద‌రు ఆమెను ఆ వృత్తిలోకి దించారు. అక్క‌డ కూడా దివ్య ప‌రిస్థితిలో మార్పేమీ రాలేదు. నిత్యం దెబ్బ‌ల‌ను, సిగ‌రెట్‌తో కాల్చిన గాయాల‌ను చ‌వి చూసింది. అటు త‌రువాత కొంద‌రు ఆమెను ముంబైలోని కామ‌టిపుర రెడ్‌లైట్ ఏరియాలో ఉన్న వేశ్యా గృహానికి అమ్మేశారు. అక్క‌డ దివ్య జీవితం మ‌రింత నర‌కంగా మారింది. నిత్యం ఆమె వ‌ద్ద‌కు అధిక సంఖ్య‌లో విటులు వ‌చ్చేవారు. వారంతా దివ్య‌ను చిత్రహింస‌ల‌కు గురి చేసేవారు. అప్పుడామెకు 10 ఏళ్లు మాత్ర‌మే.

అలా వేశ్యాగృహంలో ఉన్న ఆమె వ‌ద్ద‌కు ఓ రోజు ఓ వ్య‌క్తి విటుడిలా వ‌చ్చాడు. అత‌ను దివ్య‌ను చూసి కంగుతిన్నాడు. అయితే ఆ వ్య‌క్తి ఏం ఆలోచించాడో తెలియ‌దు కానీ వెంట‌నే వెళ్లి స్థానిక పోలీసుల‌ను తీసుకొచ్చాడు. వారు ఆ గృహంపై రైడ్ చేసి దివ్య‌తోపాటు మ‌రికొంద‌రు అలాంటి బాలిక‌ల‌ను చేరదీశారు. ఈ క్ర‌మంలో పోలీసులు దివ్య‌ను చెంబూర్‌లోని దేవ్‌నాథ్ హోం అనే రెస్క్యూ హోంకు త‌ర‌లించారు. అక్క‌డి నుంచి దివ్య కొత్త జీవితం ప్రారంభించింది. ఓ స్వ‌చ్ఛంద సంస్థ స‌హ‌కారంతో బ్యుటిషియ‌న్ కోర్స్ చేసింది. ఇప్పుడు ఓ పాపుల‌ర్ బ్యూటీ పార్ల‌ర్‌లో హెయిర్ స్టైలిస్ట్‌గా ప‌నిచేస్తోంది. అలా ప‌ని చేసి సంపాదించుకున్న డ‌బ్బుతో సొంతంగా ఓ ఇల్లు కూడా కొనుక్కుంది. ఒక‌ప్పుడు తాను అనుకున్న సుఖ‌మైన జీవితాన్ని ఇప్పుడు త‌ను ఆస్వాదిస్తోంది. అయితే ఆమె అంత‌టితో ఆగ‌లేదు. తాను ఒక‌ప్పుడు న‌ర‌కం అనుభ‌వించిన అదే కామ‌టిపుర‌కు వెళ్లి త‌న‌లా క‌ష్టాలు అనుభ‌విస్తున్న బాలిక‌ల‌ను చేరదీసి వారు ధైర్యంగా ముంద‌డుగు వేసేలా, సొంత కాళ్ల‌పై నిల‌బ‌డేలా వారిలో స్ఫూర్తిని నింపుతోంది. వారికి ప్రేర‌ణ‌ను, ఉత్సాహాన్ని ఇస్తోంది. హ్యాట్సాఫ్ టు దివ్య‌..!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top