నీటిపై ప్ర‌త్యేక చ‌ట్టం చేసిన ఉరుగ్వే… అలా చేస్తే మ‌న దేశంలోనూ నీటి క‌ష్టాలు తీరుతాయి..!

నీరు అనేది మ‌నకు ప్ర‌కృతి ప్ర‌సాదించిన స‌హ‌జ సిద్ధ‌మైన వ‌న‌రు. దాన్ని వాడుకునేందుకు భూమిపై ఉన్న జీవులకు అర్హ‌త ఉంది. అది ఏ ఒక్క‌రి సొత్తూ కాదు. అయితే మ‌న దేశంలో కొన‌సాగుతున్న ప్ర‌భుత్వాలు, అవి తెస్తున్న ఆదేశాల వ‌ల్ల స‌హ‌జ సిద్ధ వ‌న‌రు అయిన నీరు కాస్తా ప్రైవేటు వ్య‌క్తుల చేతుల్లోకి వెళ్తోంది. దీంతో సాధార‌ణ జ‌నాల‌కు నీరు దొర‌కకుండా పోతోంది. ఈ క్ర‌మంలో ఆ నీటిని అమ్ముకునే కార్పొరేట్ కంపెనీలు కోట్ల రూపాయ‌ల‌ను అక్ర‌మ దారిలో ఆర్జిస్తున్నాయి. అందుకు చ‌త్తీస్‌గ‌డ్‌లోని శివ‌నాథ్ న‌దిలో జ‌రుగుతున్న దందాయే కార‌ణం. అక్క‌డ గ‌త కొన్నేళ్లుగా ఓ ప్రేవేటు కంపెనీ ఇష్టారాజ్యంగా నీటిని తోడుకుంటూ ఆ న‌దిని దీన స్థితికి చేర్చింది. దీనికి తోడు చుట్టూ ఉండే ప‌రిశ్ర‌మ‌లు త‌మ కంపెనీల్లో విడుద‌ల‌య్యే వ్య‌ర్థాల‌ను కూడా ఆ న‌దిలోకే వ‌దులుతున్నాయి. దీంతో ఆ న‌ది నీరు ఇప్పుడు కాలుష్యానికి కేరాఫ్‌గా మారింది.

చ‌త్తీస్‌గ‌డ్‌లో ఉన్న శివ‌నాథ్ న‌ది 345 కిలోమీట‌ర్లు పొడ‌వైంది. ఈ న‌ది అలా అనేక కిలోమీట‌ర్ల పాటు ప్ర‌వ‌హించి మ‌హాన‌దిలో క‌లుస్తుంది. అయితే చ‌త్తీస్‌గ‌డ్‌లో ద‌ర్గ్ అనే జిల్లాలో ఉన్న శివ‌నాథ్ న‌దికి చెందిన 23.5 కిలోమీట‌ర్ల పొడ‌వైన న‌దీ మార్గం నుంచి నీటిని సేక‌రించి స్థానికంగా ఉండే బొరై ఇండ‌స్ట్రియ‌ల్ ఏరియాకు ఇవ్వ‌డం కోసం అప్ప‌ట్లో ఒప్పందం చేసుకున్నారు. చ‌త్తీస్‌గ‌డ్ స్టేట్ ఇండ‌స్ట్రీస్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ (సీఎస్ఐడీసీ), రేడియ‌స్ వాట‌ర్ లిమిటెడ్ (ఆర్‌డ‌బ్ల్యూఎల్‌) అనే ప్రైవేటు సంస్థ‌కు మ‌ధ్య ఈ ఒప్పందం కుదిరింది. దీని ప్ర‌కారం ఆర్‌డ‌బ్ల్యూఎల్ సంస్థ స‌ద‌రు న‌దీ మార్గంలో ఉన్న నీటిని తోడి కంపెనీల‌కు అందించాలి. అందుకు గాను ఆయా కంపెనీల నుంచి బిల్లుల‌ను సేక‌రించి సీఎస్ఐడీసీ కొంత మొత్తాన్ని ఆర్‌డ‌బ్ల్యూఎల్ అనే సంస్థ‌కు చెల్లిస్తుంది. అలా 1998లోనే ఈ ఒప్పందం జ‌ర‌గ్గా ఇది నేటికీ కొన‌సాగుతోంది.

అయితే ఆ ఒప్పందం మాటేమోగానీ గ‌త 19 సంవత్స‌రాలుగా ఆర్‌డ‌బ్ల్యూఎల్ సంస్థ ఆ న‌ది నుంచి నీటిని అక్ర‌మంగా తోడేస్తుంది. ఈ క్ర‌మంలో ఆ న‌దిపై ఆధార ప‌డ్డ అనేక మంది ప్ర‌జ‌ల బ‌తుకులు దుర్భ‌ర‌మ‌య్యాయి. నీరు కాలుష్యం అవ‌డంతో చుట్టు ప‌క్క‌ల ఉన్న రైతులు పంట‌ల‌ను పండించ‌డం ఆపేశారు. కుండ‌లు చేసుకునే వారు స‌రైన మ‌ట్టి దొర‌క్క ఆ వృత్తి మానేశారు. చేప‌లు అస‌లు ఆ నదిలో ల‌భించ‌క‌పోవ‌డంతో మ‌త్స్య‌కారుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా మారింది. దీనికి తోడు చుట్టు ప‌క్క‌ల ఉన్న గ్రామాల ప్ర‌జ‌ల‌కు స‌రైన తాగునీరు ల‌భించ‌డం లేదు. ఈ క్ర‌మంలో వారు అనేక రోగాల బారిన ప‌డుతున్నారు. అంతేకాకుండా ఆ న‌దికి స‌మీపంలో ఉన్న ప‌రిశ్ర‌మ‌లు త‌మ కంపెనీల్లో విడుద‌ల‌య్యే వ్య‌ర్థాల‌ను కూడా ఆ న‌దిలోకి వ‌దులుతుండ‌డంతో ఇక ఆ న‌ది ప‌రిస్థితి మ‌రింత ద‌య‌నీయంగా మారింది.

మ‌రి ఇంత జ‌రుగుతున్నా అక్క‌డి ప్ర‌భుత్వం ప‌ట్టించుకోవ‌డం లేదా..? అంటే ఇటీవ‌లే కొంద‌రు స్వ‌చ్చంద సంస్థ‌ల ప్ర‌తినిధులు కోర్టులో కేసు వేయ‌గా ఇప్పుడ‌ది పెండింగ్‌లో ఉంది. దాని తీర్పు వ‌స్తేనే గానీ అక్క‌డి ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రిగేలా లేదు. అయితే స‌రిగ్గా ఇలాంటి సంఘ‌ట‌నే ఉరుగ్వే అనే దేశంలో చోటు చేసుకుంది. అక్క‌డ ఓ న‌ది స్థితి కూడా ఇలాగే అయితే అక్క‌డి ప్ర‌జ‌లు ఏక‌మై అంద‌రూ స్పందించి సంత‌కాల‌ను సేకరించారు. స‌ద‌రు దేశంలో చ‌ట్టాల‌ను మార్చాలంటే ఏదైనా నియోజ‌క‌వ‌ర్గం నుంచి కనీసం 2.30 ల‌క్ష‌ల సంత‌కాలు అవ‌స‌రం. ఈ క్ర‌మంలో అక్క‌డి ప్ర‌జ‌లు అనేక స‌భ‌లు, స‌మావేశాలు, గ్రూప్ మీటింగ్స్ పెట్టి అంద‌రిలోనూ అవ‌గాహ‌న క‌ల్పించారు. అప్పుడు ఏకంగా 2.83 ల‌క్ష‌ల సంతకాల‌ను సేక‌రించ‌గ‌లిగారు. దీంతో ప్ర‌భుత్వం ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మై కొత్త చ‌ట్టం తెచ్చింది. దాని ప్ర‌కారం ఇప్పుడ‌క్క‌డ నీరు స‌హ‌జ వ‌న‌రుగా, అంద‌రికీ ల‌భించాల్సిన ప్రాథ‌మిక హ‌క్కుగా మారింది. నీరు అనేది ప్రైవేటు వ్య‌క్తుల చేతుల్లోకి వెళ్ల‌కూడ‌ద‌ని, ప్ర‌భుత్వాలే దాని కోసం ప్ర‌త్యేక వ్య‌వ‌స్థ‌ల‌ను ఏర్పాటు చేసి నిర్వ‌హించాల‌ని, స్వ‌చ్ఛ‌మైన నీటిని ప్ర‌జ‌ల‌కు అందించాల‌ని ఆ చ‌ట్టంలో ఉంది. అలాంటి స్పంద‌నే శివ‌నాథ్ న‌ది ప‌రివాహ‌క ప్రాంత ప్ర‌జ‌ల‌లో వ‌స్తే… అప్పుడు ఏకంగా మ‌న దేశంలో కూడా నీరు అనేది ప్రైవేటు వ్య‌క్తుల చేతుల్లోకి వెళ్ల‌దు. ప్ర‌తి పౌరుడికి స్వచ్ఛ‌మైన నీరు దొరుకుతుంది. అప్పుడు నీటి క‌ష్టాలు కూడా తీరుతాయి.

Comments

comments

Share this post

scroll to top