తరగతి గదిలో మనం ఎన్నో విషయాలను నేర్చుకుంటాం. విశ్వాన్ని చూస్తాం. అందులోని సంగతులను, వింతలు, విశేషాలను తెలుసుకుంటాం. ప్రతి ఉపాధ్యాయుడు చెప్పే ఒక్కో పాఠం మనకు అనేక విషయాలను నేర్పుతుంది. అలాగే ప్రయాణం కూడా… సుదీర్ఘంగా సాగే ఆ క్రియలో ప్రతి మీటరుకు, కిలోమీటరుకు మనకు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు, కొత్త దారులు తెలుస్తాయి. అవన్నీ మనకు జీవితపు అనుభవాలుగా నిలుస్తాయి. వాటిలో కొన్ని దురదృష్టకరమైనవి అయితే, కొన్ని అదృష్టమైనవి అవుతాయి. ఏ అనుభవమైనా మనకు మానవత్వంగా ఉండమనే చెబుతుంది. ఇవీ… ఆ యువతి అంటున్న మాటలు. అందుకే… స్నేహితులు మోసం చేసినా… వందల కిలోమీటర్లు ఒంటరిగా, దుర్భర పరిస్థితుల్లో ప్రయాణం చేయాల్సి వచ్చినా బాధపడలేదు. భయపడలేదు. ఎట్టకేలకు చివరకు తన గమ్య స్థానం చేరుకుంది.
ఆమె పేరు సుమన్ దూగర్. ఉంటోంది ఢిల్లీలో. కొంత కాలం క్రితం తన స్నేహితులతో కలసి లెహ్ – లదాక్ ట్రిప్‌కు వెళ్లింది. అయితే ట్రిప్‌లో ఏం జరిగిందో తెలియదు కానీ… స్నేహితులు ఆమెను మోసం చేశారు. దీంతో లదాక్‌లో ఉన్న ఆమె తిరిగి ఇంటికి చేరుకునేందుకు ఒంటరిగానే బయల్దేరింది. అయితే అందుకు ఆమె వద్ద ఎలాంటి సామాను లేదు. దుస్తులు లేవు. తింటానికి తిండి లేదు. అయినా వెళ్లాలనే అనుకుని అలాగే ప్రయాణం ప్రారంభించింది. మృగాళ్ల చూపుల నుంచి తప్పించుకుంటూ, సౌకర్యవంతంగా లేని రైలు ప్రయాణం చేస్తూ, ఆకలికి అలమటిస్తూ ప్రయాణం కొనసాగించింది.
దారి మధ్యలో కొందరు మహానుభావులు ఆమెకు ఆహారం పెట్టారు. రైలులో పడుకోవడానికి స్థలం కల్పించారు. రైలు దిగాక టాక్సీ డ్రైవర్లు కొందరు ఆమెను కావల్సిన చోట దింపేందుకు ముందుకు వచ్చారు. వైద్యులు ఆమెకు ఉచితంగా చికిత్స చేసి మందులు ఇచ్చారు. ఆ రోజు రాత్రి 7.30 అయింది. అది నజిబాబాద్. అక్కడి నుంచి బిజ్నోర్ వెళ్లాలి. అటు నుంచి ఢిల్లీకి ప్రయాణం. అంతటి రాత్రి పూట నజిబాబాద్‌లో తినేసేలా చూస్తున్న కొందరు మృగాళ్ల బారి నుంచి ఓ వ్యక్తి ఆమెను రక్షించాడు. ఆమెను సేఫ్‌గా బస్‌లో తీసుకెళ్లాడు. బిజ్నోర్ వద్ద ఆమెను దిగబెట్టాడు. ఢిల్లీకి వెళ్లాల్సిన బస్సు మరో 2 గంటల్లో వస్తుంది. అప్పటికి ఆమె ప్రయాణం దాదాపుగా పూర్తయింది. అప్పుడే ఆమె అనుకుంది… పైన చెప్పిన మాటలను… ప్రయాణంలో, జీవితంలో అన్నీ మనకు అనుకూలంగా జరగవు. దురదృష్టకర సంఘటనలు కూడా కొన్ని జరుగుతాయి. కానీ… ఎప్పుడైనా, ఎక్కడైనా మానవత్వమే ముఖ్యం… అని..!