తండ్రి చ‌నిపోవడంతో కుటుంబ పెద్ద‌గా మారిన ఆ బాలుడి య‌దార్థ గాథ ఇది. చ‌దివితే క‌న్నీళ్లు వ‌స్తాయి..!

”ఆ రోజు బాగా వ‌ర్షం ప‌డుతోంది. నాన్న నన్ను ఎత్తుకుని భుజాలపై స్కూల్‌కి తీసుకెళ్లాడు. క్లాస్‌లో కూర్చుని చ‌దువుకుంటుండ‌గా వ‌ర్షం ఇంకా ఎక్కువైంది. అది ఇంగ్లిష్ లో నాకు బాగా నచ్చిన పొయెట్రీ. ఓ వైపు క్లాస్‌లో రూమ్‌పైన షెడ్డులో నుంచి వ‌ర్ష‌పు చినుకులు జోరుగా ప‌డుతున్నాయి. అయినా ఆ పొయెట్రీ చ‌ద‌వ‌డంలోనే నేను నిమ‌గ్న‌మ‌య్యా. ఎందుకో ఆ పొయెట్రీని బాగా చ‌ద‌వాల‌నిపించింది. న‌న్ను స్కూల్‌లో దింపిన నాన్న గుర్తుకు వ‌చ్చాడు. ఆయ‌న అక్క‌డికి కొద్ది దూరంలోనే ఓ బ్రిడ్జి కింద షూ పాలిష్ చేస్తుంటాడు. అందులో వ‌చ్చే డ‌బ్బుల‌తోనే న‌న్ను, నా త‌మ్ముళ్ల‌ను, అక్క‌ను చ‌దివిస్తున్నాడు. ఇంతలో ఓ హ‌ఠాత్ ప‌రిణామం. కొద్ది రోజుల‌కు నాన్న చ‌నిపోయాడు.

మా కుటుంబానికి ఉన్న పెద్ద దిక్క‌యిన నాన్న పోవ‌డంతో అమ్మ‌కు ఏం చేయాలో అర్థం కాలేదు. నేను నాన్న‌కు చెందిన షూ పాలిష్ కిట్ తీసుకున్నా. అదే బ్రిడ్జి కింద‌కు వెళ్లా. పని మొద‌లు పెట్టా. ఒక క‌స్ట‌మ‌ర్ వ‌చ్చాడు. షూ పాలిష్ చేయ‌మ‌న్నాడు. కానీ నాకేమో ఆ ప‌ని తెలియ‌దు. ఎలా చేయాలో అర్థం కాలేదు. ఆ క‌స్ట‌మ‌ర్ న‌న్ను తిడుతూ చేతిలో ఉన్న షూ తీసుకుని వెళ్లిపోయాడు. వెంట‌నే నాకు దుఃఖం వ‌చ్చింది. ఆగ‌లేదు. ఆ త‌రువాత కొంత సేప‌టికి మ‌రో క‌స్ట‌మ‌ర్ వ‌చ్చాడు. అత‌న్ని చూస్తేనే నాకు భ‌యం వేసింది. అత‌ని గొంతు చాలా పెద్ద‌ది. అత‌ను కూడా అరుస్తాడేమో అనుకున్నా. అత‌ను అలా చేయ‌లేదు. షూ పాలిష్ చేయ‌మ‌న్నాడు. నేను షూ తీసుకుని పాలిష్ చేస్తున్నా. అయింద‌ని చెప్పి షూ ఇచ్చా. మ‌రో ప‌క్క బాగాలేదు మ‌ళ్లీ చేయ‌మ‌న్నాడు. మ‌ళ్లీ పాలిష్ చేశా. ఇంకో ప‌క్క బాగా లేద‌ని మ‌ళ్లీ షూ ఇచ్చాడు. మ‌ళ్లీ బాగా పాలిష్ చేశా. అలా 4 సార్లు ప‌దే ప‌దే పాలిష్ చేశా. దీంతో మ‌రోసారి ఏడుపు వ‌చ్చింది. అప్పుడ‌త‌ను అన్నాడు. షూ బాగా పాలిష్ చేశావ్. అద్దాల్లా మెరుస్తున్నాయ్, ఇదిగో తీసుకో అంటూ ఓ వంద రూపాయ‌ల నోటు చేతిలో పెట్టాడు. అప్పుడే అత‌ను అన్నాడు, ఏడిస్తే ఏ ప‌ని అవదు, నీ స‌మ‌యాన్ని, శ‌క్తిని ప‌నిచేయ‌డం కోసం వాడు, అన్నాడు.

అప్పుడు అత‌ను అలా అన్నాక నాకు వేయి ఏనుగుల శ‌క్తి వ‌చ్చింది. వెంట‌నే అనుకున్నా, ఇక ఏడ‌వ‌కూడ‌ద‌ని. ఆ రోజు బాగా ప‌నిచేశా. మొద‌టి రోజే రూ.300 సంపాదించా. అలా 3 ఏళ్ల పాటు ప‌నిచేశా. అందులో వ‌చ్చే సంపాద‌న‌తోనే అక్క పెళ్లి చేశా. తమ్ముళ్లిద్ద‌రినీ స్కూల్‌కు పంపుతున్నా. నేనూ వీలున్న‌ప్పుడ‌ల్లా చ‌దువుతున్నా. అప్పుడు చ‌ద‌వకుండా మానేసిన నాకు ఎంతో ఇష్ట‌మైన పొయెట్రీని ఇప్పుడు చ‌దువుతున్నా. అవును, ఆ రోజు గ‌న‌క ఆ పెద్ద మ‌నిషి అలా అన‌క‌పోయి ఉంటే, నేను ఇప్పుడు ఇలా ఉండేవాన్ని కాదు. ఇప్పటికీ కొంద‌రు న‌న్ను తిడ‌తారు. అయినా ఏడ‌వ‌ను. ఏడిస్తే ఏమీ రాద‌ని తెలుసు క‌దా. అందుకే న‌వ్వుతాను..!”

— తండ్రిని కోల్పోయి కుటుంబ పెద్ద‌గా మారి దీనావ‌స్థ‌లో జీవ‌నం గడుపుతున్న ఉత్త‌మ్ చంద్ర‌దాస్ అనే ఓ 15 ఏళ్ల బాలుడి య‌దార్థ గాథ ఇది..!

Comments

comments

Share this post

scroll to top