రైలులో ప్ర‌యాణించిన ఓ కుటుంబానికి, పోలీసుల‌కు మ‌ధ్య జ‌రిగిన వాస్త‌వ ఘ‌ట‌న ఇది..!

రైళ్ల‌లో ప్ర‌యాణం చేస్తున్న‌ప్పుడు రిజ‌ర్వేష‌న్ లేకుండా సాధార‌ణ జ‌న‌ర‌ల్ సీట్లో కూర్చుని వెళ్తున్న‌ప్పుడు ఎవ‌రైనా మ‌న సీట్లో కూర్చుంటేనే అర‌చి గ‌గ్గోలు పెడ‌తాం. వారిని తిట్టినంత ప‌నిచేస్తాం. ఇక రిజ‌ర్వేష‌న్ చేయించుకున్న మ‌న సీట్లో వేరే ఎవ‌రైనా కూర్చుంటే అస‌లు ఊరుకుంటామా..? అది ఎక్క‌డి వ‌ర‌కైనా వెళ్తుంది. అయితే మ‌రి అలాంటి రిజ‌ర్వ్‌డ్ సీట్లో కూర్చున్న‌ది పోలీసులు అయితే..? సాధార‌ణ ప్ర‌జ‌ల‌ను లేపిన‌ట్టు వారిని లేప‌గ‌ల‌మా..? అస‌లు వారితో మాట్లాడేందుకే జంకుతారు..! ఇక సీటు మాట దేవుడెరుగు..! అంతే క‌దా..! అవును, ఓ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్ర‌యాణిస్తున్న కుటుంబానికి స‌రిగ్గా ఇదే అనుభ‌వం ఎదురైంది.

ఆ రోజు ఫిబ్ర‌వ‌రి 19, 2017. అది ల‌క్నో నుంచి రూర్కీ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు. దాని నంబ‌ర్ 12231. అందులో ఎస్‌2 స్లీప‌ర్ క్లాస్ కోచ్‌లో ఎక్కింది ఓ కుటుంబం. అయితే అప్ప‌టికే ఆ బోగీ అంతా కిక్కిరిసి పోయింది. అడుగు తీసి అడుగు వేసేందుకు జాగ లేదు. ఈ క్రమంలోనే ఆ కుటుంబ స‌భ్యులు త‌మ త‌మ బెర్త్‌ల వ‌ద్ద‌కు చేరుకున్నారు. అవి ముందుగానే రిజ‌ర్వ్ చేయ‌బ‌డి, క‌న్‌ఫం అయిన బెర్త్‌లు. అయితే అప్ప‌టికే వాటిలో కొంద‌రు పోలీసులు తిష్ట వేశారు. త‌మ పెద్ద పెద్ద ల‌గేజీ మూట‌ల‌తో, వాటిలో గ‌న్‌లు, రైఫిల్స్‌తో ఆ బెర్త్‌ల‌ను కాస్తా ఆక్ర‌మించారు. వారిని చూసిన ఆ కుటుంబంలోని ఓ యువ‌కుడు త‌మ బెర్త్‌లు అవ‌ని, వాటిని తాము రిజ‌ర్వేష‌న్ చేయించుకున్నామ‌ని, లేవాల‌ని విన‌యంగా అడిగాడు. అయితే వాటిలో కూర్చున్న‌ది పోలీసులు క‌దా. అంత సుల‌భంగా ఎలా లేస్తారు..? లేవం.. పొమ్మన్నారు..! తాము యూపీ ఎన్నిక‌ల్లో బందోబ‌స్తుకు వెళ్తున్నామ‌ని, 3 రోజుల పాటు ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంద‌ని, రెస్ట్ కావాల‌ని, అందుకే తాము లేవ‌మని క‌రాఖండిగా చెప్పేశారు. అయితే రిజ‌ర్వేష‌న్ చేయించుకున్నారు కాబ‌ట్టి అందుకైన డ‌బ్బులు ఇస్తామ‌న్నారు. కానీ ఆ కుటుంబం ఒప్పుకోలేదు. అయినా స‌రే… మీరేమైనా చేసుకోండి, మేం లేవం.. అని ఆ పోలీసులు అక్క‌డే తిష్ట వేశారు. దీంతో ఆ కుటుంబ స‌భ్యులు చేసేది లేక అక్క‌డే అలాగే నించున్నారు.

అయితే ఆ బోగీలో అంద‌రూ ఆ కుటుంబ స‌భ్యుల‌ను దీనంగా చూస్తున్నారు కానీ ఎవ‌రూ సాహ‌సం చేసి ఆ పోలీసులను నిల‌దీయ‌లేదు. కార‌ణం… వారు పోలీసులు క‌దా… ఏదైనా అంటే… అది ఎంత దూర‌మైనా వెళ్తుంది, ఎందుకులే రిస్క్ అని ఎవ‌రూ ప్ర‌శ్నించ‌లేదు. అయితే టీసీ వ‌చ్చినా వారి స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదు. అత‌ను కూడా వారిని కొంత సేపు ఓపిక ప‌ట్టాల‌ని చెప్ప‌డంతో చేసేది లేక వారు ఎప్ప‌టిలాగే నించున్నారు. అలా 3 గంట‌ల ప్ర‌యాణం అనంతరం టీసీ వారికి వేరే బెర్త్‌లు స‌ర్దుబాటు చేశాడు.

ఇప్పుడు మేం చెప్పింది క‌థ కాదు. నిజంగా జ‌రిగిందే. ఈ నెల 19వ తేదీన జ‌రిగిన య‌దార్థ ఘ‌ట‌న ఇది. ఆ బోగీలో ఏం చేయ‌లేక చూస్తూ ఉన్న ఇత‌ర ప్ర‌యాణికుల్లాగే ఓ ప్ర‌యాణికుడు కూడా ఉన్నాడు. అత‌నే ఈ తంతునంతా నెట్‌లో షేర్ చేశాడు. అయితే అంత‌కు ముందు రోజు కూడా అత‌నికి ఇలాంటి ఘ‌ట‌నే ఎదురైంద‌ట‌. అప్పుడు కూడా అత‌ను ఏం చేయ‌లేక స‌ర్దుకుపోయాడు. కానీ ఆ కుటుంబ స‌భ్యుల‌తోపాటు త‌న ఆవేద‌న‌ను కూడా ఈ స్టోరీ రూపంలో సోష‌ల్ మీడియాలో పంచుకున్నాడు. అవును మ‌రి. అంతకు మించి సాధార‌ణ ప్ర‌జ‌ల‌కు ఏం చేద్దామ‌న్నా ఎందుకు వీల‌వుతుంది, అలా చేస్తే ఏదో ఒక రూపంలో బెదిరింపులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది, ఒక్కోసారి అది ప్రాణాల‌కు ప్ర‌మాద‌మే క‌లిగించ‌వ‌చ్చు, మ‌రి సైలెంట్‌గా ఉండ‌క‌పోతే ఏం చేస్తారు..? కొంపదీసి రైల్వే మంత్రి సురేష్ ప్ర‌భుకు ట్వీట్ చేస్తారా..? ఏమో చేస్తే తెలుస్తుంది..! ఆయ‌న స్పందిస్తాడు కాబోలు..! అయినా… బందోబస్తుకు పంపే పోలీసుల‌కు ప్ర‌భుత్వం ట్రావెల్ అల‌వెన్స్ ఇస్తుంది క‌దా.. మ‌రి ఇత‌రుల సీట్ల‌లో ప్ర‌యాణించ‌క‌పోతే రిజ‌ర్వేష‌న్ చేయించుకోవ‌చ్చు క‌దా, ఓ… ర‌ద్దీ ఉంటుంది క‌దా..! అయినా ఫ‌ర్లేదు… త‌త్కాల్ ఉండ‌నే ఉంది క‌దా..! ఎంచ‌క్కా అందులో వెళ్తే స‌రి..! ఇలా ప్ర‌యాణికుల‌ను బెదిరించి వారి సీట్ల‌ను అన్యాయంగా లాక్కుని వాటిల్లో ప్ర‌యాణించ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్‌..? ప‌్ర‌జ‌ల‌కు సేవ చేయాల్సిన మీరే ఇలా చేస్తే వారు ఇక ఎవ‌రికి చెప్పుకుంటారు..? ఓసారి మీరే ఆలోచించండి… పోలీస్ బాసులూ..!

Comments

comments

Share this post

scroll to top