ఐఏఎస్ అవడం అంటే మాటలు కాదు. అందుకు ఎంతగానో కష్టపడాల్సి ఉంటుంది. నిత్యం కొన్ని గంటల పాటు సమయాన్ని చదువుకే కేటాయించాల్సి ఉంటుంది. అనంతరం కఠినతరమైన పరీక్షలో పాస్ కావాలి. ఇంటర్వ్యూలో నెగ్గాలి. ఆ తరువాతే సక్సెస్ అయితే ఐఏఎస్ అవుతారు. అయితే అంతటి కష్టతరమైన పరీక్షను చీటింగ్ చేసి పాస్ అవుదామనుకున్నాడు ఓ వ్యక్తి. నిజానికి అతను గతంలోనూ ఐఏఎస్ రాశాడు. కానీ ర్యాంక్ రాకపోవడం వల్ల ఐపీఎస్ కు ఎంపికయ్యాడు. అయినప్పటికీ అతను తృప్తి చెందలేదు. మళ్లీ సివిల్స్ రాద్దామనుకుని అలాగే చేశాడు. కానీ ఈ సారి కష్టపడడం ఇష్టం లేదేమో పరీక్షలో కాపీ కొట్టాడు. దీంతో అతను ఏకంగా ప్రస్తుతం చేస్తున్న ఐపీఎస్ కొలువుకు కూడా దూరమయ్యాడు.
అతని పేరు సఫీర్ కరీం. కేరళలోని అలువా వాసి. అయితే ఇతను గతంలో రెండు సార్లు సివిల్స్ రాశాడు. కానీ ర్యాంక్ రాలేదు. 2015లో మళ్లీ ట్రై చేయగా 112వ ర్యాంక్ వచ్చింది. దీంతో ఐపీఎస్‌కు సెలెక్ట్ అయ్యాడు. కానీ ఐఏఎస్ అవుదామనుకున్నది అతని కల. కాగా అప్పట్లోనే సఫీర్ కరీమ్స్ ఐఏఎస్ పేరిట పలు కోచింగ్ సెంటర్లను కొచ్చి, తిరువనంతపురంలలో ఏర్పాటు చేశాడు. ఈ క్రమంలో వాటి ద్వారా సివిల్స్ అభ్యర్థులకు ఐఏఎస్ కోచింగ్ ఇచ్చేవాడు. అయితే అదే క్రమంలో జాయిస్ జాయ్ అనే లెక్చరర్ కరీంకు పరిచయమైంది. అది ప్రేమగా మారడంతో ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇక కరీం ఐపీఎస్‌కు సెలెక్ట్ అయి తిరునల్వేలిలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్నాడు. జాయిస్ జాయ్ హైదరాబాద్‌లో ఓ ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో పనిచేస్తోంది.
అయితే 2015 తరువాత ఇప్పుడు మళ్లీ తాజాగా కరీం సివిల్స్ రాశాడు. కాగా ఈ సారి అతను కష్టపడుదామనుకోలేదు. కాపీ కొట్టాలని అనుకున్నాడు. అందులో భాగంగానే ఎగ్జామ్ సెంటర్‌కు ఫోన్, బ్లూటూత్ ఇయర్ పీస్, చిన్నపాటి స్పై కెమెరాను తీసుకెళ్లాడు. ఫోన్‌ను జేబు లోపల పెట్టుకుని బ్లూటూత్ చెవికి పెట్టుకున్నాడు. తాను తెచ్చుకున్న స్పై కెమెరాను షర్ట్ బటన్‌కు పెట్టుకున్నాడు. దీంతో ఆ కెమెరా ద్వారా క్వశ్చన్ పేపర్‌ను ఫొటోలు తీసి హైదరాబాద్ లో ఉన్న తన భార్య జాయిస్కు పంపగా, ఆమె అక్కడి ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో ఉండి అతనికి జవాబులను ఫోన్లో డిక్టేట్ చేసింది. అయితే కరీం కదలికలపై నిఘా పెట్టిన ఇంటెల్లిజెన్స్ బ్యూరో అధికారులు ముందునుంచే అతన్ని ఫాలో అవుతూ వచ్చారు. చివరకు ఎగ్జామ్ హాల్లో రెడ్ హ్యాండెడ్‌గా అతన్ని పట్టుకున్నాడు. దీంతో అతని వద్ద ఫోన్, ఇతర వస్తువులు బయట పడ్డాయి. ఈ క్రమంలో అతన్ని ఇంటెల్లిజెన్స్ బ్యూరో వారు అరెస్టు చేశారు. కాగా కరీం ఐపీఎస్ ఆఫీసర్‌గా ఇక పనిచేయబోడని, అతను సస్పెండ్ అవుతాడని, ఐబీ వర్గాలు చెప్పాయి. అవును మరి, పరీక్షల్లో కాపీ కొడితే అంతేగా. ఏది ఏమైనా ఇతగాన్ని ముందే పట్టుకున్నారు. లేకపోతే ఇతను ఐఏఎస్ అయ్యాక ఎన్ని అవినీతి పనులు చేసేవాడో కదా..!