తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి ఆలయం. ఈ ఆలయం గురించి తెలియని వారు ఎవరూ ఉండరంటే అతిశయోక్తి లేదు. దేశవ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా అంతటి గుర్తింపు పొందింది ఈ ఆలయం. ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య రోజూ వేలల్లో ఉంటుంది. ఇక ప్రత్యేక పూజలు, ఉత్సవాలు జరిగినప్పుడు అయితే ఆ సంఖ్య లక్షల్లో ఉంటుంది. అయితే అంత మంది భక్తులు వచ్చినా చాలా మందికి అక్కడ వసతి లభించాలంటే చాలా కష్టంగా ఉంటుంది. రూమ్ దొరకాలంటే ఇబ్బందిగా ఉంటుంది. ముందస్తుగా బుక్ చేసుకుంటేనో లేదంటే ఎవరిదైనా సిఫారసు లేఖ ఉంటేనో మాత్రమే అక్కడ గది సులభంగా దొరుకుతుంది. అయితే మరి అంత పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు అనుగుణంగా గదులు లేవా..? అంటే… అవును ఉంటాయి, కాకపోతే వాటి గురించి సరైన సమాచారం చాలా మందికి తెలియదు. ఈ క్రమంలోనే తిరుమలలో దొరికే గదులు, వసతి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మొత్తం గదులు 7వేలు…
తిరుమలలో మొత్తం 7వేల గదులు ఉన్నాయి. వీటిలో సుమారుగా 40వేల మంది బస చేయవచ్చు. మరమ్మతులు, ఇతర టీటీడీ అవసరాల కోసం 500 గదులు కేటాయించారు. మిగిలిన గదుల్లో 30 వేల మంది వరకు బస చేయడానికి వీలుంటుంది. సాధారణ రోజుల్లో తిరుమలకు రోజూ 50 వేల నుంచి 70 వేల మంది వస్తుంటారు. ఇక వారాంతాలు, పర్వదినాలు, పండుగలు, సెలవురోజులు, ఉత్సవాలు అయితే ఆ సంఖ్య లక్ష వరకు చేరుకుంటుంది. అయితే తిరుమల కొండకు వచ్చే భక్తులందరూ గదుల్లో ఉండాలని అనుకోరు. చాలా మంది పేదలు ఏం చేస్తారంటే నేరుగా కళ్యాణకట్టకు వెళ్లి అక్కడే తలనీలాలు సమర్పిస్తారు. ఆ తరువాత పుష్కరిణిలో స్నానం చేసి నేరుగా బ్యాగులతో సహా వెళ్లి క్యూ లైన్లలో నిలబడతారు. అనంతరం దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణం అయిపోతారు. ఈ క్రమంలో ఒక వేళ అర్థరాత్రి పూట దర్శనం చేసుకుని బయటకు వస్తే ఇక తెల్లవారే దాకా ఆరు బయటే తలకింద బ్యాగులు పెట్టుకుని పడుకుంటారు. ఆ తరువాత తెల్లవారగానే తిరుగు ముఖం పడతారు. కానీ మధ్య తరగతి వారు మాత్రం గదుల కోసం చూస్తారు. ఈ క్రమంలో చాలా మంది ముందస్తు బుకింగ్ చేసుకోరు. దీంతో నేరుగా తిరుమల కొండకు వచ్చి ఇబ్బందులు పడతారు. అలాంటి వారిని ఆసరాగా చేసుకుని దళారులు రెచ్చిపోతారు. డబ్బులు దండుకుని రూమ్‌లను ఇస్తారు. అయితే అలా ఇబ్బందులు పడకుండా చాలా సులభంగానే వసతి పొందవచ్చు. అదెలాగంటే…
పీఏసీలు…
తిరుమలలో ప్రస్తుతం ఉన్న వసతి గదులకు మించి నిర్మాణాలు చేపట్టరాదని రూల్స్ ఉన్నాయి. ఈ క్రమంలో రోజు రోజుకూ పెరుగుతున్నభక్తులకు గాను సరిపడే గదులను ఏర్పాటు చేసేందుకు టీటీడీకి అవకాశం లేకుండా పోయింది. అయినప్పటికీ భక్తుల కోసం తిరుమలలో యాత్రికుల వసతి సముయాలు (పీఏసీలు) అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా పెద్ద సంఖ్యలో భక్తులకు నీడనిస్తున్నాయి. తిరుమలలో మొత్తం నాలుగు పీఏసీ భవనాలు ఉన్నాయి. వీటిలో ఒకటి శ్రీవారి సేవకులకు కేటాయించారు. మిగిలిన మూడింటిలో ఒకటి ప్రధాన కళ్యాణకట్ట ఎదురుగా ఉండగా, మరొకటి బస్టాండు ఎదురుగాను, ఇంకోటి సీఆర్ఓ సమీపంలోనూ ఉంది. మూడు పీఏసీల్లోని 20 హాళ్లలో మరుగుదొడ్లు, స్నానపుగదులు, 5,500 లాకర్లు ఉన్నాయి. పీఏసీ-2లో కల్యాణకట్టతో పాటు అన్నప్రసాదాల విరతణ చేస్తారు. గదులు లభించని భక్తులు తమ లగేజిని ఇక్కడి లాకర్లలో పెట్టుకుని దర్శనానికి వెళుతుంటారు. హాల్లోనే పడుకుంటారు. దాదాపు 20 వేల మందికి పీఏసీల్లో వసతి ఉంది.
పద్మావతి…
పద్మావతి ప్రాంతంలో వీఐపీల కోసం 620 గదులు ఉన్నాయి. అద్దెలు రోజుకి రూ.100 నుంచి రూ.6 వేల వరకు ఉంటాయి. ఈవో, జేఈవో, రాష్ట్ర, కేంద్ర మంత్రులు, ఇతర ప్రభుత్వ అధికారుల సిఫారసు లేఖల ఆధారంగా ఈ గదులను కేటాయిస్తారు. సిఫారసు లేఖలున్నవారు పద్మావతి విచారణ కార్యాలయాన్ని సంప్రదించాలి. ఇతర వివరాలకు 0877-2263731 నెంబరుకు ఫోన్ చేయవచ్చు.
టీబీ కౌంటర్లో…
సీఆర్వో కార్యాలయంలో భాగమైన టీ బీ కౌంటర్ వద్ద ప్రతిరోజు 200 గదులు కేటాయిస్తారు. ఇక్కడ ఎమ్మెల్యేలు, పార్లమెంటు సభ్యులు, ప్రభుత్వాధికారులు, టీటీడీ పాలకమండలి సభ్యుల సిఫారసు లేఖల ఆధారనంగా భక్తుడి గుర్తింపు కార్డు తీసుకుని గదిని కేటాయిస్తారు. వివరాలకు: 0877- 2263518 ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు.
ఆన్లైన్లో…
ఆన్‌లైన్‌లోనూ గదులను ముం దుగానే బుక్ చేసుకునే సౌకర్యం ఉంది. రోజుకి 2 వేల గదులను 90 రోజుల ముందు భక్తుల కోసం టీటీడీ ఇంటర్నెట్లో ఉంచుతుంది. అద్దె ఎంత , ఏ వసతి సముదాయంలో ఉన్న గది వంటి వివరాలు ఇందులో ఉంటాయి. భక్తులు తమ వ్యక్తిగత వివరాలను నమోదు చేసుకుని క్రెడిట్, డెబిట్ కార్డు ద్వారా చెల్లింపులు చేసి కావలసిన గదిని కావలసిన రోజుకి ముందుగానే బుక్ చేసుకోవచ్చు. దర్శనం కోసం వచ్చిన భక్తులు సీఆర్వో సమీపంలోని ఏఆర్పీ కౌంటర్లో బుకింగ్ ప్రింట్ అవుట్ చూపించి గదిని తీసుకోవచ్చు. ఆన్లైన్లో రూ.50 నుంచి రూ.2 వేల వరకు గదులు అందుబాటులో ఉంటాయి. ఇందుకు గాను భక్తులు www.ttdsevaonline.com వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. ఇతర వివరాలకు : 0877 2263727 నంబర్‌కు ఫోన్ చేసి వివరాలను తెలుసుకోవచ్చు.
నేరుగా కొండకు చేరుకుంటే…
ఆన్లైన్లో ముందుగా బుక్ చేసుకోకపోయినా, ఎటువంటి సిఫారసు లేకపోయినా తిరుమలలో గదులు పొందవచ్చు. సామాన్యుల కోసమే సీఆర్వో, కౌస్థుభం, సన్నిధానం, ఎంబీసీ విచారణ కార్యాలయాల్లో ఈ గదులను కేటాయిస్తారు. గుర్తింపు కార్డు చూపితే చాలు. 24 గంటలూ ఈ కార్యాలయాలు అందుబాటులో ఉంటాయి. క్యూ ద్వారా ముందు వచ్చిన వారికి వచ్చినట్టు గదులను కేటాయిస్తారు. ముందుగా 24 గంటలకే పరిమితం చేసినా, భక్తుల విన్నపం మేరకు మరో 24 గంటలు అదే గదిని తిరిగి కేటాయిస్తారు. వివరాలకు : 0877- 2263572, 0877- 2263523 ఫోన్ నంబర్లను సంప్రదించవచ్చు.