300కు పైగా చైనా సైనికులను మట్టుబెట్టిన ఏకైక భారత జవాను అతను..!

అది 1962 నవంబర్ 14వ తేదీ. అరుణాచల్‌ప్రదేశ్‌లోని నురనంగ్ ప్రాంతం. మరికొద్ది నిమిషాల్లో చైనా ఆర్మీ అక్కడ దాడి చేయబోతుందని భారత ఆర్మీకి సమాచారం అందింది. దీంతో అక్కడ ఉన్న కొద్ది పాటి జవాన్లను వెనక్కి రమ్మని భారత ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో జవాన్లు అందరూ వెనక్కి వచ్చేశారు. కానీ ఆ జవాను మాత్రం రాలేదు. ముందుకు వెళ్లాడు. చైనా ఆర్మీతో తలపడేందుకు సిద్ధమయ్యాడు. అక్కడే స్థానికంగా ఉన్న ఇద్దరు మహిళల సహాయంతో ఆ ప్రాంతంలో అక్కడక్కడా తుపాలను పెట్టించాడు. దీంతో దూరం నుంచి చూసే వారికి అక్కడ జవాన్లు ఉన్నారేమో అని భ్రమ కలుగుతుంది. సరిగ్గా చైనా ఆర్మీ కూడా అలాగే అనుకుంది. ఈ క్రమంలోనే ఆ భారత జవాను అక్కడక్కడా పెట్టిన తుపాకులను ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఒకదాని వద్దకు వెళ్లి పేల్చడం మొదలు పెట్టాడు. దీంతో దూరం నుంచి చూస్తున్న చైనీస్ ఆర్మీ అయోమయానికి లోనైంది. అలా ఆ భారత జవాను ఒక్కడే 3 రోజుల పాటు చైనా ఆర్మీతో తలపడ్డాడు. సుమారుగా 300కు పైగానే చైనా జవాన్లను మట్టుబెట్టాడు. చివరకు చైనా బలం ముందు నిలబడలేకపోయాడు. వారు అతన్ని పట్టుకుని తల నరికి తీసుకెళ్లారు. అలా చైనా వారితో యుద్ధంలో వీరమరణం పొందాడు ఆ భారత జవాను. అతని పేరు జస్వంత్ సింగ్ రావత్.

జస్వంత్ సింగ్ రావత్ ఉత్తరాఖండ్‌లోని పౌరి ఘర్‌వాల్ జిల్లా బర్యున్ గ్రామంలో ఆగస్టు 19, 1941వ సంవత్సరంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచి దేశ భక్తి భావాలు ఎక్కువగా ఉండడంతో భారత ఆర్మీతో సైనికుడిగా చేరాడు. ఈ క్రమంలోనే 1961వ సంవత్సరంలో చైనాతో జరిగిన యుద్ధంలో అతను పాల్గొన్నాడు. అందులో జస్వంత్ ఒక్కడే 40 శాతం మంది సైనికులను చంపడం విశేషం. ఈ క్రమంలో 1962, నవంబర్ 14వ తేదీన చైనా ఆర్మీ అరుణాచల్ ప్రదేశ్‌లోని నురనంగ్ ప్రాంతంపై దాడి చేస్తుందని తెలిసినా అందరు సైనికుల్లా అతను వెనుదిరగలేదు. ప్రాణాలకు సైతం లెక్కచేయకుండా పోరాడాడు. వందల మంది సైనికులు ఉన్నారనుకునేలా చైనా ఆర్మీని గందరగోళానికి గురి చేసి 3 రోజుల పాటు వారితో యుద్ధం చేశాడు. చివరకు నవంబర్ 17, 1962వ తేదీన ప్రాణాలొదిలాదు.

దీంతో జస్వంత్ చేసిన సాహసానికి, చూపిన తెగువకు, చేసిన పోరాటానికి అతని పేరునే ఆ ప్రాంతానికి పెట్టారు. ప్రస్తుతం ఆ ప్రాంతాన్ని జస్వంత్ ఘాట్ అని పిలుస్తున్నారు. అప్పుడు జస్వంత్ అలా సాహసం చేయకపోయి ఉంటే ఇప్పుడా ప్రాంతం చైనా ఆధీనంలో ఉండేది. అందుకనే ఆయన పేరును ఆ ప్రాంతానికి పెట్టారు. ఇక భారత ఆర్మీ జస్వంత్‌కు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మహావీర చక్రను ప్రదానం చేసింది. దీంతోపాటు పలు సాహస అవార్డులను కూడా అతనికి ఇచ్చింది. ఇక జస్వంత్ సింగ్ ఇంకా చనిపోలేదని, ఆయన ఇంకా బతికే ఉన్నాడని భావిస్తూ భారత ఆర్మీ అప్పటి నుంచి ఆయన పోస్టును అలాగే ఉంచింది. సాధారణంగా డ్యూటీ చేస్తే ఎలాంటి ప్రమోషన్లు వస్తాయో ఆయన పోస్టుకు ఇప్పటికి ప్రమోషన్లను ఇస్తూ ఆయన పోస్టును మాత్రం సజీవంగానే ఉంచారు భారత ఆర్మీ అధికారులు. జస్వంత్ పోరాటం చేసిన ఆ ప్రాంత వాసులు ఇప్పటికీ ఆయనను రోజూ తలచుకుంటారు. కొందరికైతే ఆయన ఆత్మ ఇంకా అక్కడే కనిపిస్తుందని చెబుతారు. అందుకు గాను ఆయనకు రోజూ ఉదయం బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి డిన్నర్ లను అక్కడి వారు ఏర్పాటు చేస్తుంటారు..! ఏది ఏమైనా దేశ భూభాగాన్ని, ప్రజలను రక్షించడంలో జస్వంత్ చూపిన చొరవను మాత్రం మరువలేం..! జోహార్ జస్వంత్.. జోహార్..!

Comments

comments

Share this post

scroll to top