అపరిచితుడు సినిమా చూశారు కదా. అందులో రహదారిపై యాక్సిడెంట్ అయిన ఓ వ్యక్తిని కాపాడేందుకు హీరో విక్రం ఓ కొత్త కారును ఆపుతాడు. అందులోని వ్యక్తి యాక్సిడెంట్ గురైన అతన్ని తన కారులో తీసుకెళ్లేందుకు మొదట ఓకే చెప్తాడు. కానీ విక్రం అవతలికి వెళ్లగానే ఆ వ్యక్తి అక్కడి నుంచి చెప్పా పెట్టకుండా చెక్కేస్తాడు. అనంతరం విక్రం అపరిచితుడిగా మారడం, అతన్ని చంపడం చక చకా జరిగిపోతాయి. అది సినిమా. అయితే అందులో దర్శకుడు చూపించింది మాత్రం నిజ జీవితానికి దగ్గరగా ఉన్న సంఘటననే. అవును. కొత్తగా ఎవరైనా వాహనం కొనుక్కుంటే దాంట్లో రక్తం పడకూడదని, శవాలను తీసుకెళ్లకూడదని సెంటిమెంట్‌గా భావిస్తారు. దాన్నే శంకర్ అపరిచితుడి సినిమాలో చూపించారు. అయితే మనం సమాజంలో నలుగురి మధ్యలో బతుకుతున్నాం కాబట్టి ఎవరికైనా ఆపద వచ్చినా, ప్రాణాపాయ స్థితిలో ఉన్నా మనకు చేతనైనంత సహాయం చేయాలని, ఈ క్రమంలో అలాంటి సెంటిమెంట్లను పక్కన పెట్టాలని ఆ సినిమాలోని సన్నివేశాలు మనకు సందేశాన్నిచ్చాయి. కానీ సందేశం ఇచ్చినంత సులభంగా ఎవరూ కూడా ఏ ఆదర్శాన్నీ పాటించరు. అలా పాటించే వారు కేవలం కొంత మంది మాత్రమే ఉంటారు. అలాంటి వారిలో ఆ యువతి కూడా నిలుస్తుంది. ఆమే ఆకాన్ష జోషి.
ఆకాన్ష జోషికి చిన్నప్పటి నుంచి స్కూటీ నడపాలనే కోరిక మనసులో బలంగా ఉండేది. ఈ క్రమంలో తాను కాలేజీలో ఉండగా ఒకసారి ఓ ఫ్రెండ్ రైడ్ చేయమని తన స్కూటీని ఇచ్చింది. కానీ ఆమెకు భయం వేసింది. కారణం తన తండ్రి. అవును, తన తండ్రే. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలను నడపకూడదని తన తండ్రి చెప్పిన మాటలు ఆమెకు గుర్తుకు వచ్చాయి. దీనికి తోడు తండ్రి తిడతాడేమోనన్న భయం కూడా ఉండడంతో ఆకాన్ష తన ప్రయత్నాన్ని మానుకుంది. కానీ నెమ్మదిగా డ్రైవింగ్ నేర్చుకుని ఎలాగో డ్రైవింగ్ లైసెన్స్ కూడా తెచ్చుకుంది. దీనికి తోడు కాలేజీలో ఫస్ట్ క్లాస్ మార్కులు సాధించడంతో తండ్రి ఆమెకు స్కూటీని గిఫ్ట్‌గా ఇచ్చాడు. ఇంకేముంది ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక రోజూ ఆ స్కూటీపై వెళ్లడం. మెడికల్ ఎంట్రన్స్ కోచింగ్‌కు అటెండ్ కావడం, తిరిగి ఇంటికి రావడం. ఇది ఆమె నిత్య దినచర్య అయింది. అప్పటికి ఆమె స్కూటీ కొని కొద్ది రోజులే అయింది. అసలే కొత్త బండి. దీనికి తోడు కొత్తగా డ్రైవింగ్ లైసెన్స్ వచ్చింది. దీంతో రోడ్డుపై సహజంగానే భయ పడుతూ ఆమె వెళ్లేది. అలా ఒక రోజు క్లాస్‌లకు వెళ్తుండగా ఓ యాక్సిడెంట్‌ను ఆమె చూసి షాక్‌కు గురైంది.
ఓ కారు ఢీకొట్టి వెళ్లడంతో ఓ రిక్షా కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. అందరూ రోడ్డుపై గుమి గూమి అతన్ని చూస్తున్నారు. కానీ ఎవరూ సహాయం అందించడం లేదు. ఓ వైపు సమయం దాటిపోతోంది. ఆ క్రమంలోనే అటుగా వచ్చిన ఆకాన్ష అతన్ని చూసి జాలి పడింది. కానీ క్లాస్‌లకు లేట్ అవుతుందని ఓ దశలో కొంత దూరం వెళ్లింది. కానీ అత్యంత దయనీయ స్థితిలో పడి ఉన్న ఆ కార్మికుడిని చూసి ఆమె హృదయం చలించిపోయింది. అలాంటి స్థితిలో ఉన్న అతన్ని చూసి పట్టించుకోకుండా వెళ్లిపోతున్నందుకు తనపై తనకే అదోలాంటి ఏవగింపు కలిగింది. దీంతో ఆమె వెనక్కి తిరిగి వచ్చి ఆ కార్మికుడి తలకు కట్టు కట్టింది. అనంతరం స్థానికుల సహాయంతో స్కూటీపై అతన్ని కూర్చోబెట్టుకుని హాస్పిటల్‌కు తీసుకువెళ్లి జాయిన్ చేసింది. దీంతో ఆ కార్మికుడు ప్రాణాపాయం నుంచి బయట పడ్డాడు. జరిగిన సంఘటనను చెప్పగా ఆమె తండ్రి హాస్పిటల్‌కు వచ్చి ఆ కార్మికుడి కుటుంబానికి కొంత డబ్బు కూడా ఇచ్చాడు. చాలా గొప్ప పని చేశావు, ఇలాగే బాధ్యతగా వాహనం నడుపు, బాధ్యతగా ఉండు, అంటూ ఆమెను వెన్నుతట్టి అభినందించాడు. దీంతో ఆకాన్ష తన తండ్రి చెప్పిన మాటలను అలాగే గుర్తు పెట్టుకుంది. అప్పుడు ఆమె మనసుకు కలిగిన సంతృప్తి వర్ణించరానిది. నిజమే మరి. అలా బాధ్యతగా వాహనం నడుపుతూ, సమాజం పట్ల బాధ్యతగా ఉంటే ప్రతి ఒక్క మనిషికి అంతకు మించిన ఆత్మ సంతృప్తి ఏం కావాలి చెప్పండి. అంతే కదా!