చావు బతుకుల మధ్య ఉన్న వ్యక్తిని కాపాడేది పోయి…దోచుకున్నారు.

వాళ్లు మ‌నుషులా… కాదు… ఎంత మాత్రం కాదు… మ‌నిషి ముసుగు వేసుకున్న జంతువులు. కాదు, జంతువులు కూడా కాదు. ఎందుకంటే జంతువులంటే వాటికీ కోపం వ‌స్తుంది. అవైనా ఏదో ఒక ప‌నికి మ‌న‌కు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. కాబ‌ట్టి వాటి క‌న్నా త‌క్కువ‌, ఇంకా హీనం. సృష్టిలో హీనాతిహీన‌మైంది ఏదైనా ఉందంటే అది వారే. అవును, మీరు వింటున్న‌ది క‌రెక్టే. ఎందుకంటే ఇప్పుడు చెప్ప‌బోయే సంఘ‌ట‌న‌ను గురించి తెలుసుకుంటే మీరే అంటారు, వారెంత‌టి హీనులో, దుర్మార్గులో అని. ఇంత‌కీ ఏంటా సంఘ‌ట‌న‌..? ఎక్క‌డ జ‌రిగిందది..?

matibool-tempo

అది దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రం. పొద్ద‌స్త‌మానం రిక్షా న‌డిపి, దాని ద్వారా వ‌చ్చే ఆదాయం చాల‌క‌, రాత్రంతా ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డ్‌గా ప‌ని చేసి మ‌ళ్లీ తెల్ల‌వారుజామునే ఇంటికి వెళ్తున్నాడు ఆ వ్య‌క్తి. అత‌ని పేరు మ‌తిబూల్‌. బెంగాల్‌కు చెందిన వాడు. జీవ‌నోపాధి దృష్ట్యా పొట్ట చేత ప‌ట్టుకుని ఢిల్లీ వ‌చ్చి, రాత్రింబ‌వ‌ళ్లు అలా క‌ష్ట‌పడుతున్నాడు. అత‌నికి న‌లుగురు సంతానం. త‌న కుటుంబ‌మంతా అత‌నిపైనే ఆధార ప‌డింది. ఈ క్ర‌మంలో పొద్ద‌స్త‌మానం తొక్కే రిక్షా ద్వారా వ‌చ్చే డ‌బ్బులు చాల‌క‌పోవ‌డంతో రాత్రిళ్లు ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా ప‌నిచేస్తూ జీవ‌నం సాగిస్తున్నాడు. అయితే ఈ నెల 10వ తేదీన బుధ‌వారం ఉదయం పూట య‌థావిధిగా విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నాడు మ‌తిబూల్‌. ఇంటికి చేరుకుని మ‌ళ్లీ కొంత సేపు ఆగాక రిక్షా న‌డ‌పాలి క‌దా. అందుక‌ని ఎంతో వ‌డివ‌డిగా అడుగులు వేసుకుంటూ ఇంటికి న‌డిచి వెళ్తున్నాడు. అయితే ఇంత‌లోనే ఓ టెంపో మృత్యు శ‌క‌టంలా వ‌చ్చి అత‌న్ని వెనుక నుంచి బ‌లంగా ఢీకొంది. దీంతో మ‌తిబూల్ రోడ్డు ప‌క్క‌న బలంగా ప‌డిపోయాడు.

అయితే ఆ టెంపో డ్రైవ‌ర్ త‌న వాహ‌నాన్ని ఆపి తాపీగా వెనక్కి వ‌చ్చి మ‌తిబూల్‌ను ఒక‌సారి చూసి మ‌ళ్లీ టెంపో న‌డుపుకుంటూ వెళ్లిపోయాడు. అంతేగానీ ర‌క్తం మ‌డుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న మ‌తిబూల్‌ను కాపాడుదామ‌ని అనుకోలేదు. ఈ క్ర‌మంలో ప‌లువురు ఆ దారి వెంట వెళ్లారు కానీ ఒక్క‌రూ అత‌న్ని చూసి జాలి ప‌డ‌లేదు. కాపాడుదామ‌ని ప్ర‌య‌త్నించ‌లేదు. త‌మ‌కెందుకులే అని వెళ్లిపోయారు. టైం గ‌డుస్తున్న కొద్దీ ర‌క్త స్రావం ఎక్కువ‌వుతూ మ‌తిబూల్ చావుకు ద‌గ్గ‌ర‌వుతున్నాడు. కానీ ఎవ్వ‌రూ ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. ఒకానొక ద‌శ‌లో ఒక‌రిద్ద‌రు వ్య‌క్తులు అక్క‌డికి వ‌చ్చారు, కానీ వారు మ‌తిబూల్ ఫోన్‌ను, అత‌ని వ‌ద్ద‌నున్న డ‌బ్బుల‌ను దోచుకున్నారు. కానీ స‌హాయం మాత్రం చేయ‌లేదు. చివ‌ర‌కు కొంద‌రు వ‌చ్చి ఎలాగో అత‌న్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. కానీ తీవ్ర ర‌క్త‌స్రావం అవ‌డంతో అప్ప‌టికే అత‌ను మృతి చెందాడ‌ని, ముందుగా తీసుకువ‌చ్చి ఉంటే బ‌తికేవాడ‌ని వైద్యులు చెప్పారు.

హ‌త‌విధీ… ఎంత‌టి ఘోరం జ‌రిగిపోయింది. యావ‌త్ మాన‌వ ప్ర‌పంచం సిగ్గుతో త‌ల‌దించుకోవాల్సిన త‌రుణ‌మిది. చావు అంచుల్లో కొట్టుమిట్టాడుతున్న ఓ వ్య‌క్తిని కాపాడాల్సింది పోయి అత‌న్నే దోచుకున్న దుండగుల‌ను హీనులు అనాలా..? అత‌న్ని ప‌ట్టించుకోకుండా దారి వెంట వెళ్లిన వారిని అనాలా..?  లేదంటే టెంపోతో నిర్ల‌క్ష్యంగా గుద్ది, ప‌ట్టించుకోకుండా త‌న మానాన తాను వెళ్లిపోయిన ఆ డ్రైవ‌ర్‌ను అనాలా..? ఎవ‌ర్ని హీనుల‌నాలి..?  నిజంగా వారిని అనాలంటే మ‌న‌కే సిగ్గుగా ఉంది. హీనుల‌నే ప‌దం కూడా వారికి త‌క్కువే. ‘మాయ‌మైపోతున్న‌డ‌మ్మా… మ‌నిష‌న్న‌వాడూ…’ అని ఓ క‌వి పాడిన పాట‌ను అక్ష‌రాలా నిజం చేస్తుందీ సంఘ‌ట‌న‌… మంచి మ‌న‌సు, మాన‌వ‌త్వం నేటి త‌రం మ‌నుషుల్లో క‌నుమ‌రుగైపోతున్నాయ‌న‌డానికి ఇంత‌కంటే వేరే నిద‌ర్శ‌నం ఉండ‌దేమో. పేరుకు అది ఢిల్లీ న‌గ‌రం. దేశ రాజ‌ధాని. కానీ సాటి మ‌నుషుల‌ను కూడా ప‌ట్టించుకోరు. ఏంటో ఈ లోకం… ఎప్పుడు బాగుప‌డుతుందో..!

పైన చెప్పిన సంఘ‌ట‌నంతా అక్క‌డే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డ‌యింది… దాని క్లిప్పింగ్ ఇదిగో…

Comments

comments

Share this post

scroll to top