ఆంబులెన్స్ రాక‌పోవ‌డంతో గ‌ర్భ‌వ‌తి అయిన భార్య‌ను భుజాల‌పై హాస్పిట‌ల్‌కు మోసుకెళ్లిన భ‌ర్త‌.

మ‌న దేశానికి స్వాతంత్ర్యం వ‌చ్చి ఇప్ప‌టికి దాదాపు 70 ఏళ్లు పూర్తి కావ‌స్తోంది. ఇన్ని ద‌శాబ్దాల్లో అటు కేంద్రంలో, ఇటు ఆయా రాష్ట్రాల్లో అనేక ప్ర‌భుత్వాలు మారాయి. కొత్త పార్టీలు పుట్టుకు వ‌చ్చాయి. నేత‌లు మారారు. వారి స్థానంలో వారి కుమారులు, మ‌న‌వ‌లు కూడా అధికారంలోకి వ‌చ్చి రాజ్యాలు ఏలుతున్నారు. అయినా పేద‌ల‌కు, సామాన్య, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు అందాల్సిన క‌నీస సౌక‌ర్యాలు కూడా ఇప్ప‌టికీ అంద‌డం లేదు. ప్ర‌జ‌ల‌కు కావల్సిన కూడు, గూడు, గుడ్డ‌, విద్య‌, వైద్యం వంటి క‌నీస స‌దుపాయాలు అంద‌క ద‌య‌నీయ స్థితిలో ఉన్న గ్రామాలు నేటికీ అనేకం ఉన్నాయి. ఆధునికత దిశ‌గా టెక్నాల‌జీ ప్ర‌పంచం వైపు ప‌రుగులు తీస్తున్నామ‌ని నేత‌లు చెబుతున్నా వారి మాట‌ల‌కు, వాస్త‌వ స్థితిగ‌తుల‌కు సంబంధ‌మే ఉండ‌డం లేదు. ఈ మ‌ధ్య కాలంలో దేశంలో ప‌లు ప్రాంతాల్లో జ‌రిగిన సంఘ‌ట‌న‌లే ఇందుకు ప్ర‌త్య‌క్ష ఉదాహ‌ర‌ణ‌లు.

wife-on-man-shoulders

మీకు గుర్తుండే ఉంటుంది, మొన్నా న‌డుమ ఒడిశాలో ప్ర‌భుత్వ ఆస్ప‌త్రి సిబ్బంది ఆంబులెన్స్ ఇచ్చేందుకు నిరాక‌రించ‌డంతో ద‌న మాఝీ అనే వ్య‌క్తి త‌న భార్య శవాన్ని భుజాలపై మోసుకెళ్లాడు. ఆ త‌రువాత ఓ వ్య‌క్తి త‌న చిన్నారిని వైద్యం కోసం భుజాల‌పైనే మోసుకెళ్లాడు. మ‌రో చోట ఓ వ్య‌క్తి చ‌నిపోయిన త‌న తల్లిని అద్దెకు తెచ్చిన ద్విచ‌క్ర వాహ‌నంపై తీసుకెళ్లాడు. ఈ ఘ‌ట‌న‌ల‌పై దేశ వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తాయి. ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను, అక్క‌డ ప‌నిచేస్తున్న నాయ‌కులు, అధికారులను, వారి పనితీరును ప్ర‌తి ఒక్క‌రు విమ‌ర్శించారు. అయినా ఇంకా అలాంటి ఘ‌ట‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఒడిశాలోనే తాజాగా ఇలాంటిదే మ‌రో ఘ‌ట‌న చోటు చేసుకుంది.

ఒడిశాలోని రాయ‌గ‌డ జిల్లా కొసోహ‌రి ఖోల్లా గ్రామానికి చెందిన సొంబారు అనే వ్య‌క్తి గ‌ర్భవ‌తిగా ఉన్న త‌న భార్య‌కు అనారోగ్యం క‌ల‌గ‌డంతో 102, 108 ఆంబులెన్స్‌ల‌కు ఫోన్ చేశాడు. కానీ ఆంబులెన్స్‌లు ఎంత సేప‌టికీ రాలేదు. ఈ క్ర‌మంలో ఓ ద‌శ‌లో సొంబారు భార్య అనారోగ్యం కార‌ణంగా ఆ బాధ‌ను ప‌డలేక నొప్పితో మెలిక‌లు తిరిగిపోవ‌డం మొద‌లు పెట్టింది. అప్ప‌టికీ చాలా సేపైనా ఆంబులెన్స్ రాలేదు. దీంతో చేసేదేం లేక సొంబారు త‌న భార్య‌ను భుజాలపై మోస్తూ హాస్పిట‌ల్‌కు తీసుకెళ్ల‌డం ప్రారంభించాడు. అలా అత‌ను సుమారు 1 కిలోమీట‌ర్ న‌డ‌వ‌గానే ఆంబులెన్స్ వ‌చ్చింది. అయితే అప్ప‌టికే అత‌ని ఫొటోను తీసి దాన్ని ప‌లువురు సోష‌ల్ మీడియాలో పెట్టేశారు. దీంతో ఆ వార్త వైరల్‌గా మారింది. ఈ క్ర‌మంలో మ‌రోసారి ఒడిశా ప్ర‌భుత్వాన్ని నెటిజ‌న్లు తూర్పారబ‌ట్టారు. అయినా మ‌న వృథా ప్ర‌యాస కానీ, ప్ర‌భుత్వాల‌ను, నాయ‌కులను, అధికారుల‌ను అంటే ఏమొస్తుంది, మ‌న‌కే టైం వేస్ట్ అవుతుంది త‌ప్ప వారిలో మాత్రం ఎప్ప‌టికీ మార్పు రాదు. ఇంకా ఇలాంటి ఘ‌ట‌న‌లు ఎన్ని చూడాల్సి వ‌స్తుందో క‌దా..!

14285765_1228454377177150_1486519637_o

Comments

comments

Share this post

scroll to top