అప్పుడెప్పుడో వీరబ్రహ్మేంద స్వామి కాలజ్ఞానం చెప్పారు గుర్తుందా..? కలియుగంలో ధర్మం కేవలం ఒంటి పాదంపైనే నడుస్తుందని… గూండాలు, దోపిడీదారులు, ఖూనీ కోర్లు, రేపిస్టులు రాజ్యాలను పాలిస్తారని..! అదిగో… ఆ కాలం వచ్చిందా… అంటే… అందుకు అవుననే సమాధానం వినిపిస్తుంది. అంతే మరి..! తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చాయో అందరికీ తెలుసు కదా. అందులో ఓ నాయకుడికి ప్రజలు వేసిన ఓట్లే ముందు చెప్పిన విషయానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ఆ నాయకుడెవరో తెలుసు కదా…
అతనే వివాదాస్పద యూపీ రాజకీయ నేత, ఎస్పీ మాజీ మంత్రి గాయత్రి ప్రసాద్ ప్రజాపతి. ఇంతకీ ఆయన గారు ఏం చేశారనేగా మీ డౌట్. ఏం లేదు, గతంలో ఈయనపై పలు ఆరోపణలు వెల్లువెత్తాయి. 16 ఏళ్ల యువతితోపాటు ఆమె తల్లిని కూడా ఇతను రేప్ చేశాడట. అలా అని మేం చెప్పడం కాదు, బాధితులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. దీంతో యూపీ సీఎం అఖిలేష్ ఈయన్ను క్యాబినెట్ నుంచి తొలగించారు. అయితే ఆ కేసు ఇంకా పెండింగ్‌లోనే ఉండగా, ఆయన తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ పోటీ చేశారు. మరి ఆయనకు వచ్చిన ఓట్లెన్నో తెలుసా..? 59,161. అయితే ఏంటంటారా..? అక్కడికే వస్తున్నాం..!
ఉక్కు మహిళగా పేరున్న ఇరోమ్ షర్మిల గురించి తెలుసు కదా. మణిపూర్‌లో ఆమె పోటీ చేయగా, కేవలం 90 ఓట్లు మాత్రమే వచ్చాయి. అయితే… గాయత్రి ప్రసాద్‌కు, షర్మిలకు పోలిక ఏంటంటారా..? అక్కడే ఉంది… మీరు గమనించారో లేదో..! గాయత్రి ప్రసాద్ ఇద్దరు మహిళలను రేప్ చేసిన కేసులో ఆరోపణులు ఎదుర్కొంటున్న వ్యక్తి. అంటే పైన చెప్పినట్టుగా గూండా, రౌడీ, వగైరా, వగైరా వంటి ఏదో ఒక కేటగిరికి ఇతను చెందుతాడు. ఇక షర్మిల. గొప్ప సామాజిక వేత్త. అమాయకులు కళ్ల ఎదుటే అన్యాయంగా బలి అయితే తట్టుకోలేక 16 ఏళ్ల పాటు నిరాహార దీక్ష చేసి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ఉక్కు మహిళ ఆమె. గొప్ప వనిత. మరి ఆమెకు ఎన్నికల్లో వచ్చిన ఓట్ల మాటేమిటి..? 90 ఓట్లు వచ్చాయి. అంటే జనాలకు ఆమె అవసరం లేదనేగా అర్థం. రేప్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తే జనాలకు కావాలనేగా అర్థం. దీన్ని బట్టి పైన మేం చెప్పింది నిజమే కదా..! అంతేలే మరి..! సాక్షాత్తూ గాంధీ మహాత్ముడే వచ్చి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసినా కచ్చితంగా ఓడిపోతాడు, అవును, ముమ్మాటికీ అది నిజమే. నేటి తరుణంలో ఉన్న అవినీతి, రౌడీయిజ నాయకులను చూస్తే ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. అయినా… ఏంటో ఈ సమాజం… ఉద్యమం చేసి పోరాడే వారికి పట్టం కట్టదు, ఖూనీకోర్లకు, దగా నాయకులకే పట్టం కడుతుంది. అంతేలే… గొర్రె ఎప్పుడూ కసాయి వాన్నేగా నమ్మేది..!