డొనాల్డ్ ట్రంప్ కారులో ఎటువంటి ఫీచర్స్ ఉంటాయో తెలుసా?

అమెరికా అధ్య‌క్షుడు అంటేనే ప్ర‌పంచంలోని ఏ దేశ అధ్య‌క్షుడికీ లేని సెక్యూరిటీ ఉంటుంది. అంతే స్థాయిలో రాజ‌భోగాలు కూడా ఉంటాయి. ఎక్క‌డికెళ్లినా వెంట ఉండే క‌మాండోలు, వైట్ హౌస్ కు ఎక్క‌డి నుంచైనా మాట్లాడే శాటిలైట్ క‌మ్యూనికేష‌న్ వ్య‌వ‌స్థ‌, ప్ర‌త్యేక‌మైన భోజ‌నం… ఇలా చెప్పుకుంటూ పోతే అమెరికా మొద‌టి పౌరుడికి ఉండే ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు. మ‌రి ఇన్ని సౌక‌ర్యాలు ఉండే అమెరికా అధ్య‌క్షుడి కారు ఏ విధంగా ఉంటుందో తెలుసా..? దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాం.

trump-beast-1

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు 45వ అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్న డొనాల్డ్ ట్రంప్ కారును ప్ర‌ముఖ ఆటోమొబైల్ త‌యారీ సంస్థ కేడిలాక్ మోటార్స్ త‌యారు చేస్తోంది. బీస్ట్ గా పిల‌వ‌బ‌డుతున్న ఈ కారు త‌యారీ ఇప్ప‌టికే పూర్త‌యిన‌ట్టు తెలిసింది. అయితే కేవ‌లం ఒక కారు మాత్ర‌మే కాకుండా ఇలాంటివే మ‌రో 12 కార్ల‌ను అమెరికా అధికారులు త‌యారు చేయించనున్నారు. వాటిలో ఉండే విశేషాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

trump-beast-2

 • అమెరికా అధ్య‌క్షుడు ప్ర‌యాణించ‌నున్న బీస్ట్ కారును అత్యంత ఆధునిక సాంకేతిక ప‌రిజ్ఞానం ఉప‌యోగించి, మునుపెన్న‌డూ లేని ప‌టిష్ట‌మైన సెక్యూరిటీ ఫీచ‌ర్ల‌ను ఈ కారులో అందిస్తున్నారు. ముందుభాగంలో అధునాతన కేడిలాక్ ఎస్క‌లేటెడ్ ఎస్ యూవీ శ్రేణి త‌ర‌హాలో బీస్ట్ కారును రూపొందిస్తున్నారు.
 • ముందు భాగంలోనే దిగువ‌న భాష్ప వాయు గోళాలు, నైట్ విజ‌న్ కెమెరాల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు. రాత్రి పూట కూడా రోడ్డును బాగా చూసేందుకు నైట్ విజ‌న్ కెమెరాలు ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అధ్య‌క్షుడి సెక్యూరిటీ కోసం అవ‌సరమైతే భాష్ఫ వాయు గోళాల‌ను ప్ర‌యోగిస్తారు.
 • 6.60 లీట‌ర్ల డ్యురామాక్స్ ఇంజిన్‌ను బీస్ట్‌లో ఉప‌యోగించ‌నున్నారు. ఇది అత్యంత ఎక్కువ హార్స్ ప‌వ‌ర్‌తో కార్ ప‌రిగెత్తేలా చేస్తుంది.
 • రోడ్డు ప‌క్క‌న పేలే అత్యంత శ‌క్తివంత‌మైన బాంబుల‌ను కూడా త‌ట్టుకునేలా కార్‌ను 125 ఎంఎం మందంతో రూపొందిస్తున్నారు.
 • డ్రైవ‌ర్ కాకుండా బీస్ట్‌లో 2, 3, 2 చొప్పున ఏడు మంది కూర్చోవ‌చ్చు.
 • శ‌క్తివంత‌మైన కెమికల్ దాడుల‌ను కూడా త‌ట్టుకునేలా ఈ కార్‌ను త‌యారు చేస్తున్నారు. ఒక వేళ కెమిక‌ల్ దాడులు జ‌రిగితే అధ్య‌క్షుడు కారులోనే ఆక్సిజ‌న్ పీల్చుకునేందుకు ప్ర‌త్యేక ట్యాంక్‌ల‌ను ఏర్పాటు చేస్తున్నారు.
 • ప‌వ‌ర్‌ఫుల్ బుల్లెట్ల‌ను కూడా త‌ట్టుకునే విధంగా 200 ఎంఎం మందంతో కార్ డోర్ల‌ను రూపొందిస్తున్నారు.
 • ఫ్యుయ‌ల్ ట్యాంక్ పై భాగంలో నురుగు లాంటి ప‌దార్థాన్ని నింప‌నున్నారు. దీని వ‌ల్ల ఇంధ‌న ట్యాంకుల‌ను పేల్చినా ప్ర‌మాదం ఉండ‌దు.
 • బీస్ట్ కారు కోస‌మే ప్ర‌త్యేకంగా రూపొందించిన కెవ్లార్ ర‌న్ ఫ్లాట్ టైర్ల‌ను ఇందులో అమ‌ర్చ‌నున్నారు.
 • ఎప్పుడైనా అధ్య‌క్షుడికి ప్ర‌మాదం జ‌రిగితే అప్పుడు వెంట‌నే ప్ర‌థ‌మ చికిత్స చేసేందుకు అవ‌స‌ర‌మ‌య్యే సామ‌గ్రితోపాటు అధ్య‌క్షుడి బ్ల‌డ్ గ్రూప్‌కు చెందిన రెండు యూనిట్ల ర‌క్తాన్ని కారులో ఎల్ల‌ప్పుడూ అందుబాటులో ఉంచ‌నున్నారు.
 • బీస్ట్ బ‌రువు 6800 నుంచి 9వేల కేజీల వ‌ర‌కు ఉంటుంది. గంట‌కు గ‌రిష్టంగా 100 కి.మీ స్పీడ్‌తో ప్ర‌యాణిస్తుంది. 34 లీట‌ర్ల ఇంధ‌నం నింపితే 100 కిలో మీట‌ర్ల వ‌ర‌కు ప్ర‌యాణించ‌వ‌చ్చు.
 • కాగా బీస్ట్ కారు కోసం ఇప్ప‌టికే దాని త‌యారీ సంస్థ‌కు దాదాపుగా రూ.102.96 కోట్ల దాకా చెల్లించారు.
 • కాబోయే అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌మాణ స్వీకారం రోజున ఈ కార్‌లోనే వైట్ హౌస్‌కు రానున్నార‌ని తెలిసింది.

Comments

comments

Share this post

scroll to top