ఆ వృద్ధురాలి వయస్సు 90 సంవత్సరాలు… అయినా నిత్యం పొలానికి వెళ్లి కష్టపడుతోంది…

ఒంట్లో ఓపిక ఉన్నంత వరకు, చేతనైనంత వరకు, శరీరం సహకరించినంత వరకు కష్టపడి పనిచేయాలి. అంతే తప్ప, సోమరిగా ఉండకూడదు. కానీ కొంత మంది మాత్రం ఇందుకు వ్యతిరేకం. శరీర అవయవాలు అన్నీ పనిచేసినా, అంతా బాగానే ఉన్నా పని చేసేందుకు బద్దకం చూపుతూ సోమరితనం ప్రదర్శిస్తుంటారు. ఏ పని చేయాలన్నా అస్తమానం తమ వల్ల కాదని నిరాసక్తతను ప్రదర్శిస్తుంటారు. అలాంటి వారందరికీ ఇప్పడు చెప్పబోయేది చెంప పెట్టు. ఎందుకంటే విషయం అలాంటిది మరి.

grand-mother-age-90

చిత్రం చూశారుగా. ఓ బామ్మ సైకిల్ తొక్కుతూ దానిపై గ్రాసం తీసుకువస్తూ ఎంత ఉత్సాహంగా కనిపిస్తుందో. ఆమెది కర్ణాటక రాష్ట్రంలోని కుందపుర గ్రామం. ఆ బామ్మ ఉదయాన్నే 5 గంటలకు నిద్ర లేస్తుంది. తన సైకిల్ మీద పొలానికి వెళ్లి సాయంత్రం వరకు అక్కడే పనిచేసి తిరిగి ఇంటికి చేరుకుంటుంది. రోజంతా అలా కష్టపడి పనిచేసినా ఆమె ఎంతో ఉత్సాహంగానే ఉంటుంది. అంతేకాదు మరుసటి రోజు ఉదయాన్నే అంతే ఉత్సాహంతో పనికి బయల్దేరుతుంది. ఇంతకీ ఆమె వయస్సు ఎంతో తెలుసా? 90 సంవత్సరాలు. అవును, సాధారణంగా ఆ వయస్సులో వృద్ధులెవరైనా అంతటి కష్టం చేయడం దాదాపు అసంభవమే. కానీ ఆ బామ్మ ఈ వయస్సులోనూ ఆరోగ్యంగా ఉండడంతో తన పని తాను చేసుకుని జీవనం సాగిస్తోంది.

పని చేసుకునేందుకు వయస్సుతో సంబంధం లేదని, ఒంట్లో సత్తువ ఉంటే చాలని ఆ బామ్మ నిరూపిస్తోంది. అంతేకాదు, అవయవాలు అన్నీ సక్రమంగా ఉండి శరీరంలో శక్తి ఉన్నంత వరకు పని చేసి బతకాల్సిందేనన్న అక్షర సత్యాన్ని ఆమె చాటి చెబుతోంది. నిజంగా ఆ బామ్మను మనం అభినందించాల్సిందే! ఏమంటారు!

Comments

comments

Share this post

scroll to top