మ‌న‌వ‌ళ్ల చదువుకోసం తాత ఆరాటం…వాళ్లతోనే స్కూళ్లో కూర్చొని క్లాస్ లు వింటున్న వైనం.

పిల్ల‌ల‌న్నాక స్కూల్‌కు వెళ్ల‌మ‌ని చెప్పి మారాం చేయ‌డం స‌హ‌జ‌మే. ఎక్క‌డైనా పిల్ల‌లు ఇలాగే చేస్తారు. అయిన‌ప్ప‌టికీ త‌ల్లిదండ్రులు వారిని బుజ్జ‌గించి, బ‌తిమిలాడి, లంచం ఆశ చూపి ఎలాగో స్కూలుకు పంపిస్తారు. అయినా వారు అక్క‌డ చ‌ద‌వ‌కుండా తిరిగి ఇంటికి వ‌స్తే..?  లేదంటే స్కూల్‌కు డుమ్మా కొట్టి బ‌య‌ట తిరిగితే..? అప్పుడు త‌ల్లిదండ్రులు ఏం చేస్తారు..? త‌ల్లిదండ్రుల మాటేమోగానీ, ఆ తాత మాత్రం క‌చ్చితంగా తాను చేసేది చేస్తున్నాడు. మ‌న‌వ‌ళ్ల చ‌దువుకోసం తానూ తిప్ప‌లు ప‌డుతున్నాడు. ఇంత‌కీ ఆ తాత ఏం చేశాడు..?

grand-father-education
అది వైజాగ్‌లోని హుకుంపేట మండ‌లం రాప పంచాయ‌తీ, లివిటి గ్రామం. సప్ప‌లి జ‌గ్గారావు అనే తాత ఉండేది అక్క‌డే. ఆయ‌న వ్య‌వ‌సాయదారుడు. అత‌నికి ఓ కొడుకు, ఓ కుమార్తె ఉన్నారు. అయితే వారిద్ద‌రినీ చిన్న‌ప్పుడు జ‌గ్గారావు స్కూలుకు పంపాడు. కానీ వారే స‌రిగ్గా చ‌దువుకోకుండా బ‌లాదూర్ తిరిగారు. ఈ క్ర‌మంలో పెరిగి పెద్ద‌వార‌య్యారు. కానీ చ‌దువు లేక‌పోవ‌డంతో తిరిగి వారు కూడా వ్య‌వ‌సాయ‌దారులుగానే సెటిల్ అయ్యారు. దీంతో జ‌గ్గారావుకు మ‌న‌స్తాపం క‌లిగింది. కానీ ఎక్కువ చింతించ‌లేదు. ఎందుకంటే తన కొడుకు, కూతురు ఎలాగూ చ‌దువుకోలేదు, క‌నీసం వారికి పుట్టిన బిడ్డ‌లైన త‌న మ‌న‌వళ్ల‌నైనా చ‌దివిద్దామ‌ని కంక‌ణం క‌ట్టుకున్నాడు.

ఈ క్ర‌మంలోనే జ‌గ్గారావు త‌న కొడుకు కొడుకైన స‌ప్ప‌లి హ‌రిచంద్ర‌శేఖ‌ర్‌, కుమార్తె కొడుకైన యోగేంద్ర‌ను స్థానికంగా ఇటీవ‌లే ఏర్పాటు చేసిన ప్ర‌భుత్వ ఇంగ్లిష్ పాఠ‌శాల‌లో చేర్చాడు. అయితే త‌న కొడుకు, కుమార్తెలు చిన్న‌ప్పుడు చేసిన‌ట్టే త‌న మ‌న‌వ‌ళ్లు కూడా చేయ‌సాగారు. స్కూల్‌కు డుమ్మా కొట్టి బ‌య‌ట తిరగ‌డం మొద‌లు పెట్టారు. దీంతో ఆ తాత ఓ ప్లాన్ వేశాడు. అప్ప‌టి నుంచి త‌న మ‌న‌వ‌ళ్ల‌తోనే ఆయ‌న ఉండ‌డం మొద‌లు పెట్టాడు. నిత్యం వారితోపాటు స్కూల్‌కు వెళ్ల‌డం, పాఠాలు చెబుతున్నా వారి మ‌ధ్యే కూర్చోవ‌డం, స్కూల్ అయ్యాక వారితోపాటు వ‌సతిగృహంలో ఉండ‌డం చేస్తున్నాడు. దీంతో ఆ తాత త‌న మ‌న‌వ‌ళ్ల‌కే కాదు, ఆ వ‌స‌తి గృహంలోని పిల్ల‌లంద‌రికీ తాత అయి సొంత మ‌న‌వ‌ళ్ల‌ను చూసుకున్న‌ట్టే వారినీ చూస్తున్నాడు. వారికీ సేవ‌లు చేస్తున్నాడు. ఏది ఏమైనా త‌న మ‌న‌వ‌ళ్లు చ‌దువుకుని గొప్ప‌వారు కావాల‌నే ఆ తాత కోరిక మాత్రం బ‌లమైంది. అది క‌చ్చితంగా నెర‌వేరే తీరుతుంది.

Comments

comments

Share this post

scroll to top