రైలు ఇంజిన్‌, బోగీలు ఓవైపు, విమానం మ‌రో వైపు ఉన్న స్కూల్ ఇదే… ఎందుకో తెలుసా..?

మ‌న దేశంలో ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో విద్యార్థుల సంఖ్య ఎంత త‌క్కువ‌గా ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. కారణం.. వాటిల్లో స‌రిగ్గా చ‌దువు చెప్ప‌ర‌ని, సౌక‌ర్యాలు స‌రిగ్గా ఉండ‌వ‌ని త‌ల్లిదండ్రులు న‌మ్ముతారు. అందుకే వారు త‌మ పిల్ల‌ల‌ను వేల‌కు వేలు పెట్టి ప్రైవేటు స్కూళ్ల‌లో చేర్పిస్తారు. నిజానికి స‌దుపాయాలు స‌రిగ్గా ఉన్న‌ప్ప‌టికీ కొన్ని స్కూళ్ల‌లో అస్స‌లు పిల్ల‌ల్ని చేర్పించరు. అయితే ఇలాంటి వ్య‌క్తిత్వం ఉన్న త‌ల్లిదండ్రుల్లో మార్పు తేవ‌డానికి ఆ ప్ర‌భుత్వ పాఠ‌శాల ఉపాధ్యాయులు వినూత్న ప్ర‌యోగం చేశారు. దీంతో ఆ త‌ల్లిదండ్రుల్లో మార్పు రావ‌డ‌మే కాదు, త‌మ పిల్ల‌ల్ని ఆ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చేర్పిస్తామని అడ్మిష‌న్ల కోసం క్యూ క‌ట్టారు. ఇంత‌కీ వారు చేసిన వినూత్న ప్ర‌యోగం ఏమిటంటే…

అది కేరళలోని కాసర్‌గోడ్‌ జిల్లా పిలికోడ్‌ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథ‌మికోన్నత పాఠశాల. అక్క‌డ 7వ తర‌గ‌తి ఉంది. అయితే ఏటా అందులో విద్యార్థుల సంఖ్య త‌గ్గుతుంది కానీ పెర‌గ‌డం లేదు. దీంతో ఆ పాఠ‌శాల ఉపాధ్యాయులు వినూత్న ప్ర‌యోగం చేశారు. ఆ స్కూల్ త‌ర‌గ‌తి గ‌దుల‌కు కొత్త‌గా పెయింట్ వేయించారు. అదేంటీ… పెయింటింగ్ వేస్తేనే త‌ల్లిదండ్రులు అడ్మిషన్ల కోసం వ‌చ్చారా..? అంటే… అవును మ‌రి. ఎందుకంటే ఆ పెయింటింగ్ సాధార‌ణ పెయింటింగ్ కాదు, బ‌య‌టి నుంచి రూమ్‌ల‌ను చూస్తే అచ్చం రైలు ఇంజిన్‌, బోగీల్లా ఆ త‌ర‌గ‌తులు ఉంటాయి. ఓ వైపు రైలు, మ‌రో వైపు విమానం పెయింటింగ్ వేశారు.

దీంతో పిల్ల‌ల‌కు రైలింజ‌న్‌, బోగీలు, విమానంలో కూర్చున్న ఫీలింగ్ క‌లిగి ఎంతో ఉత్సాహంగా ఉంటున్నార‌ట‌. వాటిల్లో ఉండి ఆడుకుంటున్న‌ట్టుగా ఆట‌లాడుతున్నార‌ట‌. దీంతో అది చూసిన ఇత‌ర త‌ల్లిదండ్రుల‌కు ఆ స్కూల్ ప‌ట్ల ఆస‌క్తి పెరిగింది. ఈ క్ర‌మంలోనే చాలా మంది త‌మ త‌మ పిల్ల‌ల‌ను ప్రైవేట్ స్కూల్స్ మార్పించి మ‌రీ ఆ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో చేర్పిస్తున్నారు. అలా ఇప్ప‌టి వ‌ర‌కు 185 మందికి పైగా కొత్త విద్యార్థులు ఆ స్కూల్‌లో చేరారు. తమ ప్ర‌యోగం ఫ‌లించినందుకు ఆ పాఠ‌శాల ఉపాధ్యాయులు కూడా సంతోషం వ్య‌క్తం చేస్తున్నారు. ఇంత‌కీ అస‌లు ఆ పెయింటింగ్‌కు ఎవ‌రు డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టారో తెలుసా..? ఇంకెవ‌రు… స్థానికంగా ఉన్న పిలికోడ్ గ్రామ‌స్తులే. వారు ఇవ్వ‌గా కొంత డ‌బ్బు ఇంకా అవ‌స‌రం కావ‌డంతో ప్ర‌భుత్వ నిధులను వెచ్చించారు. దీంతో రూ.2 ల‌క్ష‌ల‌తో అలా పెయింటింగ్ ప‌ని పూర్త‌యింది. ప్ర‌స్తుతం అందులో ఉన్న 400 మంది పిల్ల‌ల‌కు మ‌రో 185 మంది తోడ‌య్యారు. స్కూల్స్ ఇప్పుడే ప్రారంభం కావ‌డంతో రానున్న రోజుల్లో ఈ సంఖ్య మ‌రింత పెరుగుతుంద‌ని ఆ ఉపాధ్యాయులు భావిస్తున్నారు. ఏది ఏమైనా వారిది నిజంగా మంచి ఐడియానే క‌దా. పిల్ల‌ల‌కు దీంతో చాలా ఉత్సాహం వ‌స్తుంది..! ఇలా చేస్తే ఎక్క‌డైనా ప్ర‌భుత్వ‌ పాఠ‌శాల‌ల్లో వారి సంఖ్య పెంచ‌వచ్చు..!

Comments

comments

Share this post

scroll to top