మన దేశంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు ఎలా పనిచేస్తారో అందరికీ తెలిసిందే. ప్రజలు ఏ పనికోసం వచ్చినా చాలా మంది లంచం అడుగుతారు. లంచం తీసుకోకుండా వారు ఏ పనీ చేయరు. అలా పనిచేసే ఉద్యోగులు చాలా తక్కువ మందే ఉంటారు. నీతి, నిజాయితీలు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కడో నూటికి ఒక్కరు గానీ కనపడరు. ఇప్పుడు మేం చెప్పబోయేది కూడా అలాంటి ఓ ఉద్యోగి గురించే. ఇంతకీ ఆయన ఎవరంటే…
అతని పేరు అబ్దుల్ సలీం పల్లియల్ తోడి. కేరళలో అంగడిపురం పంచాయతీలో క్లర్క్ గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే అతను ఆఫీసులో తన డెస్క్ పై ఓ బోర్డు ఏర్పాటు చేశాడు. దానిపై మళయాళంలో కొన్ని మాటలు రాశాడు. అవేమిటంటే… తాను లంచం తీసుకోనని, దయచేసి ఎవరూ లంచం ఇవ్వవద్దని, ఒక వేళ ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే నేరుగా తనను సంప్రదించవచ్చని, ఆ సమస్యను పరిష్కరిస్తానని, తనపై ఎవరికైనా ఎలాంటి అభిప్రాయం ఉన్నా నేరుగా తనకే చెప్పవచ్చని… తెలియజేస్తూ బోర్డును ఏర్పాటు చేశాడు. అంతేకాదు తనకు రోజుకు 811 రూపాయల చొప్పున నెలకు రూ.24,340 లను ప్రభుత్వం జీతంగా ఇస్తుందని, అది తనకు చాలని, లంచం అవసరం లేదని బోర్డులో రాశాడు. ఈ క్రమంలో అబ్దుల్ సలీంను ఎవరో ఓ వ్యక్తి ఫోటో తీసి నెట్లో పెట్టాడు. ఇంకేముందీ… ఇప్పుడతని ఫోటో వైరల్ అయింది. కొన్ని లక్షల మంది ఆ ఫొటోను చూశారు.
సాక్షాత్తూ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా అబ్దుల్ సలీం ను పొగిడారు. అలాంటి నిజాయితీ కలిగి ఉన్నందుకు అతన్ని అభినందించారు కూడా. అయితే అబ్దుల్ సలీం నిజానికి వికలాంగుడు. 40 శాతం పోలియోతో బాధపడుతున్నాడు. వయస్సు 42 సంవత్సరాలు. అయినా అతను పని మీద బయటికి వెళ్లాల్సి వస్తే ఏ మాత్రం ఆలోచించడు. వెంటనే వెళ్లి తన బాధ్యతను నిర్వహిస్తాడు. ఈ క్రమంలో అబ్దుల్ సలీం అక్కడ పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆదర్శం అయ్యాడు కూడా. వారు కూడా అతన్నే అనుసరిస్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి నిజాయితీ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులే కదా… మనకు కావల్సింది..!