ఆ బాలిక రాసిన లేఖ ప్ర‌ధాని మోడీ ఆఫీస్‌ను క‌దిలించింది..!

మా గ్రామంలో రోడ్లు బాగా లేవు… క‌రెంటు లేదు… ఆరోగ్యం, పారిశుధ్యం సౌక‌ర్యాలు అస్స‌లే లేవు… అని ఎవ‌రైనా గ్రామ‌స్తులు మొర పెట్టుకుంటే ఏ రాజ‌కీయ నాయ‌కుడైనా మ‌న దేశంలో ప‌ట్టించుకుంటారా..? అంత సామాన్యంగా ఆ స‌మ‌స్య‌ల ప‌ట్ల స్పందించ‌రు. ఇక అధికారుల విష‌యానికి వ‌స్తే వారి వ‌ద్ద‌కు వెళ్ల‌క‌పోవ‌డ‌మే బెట‌ర్‌, ప‌ని ఎలాగూ జ‌ర‌గ‌దు, వారు ప‌ట్టించుకోరు, అంత మాత్రానికి వారిని బ‌తిమిలాడి ఏ లాభం అనే స‌గ‌టు పౌరుడు ఆలోచిస్తాడు. అయితే అలాంటి నేత‌లు, అధికారులు ఉంటారు కాబ‌ట్టి, వారు ఎలాగూ ప‌ట్టించుకోర‌నే భావించిన ఆ బాలిక‌, ఏకంగా ప్ర‌ధాని మోడీకే ఉత్త‌రం రాసింది. దీంతో పీఎంవో (ప్రధాన‌మంత్రి కార్యాల‌యం) క‌ద‌లి వ‌చ్చింది. వెంట‌నే ఆ బాలిక ఉన్న గ్రామంలో అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల‌కు ఆదేశాలు జారీ చేసింది.

letter-to-modi

అది క‌ర్ణాట‌క రాష్ట్రంలోని చిక్‌మ‌గ‌ళూరు జిల్లా ముదిగెరె తాలూకా అలెఖ‌న్ హొరట్టి గ్రామం. జిల్లా కేంద్ర‌మైన చిక్‌మ‌గ‌ళూరుకు కేవ‌లం 45 కిలోమీట‌ర్ల దూరంలోనే ఉన్నా ఆ గ్రామం అన్ని రంగాల్లోనూ వెనుక బ‌డింది. అక్క‌డ సౌక‌ర్యాల లేమి కొట్టిచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. ఆ గ్రామానికి వెళ్దామంటే స‌రైన రోడ్డు లేదు. మ‌ట్టి రోడ్డే దిక్కు. వ‌ర్షాకాలంలోనైతే ఇక ఆ దారిలో వెళ్ల‌లేం. అంత‌లా దిగ‌బ‌డి పోతుంది. దీంతోపాటు క‌రెంటు, తాగునీరు, పారిశుధ్యం, వైద్యం వంటి సౌక‌ర్యాలు మ‌చ్చుకు కూడా కాన‌రావు. స్థానిక గ్రామ‌స్తులకు ఏదైనా సుస్తీ చేస్తే జిల్లా కేంద్రానికి వెళ్లాల్సిందే. దీంతో ఆ గ్రామ వాసులు ప‌డుతున్న బాధ‌లు అన్నీ ఇన్నీ కావు. అయితే అదే గ్రామంలో నివాసం ఉంటూ అక్క‌డికి కొంత దూరంలో ఉన్న ఓ పాఠ‌శాల‌లో చ‌దువుకుంటున్న ఏజీ న‌మ‌న అనే ఓ 16 ఏళ్ల బాలిక త‌మ గ్రామంలోని స‌మ‌స్య‌ల‌ను నిత్యం చూస్తూ వ‌స్తోంది. స్థానికులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను, ప‌ట్టించుకోని నాయ‌కులు, అధికారుల‌ను గ‌మ‌నిస్తూ వ‌చ్చింది. అయితే ఒక రోజు ఏమ‌నుకుందో ఏమో త‌మ గ్రామ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని కోరుతూ ఏకంగా ప్ర‌ధాని మోడీకే ఉత్త‌రం రాసింది.

ఆ ఉత్త‌రాన్ని ఢిల్లీలోని పీఎంవో అధికారులు గ‌త అక్టోబ‌ర్ నెల 6వ తేదీన అందుకున్నారు. అయితే వెంట‌నే స్పందించ‌లేదు. ఈ క్ర‌మంలో ఆ బాలిక చేసేది లేక ఎప్ప‌టిలాగే రోజూ స్కూల్‌కు వెళ్తూ వ‌స్తూ ఉండేది. త‌న ఉత్త‌రం వృథా అయింద‌ని నిరాశ చెందింది. అయితే నిజానికి అది మాత్రం వృథా కాలేదు. మొన్నా మ‌ధ్యే ఆ ఉత్త‌రానికి పీఎంవో అధికారులు స్పందించారు. న‌మ‌న గ్రామ‌మైన అలెఖ‌న్ హొర‌ట్టిలో వెంట‌నే అన్ని సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని ఆ రాష్ట్ర ప్ర‌భుత్వానికి లేఖ రాశారు. అక్క‌డి అధికారుల‌ను మేలుకొల్పారు. దీంతో అక్క‌డి ఎమ్మెల్యే నింగ‌య్య వ‌చ్చి రూ.80 ల‌క్ష‌ల నిధుల‌తో వెంట‌నే ఆ గ్రామంలో అన్ని సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని చెప్పారు. దీంతోపాటు ఎంపీ నిధుల‌తో రోడ్లు వేయిస్తామ‌న్నారు. అయితే ప్ర‌స్తుతానికి ఆ బాలిక ఆ గ్రామంలో ఉండ‌డం లేదు. వేరే ద‌గ్గ‌ర చ‌దువుకుంటోంది. కానీ ఆమె త‌ల్లిదండ్రులు అదే గ్రామంలో ఉంటుండ‌డంతో వారి ఆనందానికి అవ‌ధులు లేవు. త‌మ కూతురు రాసిన ఉత్త‌రం వ‌ల్లే త‌మ గ్రామం బాగుప‌డుతుంద‌నే సరికి వారికి ప‌ట్ట‌రాని సంతోషం క‌లుగుతోంది..!

Comments

comments

Share this post

scroll to top