ఆ బాలిక లైబ్ర‌రీ పెట్టి… పేద పిల్ల‌ల‌కు విజ్ఞానాన్ని అందిస్తోంది..!

చ‌రిత్ర‌… గొప్ప వ్య‌క్తుల జీవిత గాథ‌లు… క‌థ‌లు… ఇలా ఏ అంశానికి చెందిన పుస్త‌కాన్ని తీసుకున్నా అవి మ‌న‌కు జ్ఞానాన్ని పెంచుతాయి. ప్ర‌పంచాన్ని మ‌న‌కు ప‌రిచ‌యం చేస్తాయి. అందుకే ఓ ప్ర‌ముఖ క‌వి కూడా అన్నాడు… చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్త‌కాన్ని కొనుక్కో… అని. పుస్త‌కాల విలువ అలాంటిది మ‌రి. అందుకే ఆ క‌వి అలా అన్నాడు. అయితే నేటి స్మార్ట్ యుగంలో ఒక‌ప్ప‌టిలా పుస్త‌కాల‌ను ఇప్పుడు చ‌ద‌వ‌డం లేదు. ఫోన్లు, టాబ్లెట్ పీసీలు, ల్యాప్‌టాప్‌లు… ఇవే లోకం అయిపోయాయి. చిన్నారులైతే ఎప్పుడూ కంప్యూట‌ర్, ఫోన్ లేదా టాబ్లెట్‌ల‌లో గేమ్స్ ఆడుతున్నారు. అది కుద‌ర‌క‌పోతే టీవీ పెట్టుకోవ‌డం, ఏ కార్టూన్ చాన‌లో చూడ‌డం ఇప్పుడు కామ‌న్ అయింది. ఈ క్ర‌మంలో పిల్ల‌ల్లో ఇలాంటి ధోర‌ణి పోవాల‌ని, పుస్త‌కాల ప‌ట్ల వారు ఆక‌ర్షితులు కావాల‌ని దాంతో జ్ఞాన‌వంతులుగా త‌యార‌వ్వాల‌ని ఆకాంక్షిస్తూ ఓ వినూత్న కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టింది ఆ బాలిక‌. వ‌య‌స్సు 9 సంవ‌త్స‌రాలే అయినా, త‌మ‌ది మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబ‌మే అయినా త‌న చుట్టూ ఉన్న పేద పిల్ల‌ల‌కు పుస్త‌క విజ్ఞానాన్ని అందించ‌డం కోసం న‌డుం బిగించింది ఆమె. ఈ క్ర‌మంలో ఆ బాలిక త‌న ప్ర‌యత్నానికి మంచి ఫ‌లితాన్నే సాధించి అంద‌రిచే శ‌భాష్ అనిపించుకుంటోంది.

muskaan-ahirwar

ఆమె పేరు ముస్కాన్ అహిర్వార్‌. వ‌య‌స్సు 9 ఏళ్లు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని భోపాల్‌లో నివాసం. తండ్రి కార్పెంట‌ర్‌గా ప‌నిచేస్తున్నాడు. ముస్కాన్ అక్క నేహా. అయితే ముస్కాన్ అంద‌రు పిల్ల‌ల్లా కాదు. ఆమెకు కంప్యూట‌ర్ గేమ్స్ ఆడ‌డం, టీవీ చూడ‌డం వంటివి న‌చ్చ‌వు. ఎప్పుడూ ఏదో ఒక పుస్త‌కం చ‌దువుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమెకు ఎంతో జ్ఞానాన్ని సంపాదించింది కూడా. అయితే ఒక రోజు ముస్కాన్ ఉంటున్న ఏరియాకు స్టేట్ ఎడ్యుకేష‌న్ బోర్డ్ అధికారులు వ‌చ్చారు. ఆ ప్రాంతంలో ఉన్న పిల్ల‌ల ప‌రిజ్ఞానం ఎంత ఉందో, వారు చదువుల్లో ఎలా ఉన్నారో తెలుసుకునేందుకు ఆ పిల్ల‌ల‌కు వారు కొన్ని ప్ర‌శ్న‌లు సంధించారు. అయితే ముస్కాన్ చెప్పినంత వేగంగా, క‌రెక్ట్‌గా ఎవ‌రూ స‌మాధానం చెప్ప‌లేక‌పోయారు. దీంతో ఆ బోర్డు అధికారుల‌కు ముస్కాన్ ప్ర‌తిభ చూసి ముచ్చ‌టేసింది. అయితే అప్పుడే ముస్కాన్ ఆ అధికారుల‌ను ఒక‌టి అడిగింది. అదేమిటంటే…

త‌మ ప్రాంతంలో చాలా మంది పేద పిల్ల‌లు ఉంటున్నార‌ని, వారంద‌రి కోసం తాను ఓ లైబ్ర‌రీ ఏర్పాటు చేయాల‌నుకుంటున్నాన‌ని, అందుకు స‌హ‌కారం అందించాల‌ని ముస్కాన్ ఆ అధికారుల‌ను కోరింది. దీంతో ఆ అధికారులు మొద‌ట ఆశ్చ‌ర్య‌పోయినా ముస్కాన్ కోరిక మేర‌కు ఆమెకు ఓ ప‌థకం కింద కొన్ని పుస్త‌కాల‌ను తొలి విడ‌త‌గా అంద‌జేశారు. దీంతో ముస్కాన్ తమ ఇంటి ఆవ‌ర‌ణ‌లోనే లైబ్ర‌రీ ఏర్పాటు చేసింది. రోజూ సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ముస్కాన్ ఆ లైబ్ర‌రీని తెరుస్తుంది. దీంతో చుట్టు ప‌క్క‌ల ఉన్న పిల్ల‌లు వ‌చ్చి ఆ లైబ్ర‌రీలోని పుస్త‌కాల‌ను చ‌దువుకుంటున్నారు. అలా ముస్కాన్ ఒక్క‌తే ఆ లైబ్ర‌రీని నిర్వ‌హిస్తుండ‌డం విశేషం. అయితే ముస్కాన్ అందుబాటులో లేక‌పోతే ఆ బాధ్య‌త‌ను త‌న అక్క నేహా చూసుకుంటుంది. ఈ క్ర‌మంలో ముస్కాన్‌లో ఉన్న ప‌ట్టుద‌ల గ‌మ‌నించిన స‌ద‌రు అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు కొన్ని పుస్త‌కాల‌ను ఆ లైబ్ర‌రీకి పంపుతున్నారు. ఇప్పుడు ఆమె ఏర్పాటు చేసిన ఆ లైబ్ర‌రీలో దాదాపుగా 119 పుస్త‌కాలు ఉన్నాయి. త్వ‌ర‌లో మ‌రిన్ని పుస్త‌కాలు వ‌చ్చేలా ఏర్పాటు చేస్తామంటున్నారు అధికారులు. అయితే ముస్కాన్ లైబ్ర‌రీ గురించి మ‌నం తెలుసుకోవాల్సిన ఇంకో విష‌యం ఏమిటంటే… అక్క‌డ ఉన్న పుస్త‌కాల‌ను ఇప్పుడు ఇత‌ర ప్రాంతాల‌కు చెందిన పిల్ల‌లు కూడా వ‌చ్చి చ‌దువుతున్నార‌ట‌. అవ‌సరం ఉంటే వారికి ఒక రోజుకు ముస్కాన్ ఆ పుస్త‌కాల‌ను ఉచితంగానే చ‌దువుకోమ‌ని ఇస్తుంది. వారు వాటిని చదివాక భ‌ద్రంగా ముస్కాన్‌కు తెచ్చిస్తారు. అయితే అక్క‌డి పిల్ల‌లు ఆస‌క్తిగా చ‌దువుతున్న పుస్త‌కాలు ఏమిటో తెలుసా..? ప‌్ర‌ముఖుల జీవిత చ‌రిత్ర‌లు, పురాణాలు, క‌థ‌లు… ఆ పుస్త‌కాలంటేనే అక్క‌డి చిన్నారులు ఇష్ట ప‌డుతున్నార‌ట‌. ఏది ఏమైనా… లైబ్ర‌రీతో పేద పిల్ల‌ల్లో జ్ఞానాన్ని పెంచుతున్న ముస్కాన్ కృషికి నిజంగా మ‌నం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top