ఆ బాలిక చిన్న‌ప్పుడే త‌ల్లిదండ్రులు చ‌నిపోయారు. క‌ష్టాల నడుమే టెన్త్‌లో టాప్ వ‌చ్చింది..!

ఓ వైపు త‌ల్లిదండ్రులు చ‌నిపోయారు. మ‌రో వైపు చెల్లెలు, త‌మ్ముడు ఇద్ద‌రూ చిన్న పిల్ల‌లే. ఆ స‌మ‌యంలో త‌న‌కు చ‌దువుకోవాలా..? లేక చిన్న పిల్ల‌లుగా ఉన్న చెల్లెలు, త‌మ్ముడిని చూసుకోవాలా..? తెలియ‌లేదు. దీనికి తోడు అండ‌దండ‌గా ఉన్న త‌ల్లిదండ్రుల మ‌ర‌ణం ఆ బాలిక‌ను మ‌రింత కుదిపేసింది. అయితే అప్పుడే… ఆ స‌మ‌యంలోనే… ఓ మ‌హిళ దేవ‌త‌గా వ‌చ్చింది. ఆ బాలికకు అండ‌గా నిలిచింది. ఆమెతోపాటు ఆమె చెల్లెలు, త‌మ్ముడిని కూడా ఆమె ద‌త్త‌త తీసుకుంది. ఈ క్ర‌మంలో ఆ బాలిక త‌న పెంచిన త‌ల్లి గ‌ర్వ‌ప‌డేలా స‌త్తా చాటింది. మాన‌వ‌త‌ను చాటిన ఈ సంఘ‌ట‌న జ‌రిగింది తెలంగాణ రాష్ట్రంలో..!

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మ౦డల౦ నిమ్మపల్లి గ్రామానికి చె౦దిన గుమ్మడిదారి భవాని త‌ల్లిదండ్రులు రెండేళ్ల క్రితం చ‌నిపోయారు. అప్పుడు ఆమెకు భార్గ‌వి, విష్ణు అనే చెల్లెలు, త‌మ్ముడు కూడా ఉన్నారు. అయితే అనుకోకుండా దుర‌దృష్ట‌వ‌శాత్తూ త‌ల్లిదండ్రులు చ‌నిపోవ‌డంతో భ‌వానికి ఏం చేయాలో తోచ‌లేదు. దీనికి తోడు త‌న క‌న్నా చిన్న‌వాళ్లయిన భార్గ‌వి, విష్ణుల సంర‌క్ష‌ణ బాధ్య‌త ఆమెపై ప‌డింది. అయితే అప్పుడే దేవ‌త‌లా వ‌చ్చింది ఆ మ‌హిళా సీఐ. ఆమె పేరు మాధ‌వి. వేముల‌వాడ రూర‌ల్ సీఐగా విధులు నిర్వ‌హిస్తోంది. ఈ క్ర‌మంలోనే ఆమె భ‌వాని గురించి తెలుసుకుని చ‌లించిపోయింది. దీంతో ఆమెకు స‌హాయం చేయ‌డం కోసం ముందుకు వ‌చ్చింది.

అలా సీఐ మాధ‌వి భ‌వాని వ‌ద్ద‌కు వ‌చ్చి ఆమెను, ఆమెతోపాటు ఆమె చెల్లెలు భార్గ‌వి, త‌మ్ముడు విష్ణుల‌ను కూడా ఆమె ద‌త్త‌త తీసుకుంది. అప్ప‌టి నుంచి భ‌వాని మాధ‌వి స‌హాయంతో చ‌ద‌వ‌సాగింది. ఈ క్ర‌మంలో మాధ‌వి ఆమెను రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలోని తంగ‌ళ్ల‌ప‌ల్లి క‌స్తూర్బా పాఠ‌శాల‌లో చేర్పించింది. పండ‌గలు వ‌చ్చిన‌ప్పుడు ఆమెను మాధ‌వి త‌న ఇంటికి తీసుకుపోయేది. అలా రెండేళ్లు గ‌డిచాయి. అయితే ఇటీవ‌లే జ‌రిగిన ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్షల్లో భ‌వాని 9.7 జీపీఏ సాధించి ప్ర‌తిభ చాటింది. రాజన్నసిరిసిల్ల జిల్లా స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో రె౦డవ స్థానంలో నిలిచింది. దీంతో భ‌వానిని సీఐ మాధ‌వి మాత్ర‌మే కాదు, సాక్షాత్తూ తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్ శర్మ, ఇత‌ర పోలీసు ఉన్న‌తాధికారులు కూడా అభినందించారు. భ‌వాని ఇంకా ఇలాగే ఉన్న‌త చ‌దువులు చ‌దివి గొప్ప స్థానాలు పొందాల‌ని మ‌నం కూడా ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top