బాడీ బిల్డింగ్ చాంపియన్ అవడం అంటే మాటలు కాదు కదా..! పురుషులకే అందుకు చాలా సమయం పడుతుంది..! ఆ తరువాత కూడా వారు స్పాన్సర్లను వెదుక్కునేందుకు, పోటీల్లో పాల్గొనేందుకు ఇబ్బందులు పడతారు. అలాంటిది… ఆ కెరీర్ అంటే ఇక మహిళలకు చాలా కష్టసాధ్యమనే చెప్పాలి. అందుకు మొదట వారి ఇండ్లలోనే నో చెబుతారు. అలాంటిది… ఆ యువతి తనకు ఎదురైన సవాళ్లన్నింటినీ అధిగమించి తాను ఎప్పటి నుంచో కలలు కన్న బాడీ బిల్డింగ్ కెరీర్లో లక్ష్య సాధన దిశగా విజయవంతంగా ముందుకు వెళ్తోంది. ఆమే… తనూషా చందన..!
తనూషా చందనది హర్యానా రాష్ట్రం. చాలా మంది యువతుల్లాగే ఆమె మొదట ఫ్యాషన్ డిజైనింగ్‌లో రాణించాలని ఆ కోర్సులో చేరింది. అలా ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతున్న సమయంలోనే ఆమె దృష్టి బాడీ బిల్డింగ్ వైపు మళ్లింది. ఎలాగైనా తాను ఆ రంగంలో చాంపియన్ అవ్వాలనుకుంది. అయితే అందుకు ఆమె తల్లిదండ్రులు అడ్డు చెప్పారు. బాడీ బిల్డింగ్ అంటే కేవలం పురుషులకు మాత్రమే సాధ్యమవుతుందని, మహిళలకు పనికిరాదని వారి అభిప్రాయం. రానీ తనూషాకు ఆ కెరీర్ అంటే ఇష్టం ఉండడంతో ఓ వైపు తల్లిదండ్రులు నో చెబుతున్నా, తాను మాత్రం అందులోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుంది. అలా అనుకున్న వెంటనే నిత్యం జిమ్‌కు వెళ్లడం ప్రారంభించింది.
ఓ వైపు చదువు, మరో వైపు గంటల తరబడి జిమ్‌లో తనూషా గడిపేది. అందుకు గాను ఆమెకు నెలకు రూ.40వేలకు పైగా డబ్బు ఖర్చయ్యేది. పర్సనల్ ట్రెయినర్, న్యూట్రిషనిస్టుల సహాయంతో ఆమె ఎట్టకేలకు మంచి శరీరాకృతిని పొందింది. అప్పటికే ఆమె ఫ్యాషన్ డిజైన్ కోర్సు కూడా కంప్లీట్ అవడంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బాడీ బిల్డింగ్ పోటీలకు హాజరవుతూ వచ్చింది. అందులో భాగంగానే ఆమె హర్యానా రాష్ట్రంలో నిర్వహించిన స్టేట్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్‌లో విజయం సాధించి గోల్డ్ మెడల్‌ను కైవసం చేసుకుంది. దీంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఆమెపై పడింది. ఇక అంతే… రాత్రికి రాత్రే ఆమె ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు చాలా కంపెనీలు ఆమెకు మ్యాచ్‌ల కోసం గాను స్పాన్సర్‌షిప్‌లు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. దీంతోపాటు ఆమె ఓ ప్రముఖ జిమ్‌లో ఫిట్నెస్ ట్రెయినర్‌గా కూడా మారి తనలాంటి ఆసక్తి ఉన్న యువతుల కోసం ట్రెయినింగ్ కూడా ఇస్తోంది. అందుకు గాను ఆమె నిత్యం 9 గంటలపాటు జిమ్‌లో గడుపుతోంది. దీనికి తోడు మరో 2 గంటలు తాను సొంతంగా జిమ్‌లో కసరత్తులు కూడా చేస్తోంది. రానున్న ఆలిండియా ఏషియా చాంపియన్ షిప్లో మెడల్ సాధించాలని ఆమె తీవ్రంగా శ్రమిస్తోంది. ఆమె కల సాకారం కావాలని మనమూ ఆశిద్దాం..!