మెరిట్ వ‌చ్చినా సీటు ఇవ్వ‌ని మెడిక‌ల్ కాలేజీలు… కోర్టు ద్వారా రూ.20 ల‌క్ష‌ల న‌ష్ట‌ప‌రిహారం వ‌సూలు చేసిన యువ‌తి..!

మ‌న దేశంలో ఇంజినీరింగ్, మెడిసిన్ వంటి కోర్సుల్లో ప్ర‌వేశం పొందేందుకు ఎంత‌టి కాంపిటీష‌న్ ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. ఇంజినీరింగ్ ఏమో గానీ మెడిసిన్ లో ఇంకా ఎక్కువ పోటీ ఉంటుంది. అందులో ఒక రేంజ్‌లో ఉత్తీర్ణ‌త సాధిస్తేనే కోర్సులోకి ప్రవేశం పొందేందుకు అర్హ‌త ల‌భిస్తుంది. అయితే కొంద‌రు మాత్రం అలా కాదు. దొడ్డి దారిన ఆ కోర్సులో చేరుతారు. స‌రైన మెరిట్ లేకున్నా డ‌బ్బులిచ్చి కాలేజీల‌ను మేనేజ్ చేస్తారు. దీంతో అస‌లు మెరిట్ వ‌చ్చిన వారికి అన్యాయం జ‌రుగుతుంది. అదిగో… స‌రిగ్గా ఆ యువ‌తికి కూడా ఇలాగే జ‌రిగింది. అయితే మ‌న చేతుల్లో ఏముంది, మ‌నమేం చేయ‌గ‌లం..? అని ఆమె ఆలోచించ‌లేదు. ధైర్యంగా ముంద‌డుగు వేసింది. త‌న‌కు జ‌రిగిన అన్యాయానికి గాను న్యాయ పోరాటం చేసింది. ఫ‌లితంగా ఆమెకు ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.20 ల‌క్ష‌ల జ‌రిమానా చెల్లించ‌నుంది.

ఆమె పేరు ఫిర్దోస్ అన్సారీ. మ‌హారాష్ట్ర వాసి. 2012లో ఈమె ఎంబీబీఎస్ ప్ర‌వేశ ప‌రీక్ష రాసింది. అందులో ఉత్తీర్ణ‌త సాధించింది. ఈ క్రమంలోనే రెండు కాలేజీల్లో అడ్మిష‌న్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకుంది కూడా. ఆమెకు వ‌చ్చిన మెరిట్‌కు అస‌లైతే ఏదో ఒక కాలేజీలో అడ్మిష‌న్ ల‌భించాలి. కానీ అలా జ‌ర‌గ‌లేదు. ఆమె క‌న్నా త‌క్కువ మెరిట్ ఉన్న వారికి అడ్మిష‌న్ ల‌భించింది. అందుకు కార‌ణం కూడా ఆమె ఊహించింది. ఈ క్ర‌మంలోనే ఆమె ముంబై హైకోర్టులో కేసు వేసింది. త‌న‌కు న్యాయం చేయాల‌ని కోరింది.

కాగా కేసును విచారించిన న్యాయ స్థానం స‌ద‌రు కాలేజీలు చేసింది తప్పేన‌ని నిర్దారించింది. అందుకు గాను ఆ కాలేజీల‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోనందుకు గాను ఆ రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. స‌ద‌రు యువ‌తికి రూ.20 ల‌క్ష‌ల న‌ష్ట ప‌రిహారం చెల్లించాల‌ని కోర్పు తీర్పునిచ్చింది. దీంతో ఆ యువ‌తి ఆ మొత్తాన్ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి పొందింది. గ‌తంలోనూ సుప్రీం కోర్టులో ఇలాంటి కేసే విచార‌ణ‌కు రాగా అప్ప‌ట్లో రూ.5 ల‌క్ష‌ల న‌ష్ట ప‌రిహారం చెల్లించాల‌ని కోర్టు ఓ విద్యార్థినికి అనుకూలంగా తీర్పునిచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకునే ముంబై హైకోర్టు న్యాయ‌మూర్తులు ఇప్పుడు ఇలాంటి తీర్పునివ్వ‌డం విశేషం. ఏది ఏమైనా… త‌నకు జ‌రిగిన అన్యాయంపై పోరాడి గెలిచినందుకు ఫిర్దోస్ అన్సారీకి మ‌నం అభినంద‌న‌లు తెల‌పాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top