అమెరికా యువ‌తి అయిన‌ప్ప‌టికీ ఆమె మ‌న దేశ గ్రామ ప్ర‌జ‌ల‌కు సొంత ఖ‌ర్చుల‌తో టాయిలెట్ల‌ను క‌ట్టిస్తోంది తెలుసా..?

స‌మాజ సేవ అనేది చాలా గొప్ప కార్యం. అది చేయాలంటే చాలా మ‌న‌స్సుండాలి. దానికి చిన్నా, పెద్దా, ముస‌లి ముత‌కా, ఆడ‌, మ‌గ అనే తేడాలు ఉండ‌వు. స‌మాజ సేవ చేయాలంటే నిజానికి భాష‌, ప్రాంతం కూడా అడ్డుకావు. స‌రిగ్గా ఇదే సూత్రాన్ని వంట బ‌ట్టించుకుంది కాబ‌ట్టే ఆ మ‌హిళ మ‌న దేశం కాక‌పోయినా ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు త‌న వంతు బాధ్య‌త‌గా, తోటి మ‌నిషిగా ఏదో ఒక‌టి చేయాల‌ని భావించింది. ఆ దిశ‌గానే ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప‌లు గ్రామాల్లో ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు అత్యంత అవ‌స‌ర‌మైన మ‌రుగుదొడ్ల‌ను నిర్మించే బాధ్య‌త‌ను భుజాల‌కెత్తుకుంది. అందుకామెకు స్థానికులు కూడా స‌హ‌కారం అందిస్తున్నారు. దీంతో త‌న సొంత డ‌బ్బులతో చాలా మందికి స్వ‌యంగా మ‌రుగుదొడ్ల‌ను క‌ట్టించి ఇస్తోంది ఆమె. ఆమె పేరు మార్తా.

మార్తా సొంత దేశం అమెరికా. ఆమె చ‌క్క‌గా డిగ్రీ చేసి కూడా త‌న దేశంలో సెటిల్ అవ‌లేదు. భార‌త్‌లో ప‌ర్య‌టించింది. 2012వ సంవత్స‌రంలో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప‌లు గ్రామాల‌ను ఆమె సంద‌ర్శించింది. అక్క‌డ ప్ర‌ధానంగా మ‌రుగుదొడ్ల స‌దుపాయం లేద‌ని ఆమె తెలుసుకుంది. దీంతో సొంత ఖ‌ర్చుల‌తో అక్క‌డి ప్ర‌జ‌ల‌కు మ‌రుగుదొడ్ల‌ను క‌ట్టించి ఇవ్వాల‌ని అనుకుంది. త‌న నిర్ణ‌యాన్ని స్థానికుల‌కు చెప్ప‌డంతో కొంద‌రు ఆమెకు స‌హ‌కారం అందించారు. దీంతో ఆమె ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని జ‌గ‌త్‌పూర్, అమేథీ, రాయ్ బరేలీల‌లో మ‌రుగుదొడ్ల‌ను క‌ట్టించడం ప్రారంభించింది. అవి సాధార‌ణ మ‌రుగుదొడ్లు కావు. బ‌యో టాయిలెట్స్‌. వాటి నిర్వ‌హ‌ణ చాలా సుల‌భం. సాధార‌ణ టాయిలెట్ల‌కు సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది. దాన్ని ఎప్ప‌టిక‌ప్పుడు క్లీన్ చేయాల్సి ఉంటుంది. మార్తా క‌ట్టించిన టాయిలెట్స్ అలా కాదు. వాటికి ఉండే సెప్టిక్ ట్యాంక్ నుంచి కొన్ని పైపులు నేల అడుగు భాగంలోకి వెళ్తాయి. అక్క‌డ అమ‌ర్చిన ప‌లు ప్ర‌త్యేక‌మైన ఫిల్ట‌ర్ల ద్వారా వ్య‌ర్థం భూమి లోప‌లికి వెళ్లిపోతుంది. మిగిలిన నీరు మ‌ళ్లీ అనేక ద‌శ‌ల్లో ఫిల్ట‌ర్ అయి ప్ర‌త్యేకంగా అమ‌ర్చిన పైపుల ద్వారా బ‌య‌టికి వ‌స్తుంది. దాన్ని చెట్ల‌ను పెంచేందుకు వాడుకోవ‌చ్చు. మార్తా క‌ట్టించే టాయిలెట్స్ అన్నీ ఈ కోవ‌కు చెందిన‌వే. వీటిని evapotranspiration eco toilets అని పిలుస్తారు.

ఈ త‌ర‌హా టాయిలెట్లను ఎక్కువ‌గా అమెరికాలో నిర్మిస్తారు. అందుకే మార్తా వాటిని ఇక్క‌డ నిర్మిస్తోంది. సాధార‌ణ టాయిలెట్ నిర్మాణం కోసం రూ.17వేల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంది. కానీ ఈ ఎకో టాయిలెట్ నిర్మాణానికి కేవ‌లం రూ.10వేలు మాత్ర‌మే ఖ‌ర్చ‌వుతుంది. దీంతో చాలా మంది గ్రామ‌స్తులు సొంతంగా ఇలాంటి టాయిలెట్ల‌ను నిర్మించుకునేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. 2013 నుంచి మార్తా ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగేళ్ల కాలంలో సొంతంగా 82 టాయిలెట్ల‌ను గ్రామ‌స్తుల‌కు క‌ట్టించింది. దీంతో మ‌రో 61 మంది సొంతంగా టాయిలెట్ల‌ను నిర్మించుకున్నారు. అందుకు ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌లు స‌హ‌కారం అందించాయి. అయితే మార్తా కేవ‌లం మ‌రుగుదొడ్ల‌ను మాత్ర‌మే కాదు, గ్రామ‌స్తుల‌కు సోలార్ ప‌వ‌ర్ ఎక్విప్‌మెంట్‌ను ఏర్పాటు చేసింది. 27 కుటుంబాల‌కు ఈ స‌దుపాయం కల్పించింది. ఒక్కో కుటుంబానికి ఒక సోలార్ ప్యానెల్‌ను ఇచ్చింది. దీంతో రెండు లైట్లు, ఒక ఫ్యాన్‌, ఒక మొబైల్ చార్జ‌ర్ న‌డుస్తాయి. వీటిని కూడా సొంత ఖ‌ర్చుల‌తోనే మార్తా గ్రామ‌స్తుల‌కు అంద‌జేసింది. అంతేకాకుండా వ‌ర్షాకాలంలో నీటిని ఒడిసిప‌ట్టేందుకు ఇంకుడు గుంత‌ల‌ను, తాగునీటి శుద్ధి వ్య‌వ‌స్థ కేంద్రాల‌ను మార్తా ప్ర‌స్తుతం ఏర్పాటు చేస్తోంది. ఏది ఏమైనా విదేశీయురాలైన‌ప్ప‌టికీ మార్తా మ‌న ప్ర‌జ‌ల కోసం చేస్తున్న సేవ అభినంద‌నీయం క‌దా..!

Comments

comments

Share this post

scroll to top