టాయిలెట్స్ కోసం అమరణ నిరాహారదీక్ష చేపట్టిన 8 వ తరగతి బాలిక..దెబ్బకు దిగొచ్చిన ప్రభుత్వం.

త‌మ డిమాండ్లు, కోరిక‌లు నెర‌వేర్చాల‌ని కొన్ని సంద‌ర్భాల్లో ఆయా వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లో, ఉద్యోగులో, కార్మికులో ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు చేయ‌డం ప‌రిపాటే. అయితే ఉన్నత స్థాయిలో ఉన్న సంబంధిత అధికారులు స్పందిస్తే వారి డిమాండ్లు నెర‌వేరేందుకు అవ‌కాశం ఉంటుంది. కానీ అలా ధ‌ర్నాలు, నిర‌స‌న‌లు చేసే ప్ర‌తి ఒక్క‌రి డిమాండ్లు మాత్రం తీర‌వు. అయితే ఎవ‌రి సంగ‌తి ఎలా ఉన్నా ఆ బాలిక చేప‌ట్టిన నిర‌స‌న దీక్ష‌కు మాత్రం మంచి స్పంద‌నే ల‌భించింది. ఏకంగా అధికార యంత్రాంగ‌మే త‌ర‌లివచ్చి ఆ బాలిక చేసిన డిమాండ్‌ను నెర‌వేరుస్తామ‌ని హామీ ఇచ్చారు. దీంతో ఆ బాలిక తాత్కాలికంగా త‌న నిర‌స‌న దీక్ష‌ను విర‌మించుకుంది. ఇంత‌కీ ఎవ‌రా బాలిక‌..? ఆమె చేసిన డిమాండ్ ఏమిటి..?

hc-lavanya

కర్ణాట‌క రాష్ట్రంలోని చిత్ర‌దుర్గ జిల్లా హేమ‌ద‌ల్ గ్రామంలో మొత్తం 315 కుటుంబాలు ఉంటున్నాయి. అయితే అక్క‌డ కేవ‌లం 70 ఇళ్ల‌లో మాత్ర‌మే మ‌రుగుదొడ్లు ఉన్నాయి. మిగిలిన వారికి లేవు. దీంతో వారు తమ గ్రామానికి స‌మీపంలో ఉన్న అడ‌వి ప్రాంతానికి నిత్యం బ‌హిర్భూమికి వెళ్తున్నారు. కాగా ఇటీవ‌లే ఓ మ‌హిళ కాల‌కృత్యాల కోసం బ‌య‌టికి వెళ్ల‌గా అడవిలో నుంచి వ‌చ్చిన ఓ ఏనుగు ఆమె ప్రాణాల‌ను తీసింది. దీంతో అక్క‌డి ప్ర‌జ‌లంద‌రూ భ‌య‌భ్రాంతుల‌కు లోన‌య్యారు. అయినా కాల‌కృత్యాల కోసం బ‌య‌టికి వెళ్ల‌క త‌ప్ప‌దాయె. అయితే దీన్ని చూసి అదే గ్రామానికి చెందిన 8వ త‌ర‌గ‌తి చదువుతున్న  లావ‌ణ్య అనే బాలిక గ్రామంలోకి ఎలాగైనా టాయిలెట్లు వ‌చ్చేలా చేయాల‌నుకుంది. వెంట‌నే ఆమె ఓ నిర్ణ‌యం తీసుకుంది.

అలా లావ‌ణ్య ఓ నిర్ణ‌యానికి వ‌చ్చాక వెంట‌నే ఆమ‌ర‌ణ దీక్ష‌ను మొద‌లు పెట్టింది. గ్రామం న‌డిబొడ్డున, అంద‌రూ తిరిగే చోట గాంధీజీ, అంబేద్క‌ర్ వంటి వారి బొమ్మ‌ల‌ను పెట్టుకుని, ప్ల‌కార్డుల‌ను ప‌ట్టుకుని దీక్ష‌ను ప్రారంభించింది. త‌మ గ్రామంలో ప్ర‌తి ఒక్క‌రికీ మ‌రుగుదొడ్లు క‌ట్టించాల‌ని ప్ల‌కార్డుల్లో రాసింది. దీంతో మొద‌టి రోజు లావ‌ణ్య ఒక్క‌తే దీక్ష చేయ‌గా, రెండో రోజు ఆమెకు గ్రామ‌స్తులు, తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు మ‌ద్ద‌తు తెలిపారు. దీంతో ఈ విషయం జిల్లా అధికారుల దాకా వెళ్లింది. వెంట‌నే వారు హేమ‌ద‌ల్ గ్రామానికి వ‌చ్చి లావ‌ణ్య‌తో మాట్లాడారు. ఆ గ్రామంలోని ప్ర‌తి ఇంటికి మ‌రుగుదొడ్ల‌ను నిర్మిస్తామ‌ని, వారంలో ప‌నులు ప్రారంభిస్తామ‌ని చెప్పారు. దీంతో లావ‌ణ్య దీక్ష‌ను విర‌మించింది. కానీ ప‌నులు ప్రారంభం కాక‌పోతే మళ్లీ దీక్ష‌కు కూర్చుంటాన‌ని తెగేసి చెప్పింది. ఇక అధికారులైనా మ‌రుగుదొడ్లు క‌ట్టించ‌కుండా ఎలా ఉంటారు, లేదంటే మ‌ళ్లీ దీక్ష సెగ తాకుతుంది క‌దా. ఏది ఏమైనా లావ‌ణ్య లాంటి రేప‌టి త‌రం నాయ‌కులేగా జ‌నాల‌కు కావ‌ల్సింది. అహింసా మార్గంలో దీక్ష చేస్తూ ప్ర‌భుత్వ అధికారుల మెడ‌లు వంచిన ఆమెకు నిజంగా మ‌నం అభినంద‌న‌లు తెల‌పాల్సిందే.

Comments

comments

Share this post

scroll to top