మన దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ధర్నాలు, నిరసనలు, రాస్తారోకోలు పెద్ద ఎత్తున జరిగిప్పుడు, బంద్‌లు నిర్వహించినప్పుడు లేదా మరేదైనా ఉద్రిక్త పరిస్థితి వాతావరణం ఉన్నప్పుడు కొందరు దుండగులు రోడ్లపైకి రావడం బస్సులు, భవనాలు ఇలా ప్రభుత్వానికి, ప్రజలకు చెందిన ఆస్తులను దేన్ని పడితే దాన్ని తగలబెట్టడం మామూలే. ఆ నిరసన జ్వాలలు ముగిసిన తరువాత వాటి గురించి పట్టించుకునే వారుండరు. అయితే ఆ భారం మళ్లీ ప్రజలపైనే పడుతుంది లెండి, అది వేరే విషయం. కానీ అలా ఎంతో విలువైన ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడం మాత్రం ముమ్మాటికీ చాలా పెద్ద తప్పే అవుతుంది. ఏ వర్గానికి చెందిన వారైనా, రాజకీయ పార్టీల నాయకులైనా, కార్యకర్తలైనా ప్రజల ఆస్తుల జోలికి మాత్రం వెళ్లకూడదు. శాంతి యుతంగా తమ నిరసన తెలపాలి. అయితే నేటి తరుణంలో ఎవరూ ఇలా శాంతియుతంగా నిరసనలు తెలపడం లేదు. రోడ్లపైకి వస్తే చాలు ప్రజల ఆస్తులకు ఎంతో కొంత నష్టం చేకూర్చే వెళ్తున్నారు. తమిళనాడు, కర్ణాటకలలో ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు.
కావేరి జలాల నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వరకు విషయం వెళ్లింది. ఆ క్రమంలోనే బెంగుళూరులో ఈ నెల 12వ తేదీన తమిళనాడు ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్‌కు చెందిన 42 బస్సులను డిపోలోనే తగులబెట్టి దగ్ధం చేశారు. అయితే ఈ హింసాత్మక ఘటన వెనుక పెద్ద తలకాయల హస్తం ఉందనే అనుమానంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా వారిని షాక్‌కు గురిచేసే ఓ నిజం తెలిసింది.
స్థానికంగా ఆ డిపోకు దగ్గర్లోని గిరినగర్‌లో నివాసం ఉంటున్న భాగ్య అనే ఓ 22 ఏళ్ల యువతి ఒక్కతే ఈ బస్సులన్నింటినీ దహనం చేసిందట. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆమెను గుర్తించారు. అయితే కొందరు బడాబాబులు పన్నిన వ్యూహంలో భాగంగా భాగ్య ఆ పని చేసిందట. అంతేకాదు, అలా చేస్తే ఆమెకు ప్లేట్ మటన్ బిర్యానీతోపాటు రూ.100 ఇస్తామని వారు చెప్పారట. దీంతో స్వతహాగా కూలి పని చేసుకుని పొట్ట పోసుకునే భాగ్య వారు ఇస్తామని చెప్పిన వాటికి ఆశపడి అంతటి పని చేసింది. ప్రస్తుతం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని ఓ పేద అభాగ్యురాలికి ఆశ పెట్టి అంతటి హింసాత్మక పనిచేయించిన వారు మాత్రం ఇప్పుడు దర్జాగా ఉన్నారు. ఎటొచ్చీ పాపం ఆ భాగ్యే, అభాగ్యురాలిగా మిగిలిపోయింది. పని చేసి కుటుంబానికి ఆసరాగా నిలుస్తున్న ఆ యువతి ఇప్పుడు అరెస్టవడంతో ఆమె కుటుంబాన్ని పోషించే వారు లేకుండాపోయారు. ఇప్పుడు వారిని ఆ బడాబాబులు ఆదుకుంటారో లేదంటే ప్రభుత్వమే ఆదుకుంటుందో చూడాలి. అలా అని చెప్పి భాగ్య చేసింది కూడా సమర్థించలేం. ఏది ఏమైనా, పేద ప్రజల కడుపు మీద కొట్టి, వారికి ఆశ చూపించి ఇలాంటి పనులకు వాడుకుంటున్న వారిని మాత్రం అస్సలు విడిచి పెట్టకూడదు.