అత‌ను మాజీ బాక్సింగ్ చాంపియ‌న్‌… ఇప్పుడు క్యాన్స‌ర్ వ‌చ్చి ఆర్థిక స‌హాయం కోసం చూస్తున్నాడు..!

మన దేశంలో క్రికెట్‌కు కాకుండా ఇత‌ర ఏ క్రీడ‌కు కూడా అంత‌గా ఆద‌ర‌ణ లేద‌ని అంద‌రికీ తెలిసిందే. కానీ… ఈ మ‌ధ్య కాలంలో ఆ ధోర‌ణి కాస్తా పోతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. అయినా… ఇతర ఆట‌లు ఆడే క్రీడాకారులకు మాత్రం ఇప్ప‌టికీ స‌రైన ఆర్థిక స‌హాయం అంద‌డం లేదు. తాజాగా ఓ ప్ర‌ముఖ మాజీ బాక్సింగ్ చాంపియ‌న్‌కు ఎదురైన ప‌రిస్థితి చూస్తే ఎవ‌రైనా ఇదే మాట అంటారు. అత‌ని పేరు డింగ్‌కో సింగ్. మాజీ బాక్సింగ్ చాంపియ‌న్‌. అయితే నేడు క్యాన్స‌ర్ వ్యాధితో బాధ ప‌డుతూ ఆప‌న్న‌హ‌స్తం అందించే చేయి కోసం ఎదురు చూస్తున్నాడు.

Dingko-Singh

డింగ్‌కో సింగ్ ఇంఫాల్‌లో లామ్లాంగ్ అనే ఓ ప్రాంతంలో చాలా పేద కుటుంబంలో జ‌న్మించాడు. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తూ త‌ల్లిదండ్రులు చ‌నిపోవ‌డంతో అనాథాశ్ర‌మంలో పెరిగాడు. చిన్న‌ప్ప‌టి నుంచి సింగ్‌కు బాక్సింగ్ అంటే ఇష్టం. ఎలాగైనా అందులో పేరు తెచ్చుకోవాల‌ని అనుకున్నాడు. అందులో భాగంగానే నిత్యం క‌ష్ట‌ప‌డి బాక్సింగ్ నేర్చుకునే వాడు. దీంతో దిన దిన ప్ర‌వ‌ర్థ‌మానం ఎదిగి బాక్సింగ్ చాంపియ‌న్ అయ్యాడు. అలా డింగ్‌కో సింగ్ 1998 ఏషియ‌న్ గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించి త‌న ల‌క్ష్యాన్ని నెర‌వేర్చుకున్నాడు. దీంతో అత‌నికి అర్జున అవార్డు, 2013లో ప‌ద్మ‌శ్రీ అవార్డు కూడా ల‌భించాయి. అయితే ఎన్ని అవార్డులున్నా… స‌రైన ఆద‌ర‌ణ లేని క్రీడాకారుడు క‌దా… క‌నుక స‌హ‌జంగానే అతనికీ ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదుర‌య్యాయి. ఈ క్ర‌మంలో అత‌ను బైల్ డ‌క్ట్ క్యాన్స‌ర్ బారిన ప‌డ్డాడు.

క్యాన్స‌ర్ కార‌ణంగా అత‌నికి 70 శాతం లివ‌ర్ తీసేశారు వైద్యులు. ఈ క్ర‌మంలో అత‌ని వైద్యం కోసం ఇప్ప‌టి వ‌ర‌కు రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌య్యాయి. అయినా ఫ‌లితం లేక‌పోవడంతో వైద్యులు ఇంకా చికిత్స అందించాల‌ని చెప్పారు. అయితే అందుకోసం సింగ్ వ‌ద్ద ఇప్పుడు డ‌బ్బు లేదు. దీంతో అత‌ను త‌న‌కు ఉన్న ఒక్కగానొక్క ఇంటిని తాక‌ట్టు పెట్టేందుకు సిద్ధ‌మ‌య్యాడు. అయితే ఈ వార్త తెలిసిన క్రికెట‌ర్ గౌతం గంభీర్ సింగ్‌కు స‌హాయం చేశాడు. అయితే దీన్ని బ‌య‌ట‌కు చెప్పాల్సిన ప‌నిలేద‌ని గంభీర్ అన్నాడు. అయినా ఇలాంటి విష‌యాలు దాచేస్తే దాగ‌వు క‌దా. ఈ క్ర‌మంలో ఇప్పుడు సింగ్‌కు స‌హాయం చేసేందుకు మరికొంద‌రు కూడా ముందుకు వ‌స్తున్నారు. అయితే ఈ విష‌యంపై ప్ర‌భుత్వం ఎప్పుడు స్పందిస్తుందో వేచి చూడాలి..!

Comments

comments

Share this post

scroll to top