అవును, మీరు విన్నది కరెక్టే. పలు రకాల ఆహార పదార్థాలను తింటే వృద్ధాప్య ఛాయలు త్వరగా వస్తాయట. మనం జీవించడానికి పోషకాలతో కూడిన మంచి ఆహారం ఎంత అవసరమో, అదే క్రమంలో మనకు శరీరానికి చెడు చేసే ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. అవి మనకు త్వరగా వృద్ధాప్యాన్ని తెచ్చి పెడతాయి. కాబట్టి వాటిని వీలైనంత వరకు తీసుకోకుండా ఉండడమే బెటరని, లేదంటే పూర్తిగా మానేస్తే ఇంకా మంచి ఫలితం ఉంటుందని, తద్వారా ఎల్లప్పుడూ యంగ్‌గా కనిపించవచ్చని ఇటీవల జరిగిన పలు పరిశోధనలు చెబుతున్నాయి. ఇంతకీ ఆ పరిశోధనలు చెబుతున్న, మనం తినకూడని ఆహారం ఏమిటంటే…
1. స్వీట్లు చాలా మందికి ఇష్టమే. కొందరైతే వీటిని ఎల్లప్పుడూ అదే పనిగా తింటుంటారు. ఈ క్రమంలో అలాంటి వారి దేహంలో గ్లెకేషన్ అనే ప్రక్రియ స్టార్ట్ అయి, అది ప్రోటీన్లను గ్రహించకుండా చేస్తుంది. దీంతో కణాలు త్వరగా బలహీన పడి వృద్ధాప్యం వస్తుంది.
2. మద్యం సేవించడం వల్ల మన లివర్‌కు ఎంత ఎఫెక్ట్ అవుతుందో అందరికీ తెలిసిందే. అయితే అలా ఎఫెక్ట్ అయిన లివర్ పనితీరు మందగించి శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు వెళ్లనీయకుండా చేస్తుంది. దీంతో చర్మంలో మార్పులు వచ్చి ముడతలు ఏర్పడతాయి. లివర్ బాగా పనిచేస్తేనే శరీరంలో ఉన్న విష పదార్థాలు అన్నీ బయటకు పోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది. కాబట్టి మద్యపానం కూడా మానేయాల్సిందే.
3. కాఫీలను కూడా ఎక్కువగా తాగకూడదు. లేదంటే చర్మం పొడిబారిపోయి త్వరగా ముడతలు పడుతుంది.
4. పిండిపదార్థాలను తక్కువగా, ఫైబర్‌ను ఎక్కువగా తీసుకోవాలి. పిండిపదార్థాలను ఎక్కువగా తీసుకుంటే కణాలు త్వరగా వృద్ధాప్య దశకు వచ్చేస్తాయి.
5. ఉప్పును ఎక్కువగా వాడడం మానేయాలి. లేదంటే శరీరంలో సోడియం నిల్వలు బాగా పేరుకుపోయి దాహం వేస్తుంది. ఇది డీహైడ్రేషన్‌కు దారి తీసి చర్మం ముడతలు పడేలా చేస్తుంది.
6. కారం ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను తిన్నా వృద్ధాప్య ఛాయలు త్వరగా వచ్చేస్తాయి. ఎందుకంటే కారంలోని పదార్థాలు మన శరీరంలోని ఎర్ర రక్త కణాలపై ప్రభావం చూపిస్తాయి. దీంతో చర్మం తన సహజ కాంతిని కోల్పోతుంది. వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తాయి.
7. చివరిగా కొవ్వు పదార్థాలు. అవును, అవే. సాధారణ శరీరం ఉన్న వారి కన్నా స్థూలకాయలు త్వరగా వృద్ధాప్యం బారిన పడతారట. పలువురు శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో ఇది వెల్లడైంది. కాబట్టి కొవ్వులు తక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. దీనికి తోడు అధిక బరువును కూడా తగ్గించుకోవాలి.