సోషల్ మీడియా… నిజంగా ఇది చాలా మంది యూజర్లను పిచ్చి వాళ్లను చేస్తుందనే చెప్పవచ్చు. అవును, మీరు విన్నది కరెక్టే. చాలా మంది నేడు దాని మాయలో పడి ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదు. ఇక ఫేస్బుక్లోనైతే తాము పెట్టే పోస్టులకు లైక్లు, కామెంట్లు తెప్పించుకోవడం కోసం చేయకూడని పనులు చేస్తున్నారు. తాము ఎక్కడ ఎలా ఏ సందర్భంలో ఏ విధంగా ఉన్నామో సోయి లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఆయా సమయాల్లో తీసుకున్న ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేసి లైక్లు, కామెంట్లు కొట్టాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మేం చెప్పబోయే వ్యక్తి కూడా దాదాపుగా ఇలాంటి పనే చేశాడు. కాకపోతే ఆ పని అతన్ని కటకటాల వెనక్కి నెట్టేసింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే…
అల్జెరియాలో ఓ తండ్రి తన బాబును 15వ ప్లోర్ కిటికీ నుంచి కిందకి పడేయబోతున్నట్టు ఫోటో తీశాడు. ఇంకేముందీ… ఫేస్బుక్ ఎటూ ఉందిగా. వెంటనే ఆ ఫోటోను ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. ఈ క్రమంలో తాను పెట్టిన ఆ పోస్టుకు 1000 లైక్స్ ఇవ్వాలని పోస్టులో సందేశం రాశాడు. ఒక వేళ తాను చెప్పినట్టుగా 1000 లైక్స్ గనక ఆ పోస్టుకు రాకపోతే వెంటనే ఆ బేబీని కిందకి పడేస్తానంటూ మరో పోస్టు పెట్టాడు. దీంతో నెటిజన్లు అతని పోస్టుల పట్ల తీవ్రంగా స్పందించారు.
చేయకూడని పని చేయడమే కాకుండా దానికి లైక్లు కొట్టమని అతగాడు ఫేస్బుక్లో పోస్టు పెట్టినందుకు గాను నెటిజన్లు అతనిపై విరుచుకుపడ్డారు. వెంటనే అతన్ని అరెస్టు చేయాలని సోషల్ మీడియా యూజర్లు డిమాండ్ చేశారు. కాగా ఈ విషయం పెద్ద ఎత్తున వైరల్ అయి అక్కడి పోలీసులకు తెలిసింది. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్టు చేసి అల్జెరియా కోర్టులో హాజరు పరిచారు. కాగా ఈ అంశంపై కోర్టు కూడా చాలా సీరియస్గా స్పందించింది. సదరు వ్యక్తికి 2 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తున్నట్టు న్యాయమూర్తి చెప్పారు. దీంతో అతన్ని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టేశారు. అవును మరి, చేతిలో ఫోన్ ఉంది కదా అని చెప్పి సోషల్ మీడియాలో లైక్లు, కామెంట్ల కోసం అలా పిచ్చిగా ప్రవర్తిస్తే ఎవరికైనా అదే గతి పడుతుంది. అంతే కదా..!