ఒక‌రి భార్య కోసం ఒక‌రు కిడ్నీల‌ను దానం చేశారు. మతాల అడ్డుగోడలను అడ్డంగా కూల్చారు.

ఒక మ‌నిషి ప్రాణాల‌ను తీయ‌మ‌ని ఏ మ‌త‌మూ చెప్ప‌దు. ఇంకా చెప్పాలంటే తోటి మ‌నుషుల‌ను మాన‌వ‌తా దృక్ప‌థంతో చూడాల‌ని, వారికి స‌హాయం చేయాల‌నే ఏ మ‌త‌మైనా చెబుతుంది. స‌మాజంలో ఉన్న అంద‌రు మ‌నుషులు ఒకే కుటుంబంలా, సొంత అన్న‌ద‌మ్ములు, ర‌క్త సంబంధీకుల్లా క‌ల‌సి మెల‌సి ఉండాల‌ని అన్ని మతాలు చెబుతున్నాయి. కానీ నేటి త‌రుణంలో ఎంత మంది ఇలా ఉంటున్నార‌నేది మాత్రం ప్ర‌శ్నార్థ‌క‌మే. అది వేరే విష‌యం. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే రెండు వేర్వేరు కుటుంబాలు మాత్రం ఒకే కుటుంబంలా క‌ల‌సిపోయి ఉంటున్నాయి. వారి మ‌తాలు వేరైనా క‌ల‌సి మెల‌సి ఉండ‌డంలో, స‌హాయం చేసుకోవ‌డంలో ర‌క్త సంబంధీకుల క‌న్నా ఎక్కువే అయ్యారు. మ‌నుషులంతా ఒక్క‌టే అని వారు చాటి చెబుతున్నారు. ఏ మ‌నిషికి ఆప‌ద వ‌చ్చినా కుల‌, మ‌త‌, వ‌ర్గ‌, ప్రాంత భేదం లేకుండా అందరూ ఒక‌రికొక‌రు స‌హాయం చేసుకోవాల‌ని, అప్పుడే స‌మాజం బాగు ప‌డుతుంద‌ని చెప్ప‌క‌నే చెబుతున్నారు.

kidney-transplant

అది రాజ‌స్థాన్‌లోని జైపూర్ ప్రాంతం. అత‌ని పేరు అన్వ‌ర్ అహ్మ‌ద్. అత‌ని భార్య గ‌త కొంత కాలంగా కిడ్నీ సంబంధ వ్యాధితో బాధ ప‌డుతోంది. ఈ క్ర‌మంలో వైద్యులు ఆమెకు కిడ్నీ మార్పిడి చేయాల‌ని చెప్పారు. దీంతో వారు ఎంతో కాలంగా దాత కోసం ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఆ ప్రాంతానికే చెందిన వినోద్ మెహ్రా భార్య‌ది కూడా దాదాపుగా అలాంటి ప‌రిస్థితే. ఆమెకు కూడా కిడ్నీ మార్పిడి చేయాల‌ని డాక్ట‌ర్లు చెప్ప‌డంతో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ కిడ్నీ దాత కోసం ఎదురు చూస్తోంది. అయితే అన్వ‌ర్‌, వినోద్‌లు ఇద్ద‌రూ ఒకే హాస్పిట‌ల్‌లో ఉండ‌డంతో అనుకోకుండా ఒక‌రి విష‌యం మ‌రొక‌రికి తెలిసింది. దీంతో వారు వెంట‌నే క‌లుసుకుని మాట్లాడుకున్నారు. అంత‌కు మునుపు ప‌రిచ‌యం లేకున్నా, అప్పుడే క‌లుసుకున్నా ఒక‌రికొక‌రు స‌హాయం చేసుకోవాల‌ని అనుకున్నారు. ఈ క్ర‌మంలో వారు వైద్య ప‌రీక్ష‌లు చేయించుకున్నారు.

అయితే వైద్య ప‌రీక్ష‌ల్లో తెలిసిందేమిటంటే అన్వ‌ర్ బ్ల‌డ్ గ్రూప్‌, వినోద్ భార్య బ్ల‌డ్ గ్రూప్ ఒక‌టేన‌ని, వినోద్ బ్ల‌డ్ గ్రూప్‌, అన్వ‌ర్ భార్య బ్ల‌డ్ గ్రూప్ ఒకటేన‌ని తెలిసింది. దీంతోపాటు వారి వారి కిడ్నీలు కూడా మ్యాచ్ అయ్యాయ‌ని డాక్ట‌ర్లు చెప్పారు. దీంతో ఒక‌రి భార్య కోసం ఒక‌రు కిడ్నీల‌ను దానం చేశారు. ఈ క్ర‌మంలో అన్వ‌ర్‌, వినోద్ భార్య‌లిద్ద‌రికీ కిడ్నీ మార్పిడి జ‌రిగిపోయింది. అలా వారు ఒక‌రికొక‌రు స‌హాయం చేసుకుని మ‌నుషుల మ‌ధ్య స‌త్సంబంధాలకు, స్నేహ పూర్వ‌క వాతావ‌ర‌ణానికి మ‌తం, కులం అడ్డు రాద‌ని నిరూపించారు. ఇప్పుడు అన్వ‌ర్‌, వినోద్‌లు ఇద్ద‌రూ హాస్పిట‌ల్ నుంచి డిశ్చార్జి అయ్యారు. త్వ‌ర‌లో వారి భార్య‌లు కూడా డిశ్చార్జి కానున్నారు. ఈ క్ర‌మంలో వారి వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. అన్వ‌ర్ మ‌రో రెండు రోజుల్లో రానున్న బ‌క్రీద్‌కు వినోద్‌ను ఆహ్వానిస్తానంటుంటే, వినోద్ త్వ‌ర‌లో రానున్న దస‌రా, దీపావ‌ళి పండుగ‌ల‌కు అన్వ‌ర్ కుటుంబాన్ని త‌మ ఇంటికి ఆహ్వానిస్తామ‌ని అంటున్నాడు. అవ‌య‌వ దానం వ‌ల్ల త‌మ కుటుంబాల మ‌ధ్య ఏదో తెలియ‌ని బంధం ఏర్ప‌డింద‌ని వారు నిర్మొహ‌మాటంగా చెబుతున్నారు. అంతే క‌దా మ‌రి, మ‌నుషుల్లో మాన‌వ‌త్వం, వారి మ‌ధ్య సంబంధాలు బాగుండాలే గానీ, ఎలాంటి అంశాలు కూడా వారిని విడ‌దీయ‌లేవు.

Comments

comments

Share this post

scroll to top