నిజంగా ఒక్కోసారి మనుషుల కన్నా జంతువులే నయం అని అనుకుంటుంటాం కదా. అవును, కొన్ని సందర్భాల్లో సాక్షాత్తూ మనుషులమైన మనమే మనుషుల కన్నా జంతువులే బెటర్ అని అంటూ ఉంటాం. అందుకు కారణాలు అనేక ఉంటాయి. అయితే ఇప్పుడు మేం చెప్పబోయేది వింటే మీరు కూడా నిజంగా మన కన్నా జంతువులే బెటర్ అని అంటారు. అవును, మీరు విన్నది కరెక్టే. ఇంతకీ అసలు విషయమేంటో తెలుసా..? ఓ కుక్క గత కొన్ని సంవత్సరాలుగా ఒంటి చేత్తో నదిని క్లీన్ చేస్తున్నది. కొన్ని వేల ప్లాస్టిక్ బాటిల్స్‌ను అది ఇప్పటి వరకు నది నుంచి తీసేసింది. అవును, నిజంగా పర్యావరణ పరిరక్షణలో ఆ కుక్కే బెటర్ కదా..!
అది చైనాలోని జియాంగ్సు ప్రావిన్స్ సుజోవ్ ప్రాంతం. అక్కడ ఓ నది ప్రవహిస్తూ ఉంటుంది. అయితే ఆ నదికి సమీపంలో ఉండే ఓ వ్యక్తి తన కుక్కకు ట్రెయినింగ్ ఇచ్చాడు. ఆ కుక్క గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందినది. దానికి ట్రెయినింగ్ ఇవ్వడంతో అది నిత్యం సమీపంలో ఉన్న నది నుంచి 20 – 30 ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను వెలికి తీసి మరీ డస్ట్ బిన్లలో పారేస్తోంది. అలా ఇప్పటి వరకు గత 10 సంవత్సరాల నుంచి ఆ కుక్క దాదాపుగా మొత్తం 2వేలకు పైగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను నది నుంచి తీసి క్లీన్ చేసింది.
ఈ క్రమంలో ఆ కుక్క ఇప్పుడక్కడ సెలెబ్రిటీ అయిపోయింది. దాని గురించి అక్కడ సోషల్ మీడియాలో ప్రస్తుతం వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. ఆ కుక్క నదిలో ఈదుతూ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్‌ను సేకరిస్తున్నప్పుడు కొందరు ఫొటోలు తీసి నెట్లో పెట్టారు. దీంతో అవి వైరల్ అయ్యాయి. ఇక ఆ కుక్క ఇలా ఎప్పటి వరకు చేస్తుందో తెలియదు కానీ, మనకు అది పర్యావరణం పట్ల స్పృహ వచ్చేలా చేస్తోంది అన్నది మాత్రం నిజం. అవును, ఇకనైనా మనం ప్లాస్టిక్ వాడకం పట్ల జాగ్రత్తలు తీసుకుని, ఆ వస్తువులను నియంత్రించకపోతే పర్యావరణానికి పెద్ద ముప్పు ఏర్పడుతుందన్నది మాత్రం అక్షరాలా నిజం. ఇప్పటికే మనం అనేక ఉపద్రవాలను, ప్రకృతి విపత్తులను చూస్తున్నాం. ఇకనైనా స్పందించకపోతే ఇక భవిష్యత్తులో వచ్చే పెను ప్రమాదాల నుంచి మనల్ని ఎవరూ రక్షించలేరు..!