ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ మ‌హిళ‌కు ఆప‌రేష‌న్ చేసి కాపాడాడు ఆ ఎమ్మెల్యే..!

మ‌నిషి ప్రాణాలు ఎంత విలువైన‌వో అంద‌రికీ తెలిసిందే..! ఎన్ని కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు పెట్టినా పోయే మ‌నిషి ప్రాణాలు ఆప‌లేం. ప్రాణంతో ఒక మ‌నిషిని సృష్టించ‌నూ లేం. అందుకే మనిషి ప్రాణాలు అంత విలువైన‌వి అంటారు. అలా ఆ విలువ‌ను తెలుసుకున్నాడు కాబ‌ట్టే అత‌ను నిండు మ‌న‌స్సుతో ఆలోచించి ఓ మ‌హిళ‌కు ప్రాణం పోశాడు. ఓ ప్ర‌జాప్ర‌తినిధిగా త‌న నియోజ‌క‌వ‌ర్గంలోని ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుని వాటిని ప‌రిష్క‌రించే గొప్ప నాయ‌కుడిగానే కాదు, ప్రాణాపాయ స్థితిలో ఉన్న మ‌హిళ‌కు ఆప‌రేష‌న్ చేసి వైద్యుడిగా కూడా ఆయ‌న త‌న ప్ర‌జ‌ల ఆద‌రాభిమానాల‌ను చూర‌గొన్నాడు. ఆయ‌నే ఎమ్మెల్యే, డాక్ట‌ర్ కె.బేచ్చువా..!

mizoram-mla

మిజోరంలోని సైహా నియోజ‌క‌వ‌ర్గం అది. ఆ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యేనే కె.బేచ్చువా..! వ‌య‌స్సు 52 సంవ‌త్స‌రాలు. ఆయ‌న ఎమ్మెల్యేనే కాదు, మంచి డాక్ట‌ర్ కూడా. ఈ క్ర‌మంలోనే తాజాగా ఇంఫాల్‌లో ఓ శిక్ష‌ణ కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన‌గా, అక్క‌డికి ద‌గ్గ‌ర్లోనే ఉన్న త‌న సైహా నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన 35 ఏళ్ల మ‌హిళ తీవ్ర క‌డుపు నొప్పితో ఆస్ప‌త్రిలో చేరింది. ఆమె పేగుల‌కు రంధ్రం పడడంతో ప‌రిస్థితి విష‌మించింది. దీంతో ఆమెకు అత్య‌వ‌స‌రంగా ఆప‌రేష‌న్ చేయాల్సి వ‌చ్చింది.

అయితే టైముకు ఆప‌రేష‌న్ చేసేందుకు అందుబాటులో వైద్యులు ఎవ‌రూ లేరు. దీంతో స్వ‌త‌హాగా డాక్ట‌ర్ అయిన ఎమ్మెల్యే బేచ్చువాకు విష‌యం తెలిసింది. అంతే… వెంట‌నే ఆయ‌న త‌న కార్య‌క్ర‌మాల‌న్నింటినీ ర‌ద్దు చేసుకుని హుటా హుటిన ఆస్ప‌త్రికి వెళ్లారు. తీవ్ర బాధ‌తో విల‌విల‌లాడుతూ ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆ మ‌హిళ‌కు ఆప‌రేష‌న్ చేసి విజ‌య‌వంతం అయ్యారు. దీంతో గండం త‌ప్పింది. విప‌త్తు నుంచి ఆమె బ‌య‌ట ప‌డింది. ప్ర‌స్తుతం ఆమె ప్రాణానికి ఎలాంటి ఢోకా లేదు. ఇదంతా ఎమ్మెల్యే అయిన డాక్ట‌ర్ బేచ్చువా చ‌ల‌వే అంటే న‌మ్మ‌గ‌ల‌రా..! ఒక ఎమ్మెల్యే గానే కాదు, ఒక డాక్ట‌ర్‌గా ఆయ‌న ఆ మ‌హిళ‌కు చేసిన సేవ అనిర్వ‌చ‌నీయం..!

Comments

comments

Share this post

scroll to top