సమాజానికి సేవ చేయాలంటే అందుకు వ్యక్తి వయస్సు, హోదా, చేసే పని… ఇలా దేనితోనూ సంబంధం ఉండదు. సేవ అంటే సేవే..! ఎవరు చేసినా, ఎలా చేసినా సహాయార్థులకు సేవ ఎంతో ఉపకరిస్తుంది. సరిగ్గా ఇదే సూత్రాన్ని వంట బట్టించుకున్నాడు ఆ ప్రభుత్వ అధికారి. చేస్తోంది పోలీస్ ఉద్యోగం అయినా, సామాజిక సేవలోనూ ఆయన పాలు పంచుకుంటున్నాడు. వలస జీవుల పిల్లలకు పాఠశాల ద్వారా విద్యాబోధన చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాడు. అతనే నిశాంత్ తివారీ.
నిశాంత్ తివారీ ఒకప్పుడు విదేశాల్లో పేరు గాంచిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఇంజినీర్‌గా పనిచేశాడు. అయితే అనుకోకుండా అతనికి ఐపీఎస్ అవ్వాలని, మాతృదేశంలో పోలీసుగా సేవలందించాలని అనిపించింది. వెంటనే ఉన్న పళంగా ఇండియాకు వచ్చి సివిల్స్ రాసి ఐపీఎస్ కానే అయ్యాడు. ఈ క్రమంలో అతను ఎన్నో చోట్ల పనిచేశాడు. అయితే విధి నిర్వహణలో భాగంగా బీహార్‌లోని పూర్ణియా అనే జిల్లాకు ఎస్పీగా వచ్చాడు. వచ్చీ రాగానే బాధ్యతలు తీసుకున్నాడు. అయితే అతనికి అక్కడ కొందరు వలస జీవులు పడుతున్న కష్టాలు చూసి జాలేసింది. వారి పిల్లలు కూడా పెద్దల్లాగే నిత్యం కష్టపడుతుండడాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఆ శ్రమ జీవుల పిల్లల కోసం సొంతంగా శామ్ కీ పాఠ్శాల (సాయంత్రం పాఠశాల) అనే ఓ పాఠశాలను ఏర్పాటు చేశాడు.
నిత్యం పనికి వెళ్లిన పిల్లలను సాయంత్రం పూట తీసుకువచ్చి ఆ స్కూల్లో వారికి పాఠాలు నేర్పిస్తున్నాడు నిశాంత్ తివారీ. ఎస్పీ గా తనకు ఎన్ని పనులు ఉన్నా నిత్యం సాయంత్రం ఆ పాఠశాలకు వచి ఆ పిల్లలకు అనేక అంశాల్లో విద్యాబోధన చేస్తున్నాడు. అతనికి తోడుగా మరో ఇద్దరు, ముగ్గురు పోలీస్ అధికారులు కూడా కలిసి ఆ పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలు పెట్టారు. దీంతో ఆ పిల్లలు అనేక అంశాల్లో తమ ప్రతిభ చూపుతున్నారు. నిజానికి ఆ పిల్లల తల్లిదండ్రులు ఒక చోట ఉండే వారు కాదు. పని కోసం అక్కడా ఇక్కడా తిరుగుతుంటారు. అలాంటి వారిలో మార్పు తేవాలంటే వారి పిల్లలు చదువుకోవడం ఒక్కటే మార్గమని భావించాడు నిశాంత్ తివారీ. అందుకే వారికి పాఠాలు చెప్పడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలో తివారీ పట్ల ఆ పిల్లలకు కూడా మంచి గురి కుదిరింది. పాఠాలు బుద్ధిగా నేర్చుకుంటున్నారు. అంతేకాదు, వారికి కావల్సిన పుస్తకాలు, బట్టలు వంటి వాటిని కూడా తివారీ అందజేస్తుండడం విశేషం. ఏది ఏమైనా నిశాంత్ తివారీ అంత పెద్ద అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ సామాజిక సేవను మరువకుండా అందులో పాలు పంచుకుంటుండడం నిజంగా అభినందనీయం..!