ఉండాల‌య్యా సారూ… మీ లాంటి ఓ క‌లెక్ట‌ర్… ప్ర‌తి జిల్లాకు..!

నివ‌సించేందుకు ప్ర‌భుత్వం ఇచ్చే అధికారిక గృహం.. స‌హాయ‌కులు.. బ‌య‌ట‌కు వెళితే ప్ర‌భుత్వం ఇచ్చే కారు… ఇంకా ఎన్నో స‌దుపాయాలు జిల్లా క‌లెక్ట‌ర్‌కు ఉంటాయి. ఓ ర‌కంగా చెప్పాలంటే క‌లెక్ట‌ర్ ఓ జిల్లాకు ప్ర‌ధాన అధికారి. ఎన్నో శాఖ‌ల‌ను క‌లెక్ట‌ర్ అజ‌మాయిషీ చేయ‌వ‌చ్చు. అవ‌స‌రం వ‌స్తే ఫ‌స్ట్ క్లాస్ మెజిస్ట్రేట్‌గా తీర్పు చెప్ప‌వ‌చ్చు. ఇదంతా ఏ క‌లెక్ట‌ర్ అయినా రోజూ చేసేదే. కానీ… ఆ జిల్లా క‌లెక్ట‌ర్ మాత్రం ఇందుకు భిన్నం. అందుబాటులో ఏ వాహ‌నం ఉంటే దాన్ని తీసుకుని వెళ్తాడు. సొంతంగా వాహ‌నం న‌డుపుతూ జ‌నాల వ‌ద్ద‌కు చేరుకుంటాడు. అది సైకిల్ అయినా స‌రే స్వ‌యంగా తొక్కుకుంటూ వెళ్లి మ‌రీ ప్ర‌జ‌ల బాగోగులు అడిగి తెలుసుకుంటాడు. తెలుసుకోవ‌డ‌మే కాదు, వారి స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాడు. ఆయ‌న పేరు ఆకునూరి ముర‌ళి. తెలంగాణ రాష్ట్రంలోని జ‌య‌శంక‌ర్ జిల్లా క‌లెక్టరే ఈయ‌న‌.

ఆకునూరి ముర‌ళి పేరుకు క‌లెక్ట‌ర్ అయినా చూస్తే అలా అనిపించరు. ఎందుకంటే ఆయ‌న సాదా సీదా జీవితం గ‌డుపుతారు. నిత్యం ప్ర‌జ‌ల మ‌ధ్యే ఉంటారు. ఏసీ బంగళాల్లో ఉంటూ స‌మీక్ష‌లు జ‌ర‌ప‌డం, ఆదేశాలు ఇవ్వ‌డం వంటి ప‌నులు చేయ‌రు. ప్ర‌జ‌ల్లోకి వెళితేనే క‌దా వారి స‌మ‌స్య‌లు తెలిసేది, వాటిని ప‌రిష్క‌రించేది అంటారాయ‌న‌. తాజాగా జిల్లా ప‌రిధిలో ఉన్న తాడ్వాయి మండ‌లంలోని రాప‌ట్ల అట‌వీ ప్రాంతం స‌మీపంలో నివ‌సిస్తున్న గొత్తి కోయ కుటుంబాల‌ను ఆయ‌న ప‌రామ‌ర్శించారు. అందుకు ఆయ‌న స్వ‌యంగా సైకిల్ తొక్కుకుంటూ మ‌రీ వెళ్లారు. వెంట ఏ ఒక్క అధికారీ లేడు. జోరుగా వ‌ర్షం కురుస్తున్నా, అడ‌వి ప్రాంత‌మైనా, బుర‌ద‌మ‌యంగా దారి ఉన్నా ఆయ‌నే సైకిల్‌పై వెళ్లి ఆ కుటుంబాల బాగోగుల‌ను అడిగి తెలుసుకున్నారు. వారికి అందుతున్న పౌష్టికాహారం, చ‌దువు, ఆరోగ్యం వంటి విష‌యాల‌ను ప‌రిశీలించారు. అడ‌విని వీడి వ‌స్తే తాను ప్ర‌భుత్వంతో మాట్లాడి పున‌రావాసం క‌ల్పిస్తాన‌ని హామీ ఇచ్చారు.

క‌లెక్ట‌ర్ ముర‌ళి ఇప్పుడే కాదు మొద‌ట్నుంచీ ఇంతే. ఆయ‌న కార్యాల‌యానికి వెళ్ల‌డం చాలా త‌క్కువ‌. రోజూ ఏదో బ‌స్తీనో, గ్రామాన్నో, తండానో, కాల‌నీనో సంద‌ర్శించి ప్ర‌జ‌ల బాగోగులు తెలుసుకుంటారు. జ‌నాలు ఎక్క‌డ క‌న‌బ‌డితే అక్క‌డ వారిని ఆప్యాయంగా ప‌ల‌క‌రిస్తాడు. ఏం అవ్వా.. ఫించ‌న్ అందుతుందా..? ఏం తాతా.. అంతా బాగే క‌దా.. అంటూ ముచ్చ‌ట్లు పెడ‌తాడు. దీంతో ఆయ‌న వ్య‌వ‌హార శైలికి ప్ర‌జ‌లు కూడా ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తారు. ఆయ‌న్ను చూసి తోటి అధికారులు విస్మ‌యం చెందుతారు. అవును మ‌రి, నిజంగా ఇలాంటి అధికారులు మ‌న‌కు ఎప్పుడో, ఎక్క‌డో కానీ క‌న‌బ‌డ‌రు. అస‌లు అధికారులంటే ప్ర‌జ‌లకు ఎప్పుడు అస‌హ్య‌మే, ప‌ని చేసి పెట్ట‌మ‌ని అడిగితే లంచం అడుగుతార‌ని, ప‌ట్టించుకోర‌ని, నిర్ల‌క్ష్యం వ‌హిస్తార‌ని ప్ర‌జ‌లు అనుకుంటారు. కానీ ముర‌ళి లాంటి అధికారులను చూస్తే ఎవ‌రైనా త‌మ అభిప్రాయం త‌ప్పు అని అనుకుంటారు. అయినా… ఇలాంటి అధికారులు మ‌న దేశంలో ఎంత మంది ఉంటారు చెప్పండి. ఏది ఏమైనా ప్ర‌జ‌ల‌కు సేవ చేయాల‌నే త‌ప‌న ఉన్న ఇలాంటి వారే క‌దా మ‌న‌కు కావల్సింది. ప్ర‌జ‌ల్ని ప‌ట్టి పీడించే వారు, వారి స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకోకుండా నిర్ల‌క్ష్యం చేసే వారు మ‌న‌కు అవ‌స‌రం లేదు క‌దా..! హ్యాట్సాఫ్ టు ముర‌ళి సార్‌..!

Comments

comments

Share this post

scroll to top