డాక్ట‌ర్ ఉద్యోగాల్ని వ‌దిలి వారు అడ‌విలో 40 ఏళ్ల‌కు పైగా నివాసం ఉంటున్నారు. ఎందుకో తెలుసా..?

ప్ర‌పంచంలోనే కాదు, మ‌న దేశంలోనూ ఏటా వ‌న్య ప్రాణుల సంఖ్య ఏ విధంగా త‌గ్గిపోతుందో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌భుత్వాలు ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా వ‌న్య ప్రాణులు స్మ‌గ్ల‌ర్ల బారిన ప‌డ‌కుండా కాపాడలేక‌పోతున్నారు. దీనికి తోడు అర‌ణ్యాల్లో ఉండే కొన్ని ఆదిమ‌వాసీ తెగలు వాటిపై ఆధార‌పడే జీవనం సాగిస్తుంటాయి. ఈ క్ర‌మంలో వ‌న్య ప్రాణుల సంఖ్య బాగా త‌గ్గిపోతోంది. అయితే దీన్ని గ‌మ‌నించిన ఆ ఇద్ద‌రు దంప‌తులు తాము చేస్తున్న ఉన్న‌తమైన ఉద్యోగాల‌ను వ‌దిలేసి అడ‌వికి త‌ర‌లివెళ్లారు. కొన్నేళ్ల పాటు అక్క‌డే ఉండి ఎన్నో వంద‌ల వ‌న్య ప్రాణుల‌ను చేర‌దీసి ర‌క్షించ‌డ‌మే కాదు, వాటి ఆల‌నా పాల‌నా చూసుకున్నారు. వారు నివాసం ఉంటున్న ప్రాంతంలో ఉండే ఆదిమ‌వాసీ ప్ర‌జ‌ల బ‌తుకుల‌ను సైతం వారు మెరుగుప‌రిచారు.

వారి పేర్లు డాక్ట‌ర్ ప్ర‌కాష్ ఆమ్టే, డాక్ట‌ర్ మందాకినీ ఆమ్టే. ఇద్ద‌రూ భార్యా భ‌ర్త‌లు. పైగా డాక్ట‌ర్లు. ఉన్న‌త స్థానాల్లో ఉద్యోగం చేస్తున్నారు. అయితే ప్ర‌కాష్ తండ్రి బాబా ఆమ్టే గొప్ప సామాజిక వేత్త‌. దీంతో తండ్రి బాట‌లోనే ప్ర‌కాష్ కూడా న‌డిచారు. ఆయ‌న లాగానే అడ‌వికి వెళ్లి ఆదిమ‌వాసీ తెగల‌కు, వ‌న్య ప్రాణుల‌కు సేవ చేయాల‌ని భావించి అదే ఆచ‌ర‌ణ‌లో పెట్టారు. 1970ల‌లో వారిద్ద‌రూ మ‌హారాష్ట్రలోని గ‌డ్చిరోలి అడ‌వుల‌కు త‌ర‌లివెళ్లారు. అక్క‌డే నివాసం ఉండ‌డం ప్రారంభించారు. అక్క‌డి ఆదిమ‌వాసీ తెగ‌ల వారు వ‌న్య‌ప్రాణుల‌ను సంహ‌రించి తిన‌డం చూశారు. దీంతో వారికి మ‌న‌స్సు చివుక్కుమంది. అలా చేయ‌కుండా ఉండేందుకు గాను గాయ‌ప‌డిన వ‌న్య ప్రాణుల‌ను వారు తీసుకుని అందుకు బ‌దులుగా ఆదిమ‌వాసుల‌కు బియ్యం, ప‌ప్పులు వంటి ఆహార ప‌దార్థాల‌ను తినేందుకు ఇచ్చేవారు. అలా ప్ర‌కాష్‌, మందాకినిల ప్ర‌యోగం స‌క్సెస్ అయింది.

ఈ క్ర‌మంలో వారు త‌మ వ‌ద్ద‌కు అలా వ‌చ్చే అడ‌వి జంతువుల‌న్నింటినీ చేర‌దీసి వాటికోసం ఒక యానిమ‌ల్ ఆర్క్‌ను ఏర్పాటు చేశారు. అందులో తాము చేర‌దీసిన వన్య ప్రాణుల‌ను వారు పెంచేవారు. అలా వారి వ‌ద్ద అనేక ర‌కాలైన జంతువులు కొన్ని వంద‌ల‌కు పైగా వ‌చ్చి చేరాయి. అయితే వాటిని అక్క‌డే ఉంచ‌డం వ‌ల్ల ఇబ్బందులు రావ‌డంతో కొన్ని జంతువుల‌ను వేరే నేష‌న‌ల్ పార్క్‌ల‌కు, జూల‌కు త‌ర‌లించారు. ఈ క్ర‌మంలో వారు కేవ‌లం వ‌న్య ప్రాణుల‌ను ర‌క్షించ‌డ‌మే కాదు, అక్క‌డ నివ‌సించే ఆదివాసీ తెగ‌ల జీవితాల‌ను కూడా మార్చేశారు. వారి కోసం ప్ర‌త్యేక హాస్పిట‌ల్‌ను పెట్టారు. స్కూల్‌ను ఏర్పాటు చేశారు. అందులో అనేక మంది పిల్ల‌లు చ‌దువుకుని ఇప్పుడు ప్ర‌యోజ‌కులు కూడా అయ్యారు. దీంతో ఇప్పుడా ప్రాంతంలో ఆదిమ వాసులు వ‌న్య ప్రాణుల‌ను వేటాడ‌డం మానేశారు. చాలా వ‌ర‌కు వాటి వేట త‌గ్గింది. ఇలా గ‌త 40 ఏళ్ల కాలంలో వారు ఎన్నో వంద‌ల వ‌న్య ప్రాణుల‌ను ర‌క్షించడ‌మే కాదు, ఆదిమ‌వాసుల జీవితాల‌ను మార్చేశారు. వారి జీవితాల్లో వెలుగులు నింపారు. అందుకు గాను ప్ర‌కాష్, మందాకినీ ఆమ్టే ల‌కు 2008లో ప్రతిష్టాత్మక రామ‌న్ మెగ‌సెసె అవార్డు ల‌భించింది. కాగా వారి పిల్ల‌లు దిగాంత్‌, అనికెత్‌, ఆర్తిలు కూడా అదే అడవిలో పుట్టి పెర‌గ‌డం విశేషం. త‌రువాతి త‌రంలో వారు కూడా స‌మాజ సేవ‌కే అంకిత‌మ‌వుతామ‌న అంటున్నారు. ఇలా 3 త‌రాలుగా ప్ర‌జ‌ల సేవ‌కే జీవితాన్ని త్యాగం చేసిన ఈ కుటుంబాన్ని నిజంగా అభినందించాల్సిందే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top