ఈ వెడ్డింగ్ రింగ్ స్పెషాలిటీ తెలిస్తే….ఆశ్చర్యపోతారు.!?

ఏ వ‌ర్గానికి చెందిన వివాహ సాంప్ర‌దాయంలోనైనా వ‌ధూవ‌రులిద్ద‌రూ నిశ్చితార్థం రోజున ఒకరి వేలికి మ‌రొక‌రు ఎంగేజ్‌మెంట్ రింగ్ తొడుక్కుంటారు. దీనికి వారు చాలా ప్రాధాన్య‌త‌ను ఇస్తారు. జీవితాంతం ఆ రింగ్‌ను వారు దాచిపెట్టుకుంటారు. ఎప్పుడూ ఆ రింగ్‌ను వేలికే తొడుక్కుని త‌మ వివాహ మ‌ధురానుభూతుల‌ను నెమ‌రు వేసుకుంటూ ఉంటారు. అయితే అంత‌టి ప్రేమ‌, అనురాగాల‌కు, బంధానికి గుర్తుగా తొడుక్కునే రింగ్ పోతే..? ఇక ఆ జంట‌కు నిద్ర ప‌ట్ట‌దు. ఎప్పుడూ ఆ రింగ్ మీదే ధ్యాస ఉంటుంది. తాము జీవితంలో ఏదో ముఖ్య‌మైన వ‌స్తువును కోల్పోయిన‌ట్టు భావిస్తారు. ఎప్పుడు వేలిని చూసుకున్నా ఏదో ఒక వెలితి క‌నిపిస్తూనే ఉంటుంది. అలాంటిది మ‌రి… ఒక వేళ‌… పోయింద‌నుకున్న రింగ్‌… మ‌ళ్లీ దొరికితే… అదీ 4 ద‌శాబ్దాల త‌రువాత చేతికి చిక్కితే..? అప్పుడు క‌లిగే అనుభూతి ఎలా ఉంటుంది..? దాన్ని మాట‌ల్లో వ‌ర్ణించ‌లేం… అంత‌టి ఫీలింగ్ ఆ జంట‌కు క‌లుగుతుంది. అదిగో, స‌రిగ్గా అలాంటి చెప్ప‌లేని ఓ మ‌ధుర‌మైన ఫీలింగ్‌నే ఆ జంట పొంద‌బోతున్నారు.

wedding-ring

స్పెయిన్‌కు చెందిన ఆగ‌స్టిన్‌, జువానీ అలియాగాలు 1979 ఫిబ్ర‌వ‌రి 17న అంటే, ఇప్ప‌టికి దాదాపుగా 37 ఏళ్ల కింద‌ట వివాహం చేసుకున్నారు. వారి బంధానికి గుర్తుగా ఉంగ‌రాలు కూడా మార్చుకున్నారు. అనంత‌రం వివాహం కాగానే హ‌నీమూన్‌కు అక్క‌డికి ద‌గ్గ‌ర్లోనే ఉన్న బెనిడోర్మ్ అనే ఓ చిన్న ద్వీపానికి వెళ్లారు. అయితే అక్క‌డి ఓ రిసార్ట్‌కు స‌మీపంలో ఉన్న కొల‌నులో జువానీ రింగ్ ప‌డిపోయింది. వారు ఎంత వెదికినా క‌నిపించ‌లేదు. దీంతో చేసేదేం లేక వారు రింగ్ పోయింద‌నే బాధ‌తోనే వెనుదిరిగారు. అయితే ఇటీవ‌లే జెస్సీ నిసోస్ అనే ఓ స్కూబా డైవింగ్ శిక్ష‌కురాలు ఆ కొల‌నులోకి దూకి అడుగు భాగానికి చేరుకుంది. ఈ క్ర‌మంలో ఆమెకు జువానీ రింగ్ దొరికింది. దానిపై వారి వివాహం తేదీ, జువానీ పేరు రాసి ఉంది. ఈ క్ర‌మంలో ఆ ఉంగ‌రం ఎంతో పాత‌దిగా గుర్తించింది జెస్సీ. దీంతో ఆమె ఓ ప‌నిచేసింది.

త‌న‌కు 1979 ఫిబ్ర‌వ‌రి 17న వివాహం చేసుకున్న ఓ జంట‌కు చెందిన రింగ్ దొరికింద‌ని, దాని సంబంధీకులు ఎవ‌రైనా ఉంటే త‌న‌కు మెసేజ్ చేసి, రుజువులు చూపించి రింగ్‌ను తీసుకోవ‌చ్చ‌ని త‌న ఫేస్‌బుక్ ఖాతాలో రింగ్ ఫొటోతో కూడిన ఓ పోస్ట్‌ను ఉంచింది. కాగా జెస్సీ పెట్టిన ఈ పోస్ట్ కేవ‌లం కొద్ది రోజుల్లోనే వైర‌ల్‌గా మారింది. ఆ పోస్ట్‌కు 80వేల‌కు పైగా షేర్లు, 135 కామెంట్లు, 5500 లైక్‌లు ఇప్ప‌టికే వ‌చ్చాయి. కానీ వాటి య‌జ‌మానులు ఎవ‌రో ఇంకా తెలియ‌లేదు. ఈ క్ర‌మంలో వైర‌ల్‌గా మారిన జెస్సీ పోస్ట్ ఫేస్‌బుక్ న్యూస్ ఫీడ్‌లో కూడా క‌నిపించింది. దీన్ని జువానీ చూసి త‌న భ‌ర్త‌కు చెప్ప‌డంతో అత‌ను జెస్సీని ఫేస్‌బుక్ ద్వారా కాంటాక్ట్ చేశాడు. త‌మ మ్యారేజ్ స‌ర్టిఫికెట్‌, ఆ రింగ్‌ను కొన్న బిల్‌, దాని ఫొటోలు ఇంకా ఆ జంట వ‌ద్ద ఉండ‌డంతో వాటిని జెస్సీకి చూపుతూ ఫొటోలు ఉంచారు. దీంతో జెస్సీ స్పందించి వారి రింగ్‌ను వారికి ఇచ్చేందుకు సిద్ధ‌మైంది. ఈ నెల 26వ తేదీన ఆ జంట‌ను క‌లిసి రింగ్‌ను అంద‌జేస్తాన‌ని జెస్సీ చెబుతోంది. ఈ క్ర‌మంలో ఆగ‌స్టిన్‌, జువానీ అలియాగాలు 37 ఏళ్ల నాటి వివాహ బంధ జ్ఞాప‌కాన్ని మ‌ళ్లీ పొంద‌నున్నారు. ఇప్ప‌టికే వారి ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. ఇక ఆ రింగ్‌ను తీసుకుంటే పైన మేం చెప్పిన‌ట్టుగా వారి అనుభూతిని వ‌ర్ణించ‌డానికి నిజంగా మాట‌లు స‌రిపోవేమో..! ఏది ఏమైనా ఆ రింగ్ అలా దొర‌క‌డం మాత్రం ఆగ‌స్టిన్‌, జువానీ అలియాగాల అదృష్ట‌మ‌నే చెప్పాలి. అంతే క‌దా..!

ఫేస్‌బుక్‌లో జెస్సీ ఉంచిన పోస్ట్ ఇదే..!

Comments

comments

Share this post

scroll to top