ఈ ఫ్యాన్ హిస్ట‌రీ మీకు తెలుసా? పేరు చూస్తే విదేశీ….కానీ ప‌క్కా లోక‌ల్ !

స్వదేశీ ఉత్ప‌త్తుల ప‌ట్ల జ‌నాల్లో ఇప్పుడిప్పుడే కొద్దిగా మార్పు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. చాలా మంది దేశీయ కంపెనీలు త‌యారు చేసిన ఉత్ప‌త్తుల‌ను వాడేందుకే ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. విదేశీ బ్రాండ్ల ప‌ట్ల విముఖ‌త ప్ర‌ద‌ర్శిస్తున్నారు. ఇది మంచిదే. అయితే కొంద‌రికి స్వ‌దేశీ, విదేశీ బ్రాండ్లు స‌రిగ్గా తెలియ‌డం లేదు. దీంతో స్వదేశీ బ్రాండ్ల‌ను కూడా విదేశీ అనుకుని వాటిని కొన‌డం లేదు. అలాంటి వాటిలో హావెల్స్ (HAVELLS) కంపెనీ కూడా ఒక‌టి. నిజానికి ఇది స్వదేశీ కంపెనీయే. కానీ చాలా మంది దీన్ని విదేశీ కంపెనీ అనుకుని దానికి చెందిన ఉత్పత్తుల‌ను కొన‌డం లేదు.

హావెల్స్ కంపెనీని మొద‌ట ఏర్పాటు చేసింది హ‌వేలీ రామ్ గాంధీ అనే వ్య‌క్తి. ఆయ‌న త‌న హావెల్స్ బ్రాండ్‌ను 1971లో కిమ‌త్ రాయ్ గుప్తా అనే వ్య‌క్తికి అమ్ముకున్నాడు. ఆ త‌రువాత కిమ‌త్ రాయ్ హావెల్స్ బ్రాండ్ పేరిట హావెల్స్ ఇండ‌స్ట్రీస్ అనే ప‌రిశ్ర‌మ‌ను రూ.10వేల పెట్టుబ‌డితో ఏర్పాటు చేశారు. ఆ త‌రువాత 5 ఏళ్ల‌కు న్యూఢిల్లీలోని తిల‌క్‌న‌గ‌ర్‌లో కిమ‌త్ రాయ్ హావెల్స్ కంపెనీకి చెందిన మొద‌టి మానుఫాక్చ‌రింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశారు.

ఆ ప్లాంట్‌లో రీవైర‌బుల్ స్విచ్‌ల‌ను తయారు చేయ‌డం మొద‌లు పెట్టారు. దీంతో ఆ స్విచ్‌లు హిట్ అయ్యాయి. ఆ త‌రువాత ఇక కిమ‌త్ రాయ్ వెనుదిరిగి చూడ‌లేదు. న్యూఢిల్లీలోనే కీర్తిన‌గ‌ర్‌లో మ‌రో ప్లాంట్‌ను నెల‌కొల్పాడు. అలా ఆయ‌న వ్యాపార ప్ర‌స్థానం అప్ర‌తిహ‌తంగా సాగింది. దీంతో 2016వ సంవ‌త్సరం వ‌ర‌కు ఆయ‌న ఏకంగా 11 హావెల్స్ ప్లాంట్ల‌ను నెల‌కొల్పాడు. హ‌రిద్వార్‌, బ‌ద్ది, నోయిడా, ఫ‌రిదాబాద్‌, అల్వార్‌, నీమ్‌రానా, బెంగుళూరుల‌లో ఆ ప్లాంట్లు ఉన్నాయి. కాగా 2014లోనే దేశంలో ఉన్న అత్యంత న‌మ్మ‌క‌మైన బ్రాండ్ల‌లో హావెల్స్‌కు 125వ స్థానం ద‌క్కింది. ప్ర‌స్తుతం ఈ కంపెనీకి 23 బ్రాంచ్‌లు ఉండ‌గా 6వేల మంది ప్రొఫెష‌న‌ల్ ఉద్యోగులు వివిధ దేశాల్లో సేవ‌లందిస్తున్నారు. కాబ‌ట్టి మీరు కూడా గుర్తుంచుకోండి, హావెల్స్ ఫారిన్ బ్రాండ్ కాదు, మ‌న దేశ‌పు బ్రాండే..!

Comments

comments

Share this post

scroll to top