పేద‌ల‌కు స‌హాయం చేసేందుకు మంచిర్యాల క‌లెక్ట‌ర్ అమ‌లు ప‌రుస్తున్న వినూత్న కార్య‌క్ర‌మం ఏంటో తెలుసా..?

పాత చెప్పులు, బ‌ట్ట‌లు ఇంకా ఇత‌ర అనేక వ‌స్తువుల‌ను మనం పాత‌గా అయ్యాయ‌ని వాడ‌డం ప‌డేస్తాం. కానీ మీకు తెలుసా..? మ‌న దేశంలో అస్స‌లు ఒక్క పూట‌కు తిండికే కాదు క‌దా, క‌నీసం అలాంటి పాత దుస్తుల‌కు కూడా నోచుకోని వారు చాలా మంది ఉన్నారని. అవును, ఉన్నారు. అలాంటి వారు ఉన్నారు కాబ‌ట్టే వారిని ఆదుకునేందుకు ఆ జిల్లా క‌లెక్ట‌ర్ చ‌క్క‌ని ఆలోచ‌న చేశారు. దాని వ‌ల్ల ఎంతో మంది అలాంటి పేద‌ల ముఖాల్లో ఇప్పుడు సంతోషాలు నెల‌కొంటున్నాయి. వారికి స‌హాయం చేసేందుకు కూడా అనేక మంది ముందుకు వ‌స్తున్నారు. ఇంత‌కీ అస‌లా క‌లెక్ట‌ర్ ఎవ‌రంటే…

తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లా క‌లెక్ట‌ర్ ఆర్వీ క‌ర్ణ‌న్ మ‌హారాష్ట్ర‌లో ఓ వినూత్న కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్షంగా చూశారు. అదేమిటంటే… ఓ స్వ‌చ్ఛంద సంస్థ దాత‌ల నుంచి పాత దుస్తులు, చెప్పులు, బూట్లు వంటి వాటిని సేక‌రించి వాటిని శుభ్రం చేసి అవ‌స‌రం ఉన్న పేద‌ల‌కు వాటిని అందిస్తోంది. దీన్ని క‌ర్ణ‌న్ ప్రేర‌ణ‌గా తీసుకున్నారు. స‌రిగ్గా అలాంటి కార్య‌క్ర‌మాన్నే మంచిర్యాల ప‌ట్టణంలో ప్రారంభించారు. దాని పేరు ఆప‌న్న‌హ‌స్తం. ఇందుకోసం మంచిర్యాల బ‌స్టాండ్‌-రైల్వే స్టేష‌న్ రోడ్ లో ఉన్న జిల్లా ప‌రిష‌త్ పాఠ‌శాల ద‌గ్గ‌ర గోడ‌కు ఓ స్టాల్ ఏర్పాటు చేశారు. దాని పేరు వాల్ ఆఫ్ కైండ్ నెస్‌. ఈ స్టాల్‌లో స్థానికంగా ఉన్న అంగ‌న్ వాడీలు ప‌నిచేస్తారు. వారు దాత‌లు ఇచ్చిన పాత దుస్తులు, చెప్పులు, బూట్ల‌ను సైజ్‌ల వారీగా వివిధ ర‌కాల బాక్సుల‌లో ఉంచుతారు. వాటిని శుభ్రం చేసి ప్ర‌తి ఆదివారం పేద‌ల ద‌గ్గ‌ర‌కు వెళ్లి వాటిని పంచుతారు. ఇలా క‌ర్ణన్ ఓ బృహ‌త్ కార్యక్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు.

అయితే మొద‌ట్లో దీనికి స్పంద‌న వ‌స్తుందా..? అని అనుకున్నార‌ట‌. కానీ వారం లోనే ఫ‌లితం తెలిసింది. పెద్ద ఎత్తున ఈ కార్య‌క్ర‌మానికి స్పంద‌న ల‌భిస్తోంది. దీంతో చుట్టు ప‌క్క‌ల ఉన్న వారే కాదు, ఇత‌ర జిల్లాలకు చెందిన వారు కూడా త‌మకు తోచిన విధంగా ఈ స్టాల్‌కు స‌హాయం చేస్తున్నారు. ఇక కొంద‌రు వ్యాపారులైతే కొత్త దుస్తులు, చెప్పుల‌ను కూడా ఉదారంగా ఇచ్చేస్తున్నారు. అంత‌గా ఈ కార్యక్ర‌మానికి స్పంద‌న ల‌భిస్తోంది. ఈ క్ర‌మంలో ఇలాంటి స్టాల్స్‌ను మ‌రిన్ని పెట్టే యోచ‌న‌లో ఉన్నార‌ట క‌లెక్ట‌ర్ కర్ణ‌న్‌. వారి ఆలోచ‌న సాకార‌మై అలాంటి పేద‌ల‌కు అది చేయూత కావాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top