ఆ బాలుడు చ‌దువుతోంది 10వ త‌ర‌గ‌తి… హార్ట్ ఎటాక్‌ల‌ను గుర్తించే ప‌రికరాన్ని త‌యారు చేశాడు..!

హార్ట్ అటాక్‌… ఇది వ‌చ్చిందంటే చాలు మొద‌టి అర‌గంట లోపుగా రోగిని హాస్పిట‌ల్‌కు తీసుకెళ్లాలి. లేదంటే ప్రాణాల మీద‌కు వ‌స్తుంది. ఈ విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే హార్ట్ ఎటాక్ వ‌చ్చే ముందే మ‌న‌కు కొన్ని ల‌క్ష‌ణాలు రోగిలో క‌నిపిస్తాయి. దాన్ని బ‌ట్టి హార్ట్ ఎటాక్ వ‌స్తుందా, రాదా అన్న‌ది తెలుసుకోవ‌చ్చు. కానీ… కొంద‌రిలో మాత్రం అలా కాదు. అప్ప‌టి వ‌ర‌కు వారు ఆరోగ్యంగానే ఉంటారు, ల‌క్ష‌ణాలేం క‌న‌బ‌డ‌వు. కానీ హ‌ఠాత్తుగా హార్ట్ ఎటాక్ వ‌స్తుంది. దీన్ని సైలెంట్ అటాక్ అని కూడా అంటారు. దీన్ని క‌నిపెట్టడం చాలా క‌ష్ట‌మైన ప‌ని. కానీ… మ‌నిషి త‌ల‌చుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు క‌దా..! అందుకే ఆ ప‌ని కూడా సాధ్య‌మైంది. సైలెంట్ హార్ట్ ఎటాక్‌లను కూడా ఇప్పుడు సుల‌భంగా తెలుసుకోవ‌చ్చు. అయితే, అలా తెలుసుకునే ప‌రిక‌రాన్ని క‌నిపెట్టింది ఎవ‌రో తెలుసా..? ఓ బాలుడు..!

aksah-manoj

అవును, మీరు విన్న‌ది నిజ‌మే. సైలెంట్ హార్ట్ ఎటాక్‌ల‌ను సుల‌భంగా క‌నిపెట్టేందుకు గాను ఆ బాలుడు ఓ ప‌రిక‌రాన్ని రూపొందించాడు. అత‌ని పేరు ఆకాష్ మ‌నోజ్‌. త‌మిళ‌నాడు వాసి. చ‌దువుతోంది 10వ త‌ర‌గ‌తి. అయితే గ‌త కొంత కాలం కింద‌ట ఆ బాలుడి తాత సైలెంట్ హార్ట్ ఎటాక్ కార‌ణంగానే తీవ్ర ప్రాణాపాయ ప‌రిస్థితికి లోన‌య్యాడు. ఈ క్ర‌మంలోనే మ‌నోజ్ అప్పుడే నిర్ణ‌యించుకున్నాడు, అలాంటి హార్ట్ ఎటాక్‌లను సుల‌భంగా క‌నిపెట్టేందుకు ఏదైనా ప‌రిక‌రం త‌యారు చేయాల‌ని. అంతే, దానికి ఇప్పుడు ఓ రూపం వ‌చ్చింది. అత‌ను అనుకున్న‌ది సాధించాడు.

silent-heart-attack

silent-heart-attack-detecto

సిలికాన్ మెంబ్రేన్‌తోపాటు ర‌క్తాన్ని పూర్తిగా విశ్లేషించి సైలెంట్ హార్ట్ ఎటాక్ వ‌స్తుందా, రాదా అన్న విష‌యం తెలుసుకునే ఓ ప్రోటోటైప్ ప‌రిక‌రాన్ని మ‌నోజ్ త‌యారు చేశాడు. ఇందుకోసం రోగి చ‌ర్మాన్ని గుచ్చాల్సిన ప‌నిలేదు. కొంత ర‌క్తం చాలు, అందులో ఉండే FABP3 అనే ఓ ర‌క‌మైన ప్రోటీన్ స్థాయిని అల్ట్రా వ‌యొలెట్ లైట్‌లో విశ్లేషించ‌డం ద్వారా మ‌నోజ్ త‌యారు చేసిన ప‌రిక‌రం ప‌నిచేస్తుంది. ఆ ప‌రిక‌రం అలా ఆ ప్రోటీన్‌ను విశ్లేషించి సైలెంట్ హార్ట్ ఎటాక్ వ‌స్తుందో రాదో చెబుతుంది. ఈ క్ర‌మంలో మనోజ్ త‌యారు చేసిన ప‌రిక‌రానికి అంత‌టా గుర్తింపు వ‌చ్చింది. దీంతో అత‌ను చాలా ఫేమ‌స్ అయ్యాడు. ఏకంగా రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆహ్వానాన్ని అందుకుని ప్ర‌స్తుతం ఢిల్లీలోని రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ఇన్‌-రెసిడెన్స్ ప్రోగ్రామ్ అనే కార్య‌క్ర‌మంలో భాగంగా అక్క‌డే ఉంటున్నాడు. ఈ నెల 10 వ‌ర‌కు మ‌నోజ్ రాష్ట్ర‌ప‌తికి గెస్ట్‌లా ఉండ‌నున్నాడు. ఏది ఏమైనా… మ‌నోజ్ తెలివి తేట‌ల‌కు మ‌నం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..! ఇంత‌కీ అత‌ను పెద్ద‌య్యాక ఏమ‌వుదామ‌నుకుంటున్నాడో తెలుసా..? కార్డియాల‌జిస్టు..! గుండె వైద్య నిపుణుడు..!

Comments

comments

Share this post

scroll to top