ఆ బాలుడు ఒక‌ప్పుడు స‌మోసాలు చేశాడు.. ఇప్పుడు ఐఐటీ ఎంట్ర‌న్స్‌లో 64వ ర్యాంకు సాధించాడు..!

నిజ‌మే… క‌ష్ట‌ప‌డి ప‌నిచేస్తే సాధించ‌లేనిది అంటూ ఏదీ ఉండ‌దు. ప‌ట్టుద‌ల, అంకిత భావం, శ్ర‌మ ఉండాలే గానీ ల‌క్ష్య‌సాధ‌న వైపు సుల‌భంగా ప్ర‌యాణం చేయ‌వ‌చ్చు. విజ‌యాన్ని అందుకోవ‌చ్చు. గ‌తంలో ఇలాంటి విజ‌యాల‌ను సాధించిన వారిని ఎంద‌రినో మ‌నం చూశాం. అయితే ఇప్పుడు చెప్ప‌బోయే ఆ బాలుడు కూడా స‌రిగ్గా ఇదే కోవ‌కు చెందుతాడు. అత‌ని పేరు… మోహ‌న్ అభ్యాస్‌. ఈ మ‌ధ్యే విడుద‌లైన ఐఐటీ ఫ‌లితాల్లో ఆలిండియా లెవ‌ల్లో ఇత‌ను 64వ ర్యాంకును సాధించాడు. నిజానికి ఇత‌ను ఒక‌ప్పుడు స‌మోసాలు చేసేవాడు. వీరిది చాలా పేద కుటుంబం. అయిన‌ప్ప‌టికీ క‌ష్ట‌ప‌డి చ‌దివి అంత‌టి ర్యాంకును సాధించాడు.

వాబిలిశెట్టి మోహ‌న్ అభ్యాస్ తండ్రి పేరు సుబ్బారావు. త‌ల్లి సూర్య క‌ళ‌. వీరిది ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని భీమ‌వ‌రం ప్రాంతం. 13 ఏళ్ల కింద‌టే హైద‌రాబాద్‌కు వీరు వ‌ల‌స వ‌చ్చారు. వీరికి ఇద్ద‌రు సంతానం మోహ‌న్‌తోపాటు, ఓ కూతురు కూడా వీరికి ఉంది. అయితే వీరు హైద‌రాబాద్ న‌గ‌రంలోని కూక‌ట్‌ప‌ల్లి ఏరియాలో నివాసం ఉంటున్నారు. చాలా ఇరుకైన ఇల్లు అది. అందులోనే వీరు స‌మోసాలు, ఇత‌ర తిను బండారాలు చేసేవారు. వాటిని సుబ్బారావు వీధుల్లో తిరుగుతూ అమ్మేవాడు. అలా వారు చాలా పేదరికాన్ని అనుభవించారు. అయిన‌ప్ప‌టికీ సుబ్బారావు మోహ‌న్‌ను బాగానే చ‌దివించాడు.

అయితే మోహ‌న్ తండ్రి క‌ష్టాన్ని వృథా పోనివ్వ‌లేదు. చిన్న‌ప్ప‌టి నుంచి బాగా క‌ష్ట‌ప‌డేవాడు. చ‌దువును సీరియ‌స్‌గా తీసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే రోజుకు 10 గంట‌లు చ‌దివేవాడు. అలా అత‌ను శ్ర‌ద్ధ‌గా చ‌దువుతూనే మ‌రోవైపు ఇంటి ప‌నుల్లోనూ స‌హాయం చేసేవాడు. వీలు కుదిరిన‌ప్పుడ‌ల్లా స‌మోసాలు చేసేవాడు. కాగా ఈ మ‌ధ్యే మోహ‌న్ ఐఐటీ ఎంట్ర‌న్స్ రాశాడు. అందులో ఆలిండియా లెవ‌ల్లో 64వ ర్యాంకును సాధించి స‌త్తా చాటాడు. దీంతో మోహ‌న్ కుటుంబ స‌భ్యుల ఆనందానికి అవ‌ధులు లేకుండా పోయాయి. అంతేకాదు, మోహ‌న్ ఆంధ్ర‌ప్రదేశ్ ఎంసెట్ ఎగ్జామ్‌లోనూ 5వ ర్యాంక్ సాధించాడు. అయితే మోహ‌న్ మాత్రం ఐఐటీ బాంబేలో చేరుతాన‌ని, క‌లాం అంత‌టి గొప్ప సైంటిస్టును అవుతాన‌ని అంటున్నాడు. అత‌ని క‌ల నెర‌వేరాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top