ఆ బాలుడు ఏదో ఒక పని చేసి కుటుంబాన్ని పోషిద్దామనుకోలేదు. ఆ పనిలోనే ప్రతిభ చూపేలా నైపుణ్యాన్ని సాధించాడు.

ఆ బాలుడికి అప్పుడు 6 ఏళ్లు. ఆ సమయంలో అతని తండ్రి కుటుంబాన్ని వదిలేశాడు. అతనికి తల్లి, చెల్లెలు, తమ్ముడు కూడా ఉండడంతో కుటుంబాన్ని భారంగా నెట్టుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో తన తల్లికి తోడుగా నిలుస్తూ తాను కూడా ఎంతో కొంత సంపాదించి తెచ్చి తల్లికి ఇవ్వాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పనికోసం వెదకడం ప్రారంభించాడు. అసలే చిన్న వయస్సు కావడంతో ఎక్కడా పని దొరకలేదు. అయితే అదృష్టవశాత్తూ ఓ షెడ్డులో మెకానిక్ పనికి కుదిరాడు. అప్పటి నుంచి తన కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు ఆ బాలుడు. అతనే ‘మరి’.

Mari

తమిళనాడులోని బోధినయకానుర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ‘మరి’ అనే బాలుడికి 6 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు అతని తండ్రి ఆ కుటుంబాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. పూట గడవని పరిస్థితిలో ఉండడంతో అంత చిన్న వయస్సులోనే ఎంతో ఉన్నతంగా ఆలోచించి ఆ బాలుడు కుటుంబ భారం నెత్తిన వేసుకున్నాడు. తాము ఉన్న ప్రాంతంలో అంతటా పని కోసం వెదికాడు. కానీ ఎక్కడా పని దొరకలేదు. అయితే అదృష్టవశాత్తూ స్థానికంగా ఉన్న ఖాజా అనే వ్యక్తికి చెందిన ఓ ఆటోమొబైల్ వర్క్‌షాప్‌లో మెకానిక్ పనికి కుదిరాడు. కాగా మొదట్లో ఖాజా ‘మరి’కి పని ఇవ్వడం కుదరదని చెప్పాడు. కానీ ఆ బాలుడి అమాయకత్వం, అతని మాటకారి తనం చూసిన ఖాజా ‘మరి’కి పని ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. అలా అప్పటి నుంచి ప్రారంభమైన వారిద్దరి ప్రయాణం గత 8 ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది. ‘మరి’కి ఇప్పుడు 14 ఏళ్లు.

మొదట్లో మరికి ఖాజా రోజుకు రూ.100 ఇచ్చేవాడు. కానీ పోను పోను మెకానిక్‌గా ఆ బాలుడు నైపుణ్యం చూపుతుండడంతో అతన్ని వదులుకోలేని ఖాజా కొంత ఎక్కువ డబ్బులు చెల్లిస్తూ తన దగ్గరే పెట్టుకున్నాడు. తండ్రి దూరమైన మరికి ఖాజా తండ్రిలాంటి వాడిలా మారి అన్నీ తానై చూసుకుంటున్నాడు. మరికి 20 ఏళ్లు రాగానే ఆ మెకానిక్ షెడ్‌ను అతనికి అప్పగించాలనుకుంటున్నాడు ఖాజా. ఇదంతా ఆ బాలుడి ప్రతిభే అంటే నమ్మగలరా!

Mari

కేవలం పైన చెప్పిన మరి మాత్రమే కాదు. ఇంకా అలాంటి వారు చాలా మంది మన దేశంలో ఉన్నారు. వారంతా బాలకార్మికులుగా ఉన్నారు. ఈ క్రమంలో వారు అలా పని చేసుకుని తమ కాళ్లపై తాము నిలబడదామనుకుంటే బాలకార్మికులు అంటూ పని చేయకుండా అడ్డుకుంటున్నారు. పోనీ చేరదీసి తమ కోసం ఏదైనా చేస్తారా అంటే అటు ప్రభుత్వం కానీ, ఇటు నాయకులు గానీ ఎవరూ పట్టించుకోరు. అమ్మ పెట్టదు. అడుక్కోనివ్వదు. అంటే ఇదేనేమో. దీంతో మరి లాంటి బాలలు అటూ ఇటూ కాకుండా పోతున్నారు. పని చేసుకుని బతికితే కనీసం ఆ పనిలోనైనా నైపుణ్యం సాధించి ఆర్థిక స్వావలంబన దిశగా వారు ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. కానీ అలాంటి అవకాశం మరి లాంటి వారికి ఉండడం లేదు. ఏది ఏమైనా సొంత కాళ్లపై నిలబడి మరి ఈ 8 ఏళ్ల కాలంలో బాగానే నేర్చుకున్నాడు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇలాంటి వారి కోసం ఏవైనా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ఇప్పిస్తే వారు ఇంకా త్వరగా ఎదిగేందుకు అవకాశం ఉంటుంది. అలా జరుగుతుందనే ఆశిద్దాం.

Comments

comments

Share this post

scroll to top