ఈ బాలుడు ఏడాదిలోనే ఇంజినీరింగ్ విద్య‌ను పూర్తి చేశాడు తెలుసా..?

మ‌న దేశంలో మెడిసిన్ త‌రువాత వృత్తి విద్యా కోర్సుల్లో బాగా డిమాండ్ ఉంది ఇంజినీరింగ్ విద్య‌కే. నేడు చాలా మంది త‌ల్లిదండ్రులు త‌మ పిల్ల‌ల‌ను ఇంజినీర్లుగా చూడాల‌ని క‌ల‌లు కంటున్నారు. అందులో భాగంగానే వారు త‌మ క‌ల‌ల‌ను సాకారం చేసుకుంటున్నారు కూడా. అయితే ఎవ‌రికైనా ఇంజినీరింగ్ చ‌ద‌వాలంటే 4 ఏళ్లు స‌మ‌యం ప‌డుతుంది. ఇక బ్యాక్‌లాగ్స్ ఉంటే కొన్ని సార్లు ఎక్కువే స‌మ‌యం ప‌డుతుంది. అయితే మీకు తెలుసా..? ఇప్పుడు మేం చెప్ప‌బోయే అత‌ను మాత్రం కేవ‌లం ఏడాదిలోనే ఇంజినీరింగ్ విద్య‌ను పూర్తి చేశాడు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. షాకింగ్‌గా ఉన్నా ఇది మీరు న‌మ్మాల్సిందే.

అత‌ని పేరు నిర్భ‌య్ ఠ‌క్క‌ర్‌. వ‌య‌స్సు 15 సంవ‌త్స‌రాలు. ఉంటున్న‌ది గుజ‌రాత్ రాష్ట్రంలోని జామ్‌న‌గ‌ర్‌లో. అయితే అంద‌రు పిల్ల‌ల్లాగే నిర్భ‌య్ 7వ త‌ర‌గ‌తి వ‌ర‌కు చ‌దివాడు. కానీ చ‌దువుల్లో ఎప్పుడూ వెనుక‌బ‌డి ఉండేవాడ‌ట‌. దీంతో స్కూల్‌లో ఉపాధ్యాయులు నిర్భ‌య్ త‌ల్లిదండ్రుల‌ను పిలిపించారు. నిర్భ‌య్ తండ్రి ధ‌వ‌ళ్ ఠ‌క్క‌ర్ నిజంగానే ఈ విష‌యం ప‌ట్ల ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశాడు. దీంతో ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్న అత‌ను వెంట‌నే త‌న ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేశాడు. త‌న కుమారుడు నిర్భ‌య్ చదువు ప‌ట్లే శ్ర‌ద్ధ చూపాడు. ఈ క్ర‌మంలో ఒక్క ఏడాదిలోనే నిర్భ‌య్ లో చాలా మార్పు వ‌చ్చింది. చ‌దువుల్లో అమిత‌మైన ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రిచేవాడు. అలా అత‌ను 8 నుంచి 10 త‌ర‌గతుల‌ను కేవ‌లం 6 నెల‌ల్లోనే పూర్తి చేశాడు. ఆ త‌రువాత కేంబ్రిడ్జి ఇంటర్నేషనల్‌కు చెందిన ఇంటర్నేషనల్‌ జనరల్‌ సర్టిఫికేట్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (ఐజీసీఎస్‌ఈ)ను మూడు నెలల్లోనే పూర్తిచేశాడు.

అనంత‌రం గుజరాత్‌ టెక్నోలాజికల్‌ యూనివర్సిటీ (జీటీయూ)లో బీఈ (ఎలక్ట్రికల్‌) కోర్సును ఏడాదిలోనే పూర్తి చేసి అత్యంత చిన్న వ‌య‌స్సులో గ్రాడ్యుయేష‌న్ చేసిన వ్య‌క్తిగా రికార్డు సాధించాడు. ఇక రానున్న 5 ఏళ్ల‌లో క‌నీసం 10 ఇంజినీరింగ్ డిగ్రీల‌ను సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకున్నాడు ఈ చిచ్చ‌ర పిడుగు. దీని వ‌ల్ల చాలా ఎక్కువ విష‌య ప‌రిజ్ఞానం వ‌స్తుంద‌ని అత‌ను చెబుతున్నాడు. అయితే ఇప్ప‌టికే నిర్భ‌య్ ఇంజినీరింగ్‌ ప్రాజెక్టులో భాగంగా గాలిమరతో విద్యుత్తు ఉత్పత్తిచేసే యంత్రాన్ని అభివృద్ధి చేస్తున్నాడు. ఇది తక్కువ గాలి వీచినప్పుడు కూడా అధిక‌ విద్యుత్ ను ఉత్పత్తి చేయడం విశేషం. ఇలాంటి మ‌రెన్నో ఆవిష్క‌ర‌ణ‌ల‌ను చేప‌డుతాన‌ని అంటున్నాడు నిర్భ‌య్‌. అత‌ని ఆశ‌యం నెర‌వేరాల‌ని మ‌న‌మూ కోరుకుందాం.

Comments

comments

Share this post

scroll to top