రోడ్ల‌పై ఉన్న గుంత‌ల‌ను పూడుస్తూ.. ప్ర‌మాదాల నివార‌ణ‌కు న‌డుం బిగించాడు ఆ బాలుడు..!

ఈ మధ్య కాలంలో రోడ్డు ప్ర‌మాదాలు విప‌రీతంగా జ‌రుగుతున్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. గ‌తంలో క‌న్నా ఇప్పుడు ఆ ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జరుగుతున్నాయి. వాటి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. ఇక హైద‌రాబాద్ న‌గ‌రంలోనైతే తీవ్ర ప్ర‌మాదాల‌తోపాటు చిన్న చిన్న ప్ర‌మాదాలు కోకొల్ల‌లుగా రోజూ ఎక్క‌డో ఒక చోట జ‌రుగుతూనే ఉన్నాయి. అయితే ఎక్క‌డ రోడ్డు ప్రమాదం జ‌రిగినా అందుకు కార‌ణాలు అనేకం ఉంటున్నాయి. వాటిల్లో గుంత‌లు ప‌డ్డ రోడ్లు కూడా ఒక కార‌ణం అని చెప్ప‌వ‌చ్చు. ర‌హ‌దారుల‌ను నాణ్యంగా వేయ‌క‌పోవ‌డంతో వ‌ర్షం ప‌డిన‌ప్పుడ‌ల్లా అవి కోత‌కు గురై గుంత‌లు ప‌డుతున్నాయి. దీంతో గుంత‌లు ప‌డిన రోడ్ల‌లో ప్ర‌యాణించే వాహ‌న‌దారుల న‌డ్డి విర‌గ‌డ‌మే కాదు, కొన్ని సార్లు ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వ‌స్తుంది. అయిన‌ప్ప‌టికీ సంబంధిత అధికారులు గుంత‌ల‌ను పూడ్చిన పాపాన పోరు. అయితే అధికారుల సంగ‌తేమో గానీ గుంత‌లు ప‌డ్డ రోడ్లు మాత్రం ఆ బాలున్ని క‌దిలించాయి. ఈ క్ర‌మంలో ఆ బాలుడు ఏం చేశాడో తెలుసా..?

ఆ బాలుడి పేరు ర‌వితేజ. ఉంటున్న హైద‌రాబాద్ న‌గ‌రంలోని హబ్సిగూడ‌లో. అయితే ఇత‌ను ఇటీవ‌ల జరిగిన అనేక రోడ్డు ప్ర‌మాదాలను గురించి తెలుసుకున్నాడు. దీంతో ఎలాగైనా ఆ ప్ర‌మాదాల‌ను కొంత వ‌ర‌కైనా ఆపాల‌న్న ఉద్దేశంతో త‌న వంతు ప్ర‌య‌త్నంగా త‌మ ఇంటి స‌మీపంలో ఉన్న రోడ్డుపై గుంత‌ల‌ను పూడ్చ‌డం మొద‌లు పెట్టాడు.

ఒక చెక్క పెట్టెలో రాళ్లు, మ‌ట్టి తెచ్చి ర‌వితేజ గుంతల‌ను పూడ్చాడు. ఆ స‌మ‌యంలో అత‌న్ని చూసిన వారు ఆశ్చ‌ర్య‌పోయారు. ఇంత చిన్న వ‌య‌స్సులోనే స‌మాజ స్పృహ అంత‌గా ఉన్నందుకు ప‌లువురు అత‌న్ని మెచ్చుకున్నారు. దీంతో ఆ బాలుడి వార్త సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఎవ‌రో వ‌స్తార‌ని, ఏదో చేస్తార‌ని వేచి చూడ‌కుండా మ‌న చేత‌నైనంత వ‌ర‌కు మ‌న‌కు మ‌న‌మే ప‌ని చేసుకోవాల‌ని ఆ బాలుడు నిరూపించాడు. మ‌రి ఇత‌న్ని చూశాకైనా అధికారుల్లో చ‌ల‌నం వ‌స్తుందో లేదో చూడాలిక‌..!

Comments

comments

Share this post

scroll to top