ఆ బాలుడు చ‌దువుతుంది 7వ త‌ర‌గ‌తి… అయినా స‌మాజ సేవ‌లోనే నిమ‌గ్న‌మ‌య్యాడు..!

స‌మాజ సేవ చేయాలంటే అందుకు వ‌య‌స్సుతో ప‌ని లేదు. స్పందించే మ‌నస్సు ఉంటే చాలు. ఎవ‌రైనా ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకోవ‌చ్చు. పేద‌ల‌కు స‌హాయం చేయ‌వ‌చ్చు. అదిగో… ముంబైకి చెందిన ఆ బాలుడు కూడా స‌రిగ్గా ఇదే సూత్రాన్ని వంట బ‌ట్టించుకున్నాడు. కాబ‌ట్టే 7వ త‌ర‌గ‌తి చ‌దువుతున్నా ఓ వైపు స్కూల్‌కు వెళ్తూ, మ‌రో వైపు త‌నకు ఎంత‌గానో ఇష్ట‌మైన సామాజిక సేవ చేస్తున్నాడు. ఈ క్ర‌మంలో ఆ బాలుడు ఓ మంచి పని కోసం పూనుకున్నాడు. అందులో భాగంగానే పెద్ద ఎత్తున విరాళాల‌ను సేక‌రించ‌డం మొద‌లు పెట్టాడు. ఇంత‌కీ… ఆ బాలుడు ఎవ‌రో..? ఎందుకు ఆ విరాళాలు సేక‌రిస్తున్నాడో తెలుసా..?

Arav-Hak

ఆ బాలుడి పేరు అరవ్ హక్. ముంబై నివాసి. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. అతని తల్లి నర్గిస్ దత్ అనే ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేస్తోంది. అయితే తల్లి ప్రభావం వల్లో ఏమో గానీ అరవ్‌కు చిన్నప్పటి నుంచి సామాజిక సేవ అంటే ఇష్టం. పేదలకు, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయాలని చూస్తుంటాడు. ఈ క్రమంలోనే అతను గత ఆరు నెలలుగా తన తల్లితో కలిసి అదే స్వచ్ఛంద సంస్థ కోసం పనిచేయడం ప్రారంభించాడు. రోజూ స్కూల్‌కు వెళ్లేటప్పుడు, అక్కడి నుంచి వచ్చేటప్పుడు బస్‌లోనే హోం వర్క్ చేయడం ప్రారంభించాడు. ఇంటికి రాగానే తన తల్లి దగ్గర నుంచి సమాచారం తీసుకుని సహాయం అవసరం ఉన్న వారి కోసం నిధులు సేకరించడం, అవసరమైతే దాతల దగ్గరకు వెళ్లడం, ఇతర కార్యక్రమాలను చూడడం వంటి పనులు చేయసాగాడు.

అలా అరవ్ ఆ స్వచ్ఛంద సంస్థ పనుల్లో నిమగ్నమై ఉండగా క్యాన్సర్‌తో బాధ పడుతూ వైద్యం కోసం ఎదురు చూస్తున్న దాదాపు 100 మందికి పైగా పేద పిల్లల గురించి తెలిసింది. దీంతో వారి వైద్యానికి అయ్యే ఖర్చుల కోసం ఎలాగైనా నిధులు సేకరించాలని అనుకుని అదే విషయాన్ని ఫేస్‌బుక్‌లో ఓ ఎన్‌జీవోకు చెందిన పేజీలో షేర్ చేశాడు. దీంతో రెండు రోజుల్లోనే అతనికి రూ.9 లక్షలకు పైగా నిధులు అందాయి. ఆ విషయం తెలుసుకున్న అనేక మంది దాతలు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే అరవ్ అంతటితో ఆగడం లేదు. త్వరలో ముంబైలో ఓ మారథాన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నాడు. దాని ద్వారా పెద్ద ఎత్తున నిధులను సేకరించి క్యాన్సర్ బాధిత చిన్నారులకు సహాయం అందించే యోచనలో ఉన్నాడు అరవ్..! అత‌ని ఆశ‌యం నెర‌వేరాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం..!

Comments

comments

Share this post

scroll to top