12 ఏళ్లకే సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌గా మారిన బాలుడు… సొంతంగా ఓ ప్ర‌త్యేక సాఫ్ట్‌వేర్ అల్గారిథ‌మ్‌నే త‌యారు చేశాడు…

పిట్ట కొంచెం… కూత ఘ‌నం… అన్న సామెత తెలుసుగా! చిన్న వ‌య‌స్సులోనే అత్యంత ప్ర‌తిభ క‌న‌బ‌రిచే పిల్ల‌ల గురించి ఈ సామెత‌ను వాడుతారు. పెద్ద వారికి సైతం వీలు కాని కొన్ని ప‌నుల‌ను చేసిన చిన్నారుల కోసం ఈ ప‌దం ఉప‌యోగిస్తారు. ఇప్పుడు కూడా అలాంటి ఓ పిల్లాడి గురించే మేం చెప్ప‌బోయేది. కాక‌పోతే ఈ కుర్రాడు మ‌రీ అంత చిన్న పిల్లాడేం కాదు. వ‌య‌స్సు 12 ఏళ్లు. అయినా నిపుణులైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ల‌కు ఉండే తెలివి తేట‌లు అత‌ని సొంతం. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఆ బాలుడే ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అత్యంత పిన్న వ‌య‌స్సు క‌లిగిన సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్ల‌లో, యువ ఔత్సాహికుల్లో ఒకడిగా గుర్తింపు పొందాడు. అత‌డే త‌న్మ‌య్ భ‌క్షి.

tanmay-bakshi

త‌న్మ‌య్ భ‌క్షి వ‌య‌స్సు 12 సంవ‌త్స‌రాల‌. ఉంటుంది కెనడాలో. కానీ మాతృదేశం ఇండియానే. కాగా ఇత‌నికి చిన్న‌ప్ప‌టి నుంచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ కావాల‌నే కోరిక బ‌లంగా ఉండేది. దీంతో అందుకు అవ‌స‌ర‌మైన ప‌లు ప్రోగ్రామింగ్ భాష‌ల‌ను కూడా అల‌వోక‌గా నేర్చుకున్నాడు. ఈ క్ర‌మంలో ఐబీఎం సంస్థ‌కు చెందిన వాట్స‌న్స్ కాగ్నిటివ్ కేప‌బిలిటీస్ అనే సిస్ట‌మ్‌ను ఉప‌యోగించి ‘ఆస్క్‌త‌న్మ‌య్ (AskTanmay)’ పేరిట ప్ర‌పంచంలోనే మొద‌టి వెబ్ ఆధారిత ఎన్ఎల్‌క్యూఏ సిస్ట‌మ్‌ను త‌యారు చేశాడు. ఈ సిస్ట‌మ్ ఓ ప్ర‌త్యేక‌మైన అల్గారిథ‌మ్‌ను క‌లిగి ఉంటుంది. దీంతో ప‌ర్స‌న్‌, ఆర్గ‌నైజేష‌న్‌, లొకేషన్‌, డేట్ వంటి ప‌లు క్వ‌రీల‌తో కూడిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలు వెత‌క‌వ‌చ్చు. ఈ అల్గారిథ‌మ్ మొత్తం 8 స్టెప్స్‌లో ఉంటుంది.

శుక్ర‌వారం బెంగుళూరు న‌గ‌రంలో జ‌రిగిన ఐబీఎం డెవ‌ల‌ప‌ర్ క‌నెక్ట్ స‌ద‌స్సులో త‌న్మ‌య్ భ‌క్షి పాల్గొని అక్క‌డికి వ‌చ్చిన‌ సాఫ్ట్‌వేర్ నిపుణుల‌ను ఆక‌ట్టుకున్నాడు. స‌ద‌స్సుకు హాజ‌రైన మొత్తం 10వేల మంది సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్స్‌ను ఉద్దేశించి ఆ బాలుడు ప్ర‌సంగం ఇచ్చాడు. దీంతో ఆ ప్ర‌సంగాన్ని విన్న‌వారు అత‌ని నాలెడ్జ్‌కు అబ్బుర ప‌డిపోయారు. అంతేకాదు తాను రూపొందించిన AskTanmay అల్గారిథ‌మ్ గురించి స‌ద‌స్సులో వివ‌రించి త‌న‌లో స‌త్తా ఎంత ఉందో అంద‌రికీ తెలియ‌జేశాడు. ప్ర‌స్తుతం ఈ బాలుడే ప్ర‌పంచంలోని అత్యంత చిన్న వ‌య‌స్సు క‌లిగిన సాఫ్ట్‌వేర్ డెవ‌ల‌ప‌ర్‌గా, ఎంట‌ర్‌ప్రిన్యూర్‌గా గుర్తింపు పొందాడు. అంతే క‌దా మ‌రి. నిజంగా ఈ బాలుడు పిట్ట కొంచెం కూత ఘ‌నం అన్న సామెత‌ను రుజువు చేశాడుగా. ప్ర‌తిభ ఉండాలే గానీ అందుకు వ‌య‌స్సుతో ప‌నిలేద‌ని తేల్చి చెప్పాడు. ఈ బాలుడి గురించిన ఇంకో విశేష‌మేమిటంటే అత‌ని యూట్యూబ్ చాన‌ల్‌. అవును, ఈ బాలుడు ‘త‌న్మ‌య్ టీచెస్ (Tanmay Teaches)’ పేరిట ఓ యూట్యూబ్ ఛాన‌ల్‌ను కూడా న‌డుపుతున్నాడు. దాంట్లో కంప్యూటింగ్‌, అల్గారిథ‌మ్స్‌, సైన్స్‌, ఫీల్డ్ ట్రిప్స్‌, మ్యాథ్స్ వంటి ప‌లు అంశాల‌కు చెందిన టాపిక్స్‌ను క్షుణ్ణంగా వివ‌రించే వీడియోల‌ను అప్‌లోడ్ చేసి అంద‌రికీ అందుబాటులో ఉంచాడు. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ బాలుడు పిట్ట కొంచెం, కూత ఘ‌న‌మో కాదో!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top