ఆ బాలుడు 9వ త‌ర‌గ‌తి డ్రాప‌వుట్‌… కంప్యూట‌ర్ల‌ను బిగించ‌డంలో అత‌ని ప్రతిభ అద్భుతం..!

ప్రాసెస‌ర్‌, హార్డ్ డిస్క్‌, మ‌ద‌ర్‌బోర్డ్‌, ర్యామ్‌… ఇలా కంప్యూట‌ర్‌లో చాలా విడి భాగాలు ఉంటాయి. వాట‌న్నింటినీ క‌లిపి పీసీ అసెంబుల్ చేస్తారు. అయితే అలా కంప్యూట‌ర్ పార్ట్‌లు అన్నింటినీ క‌ల‌పాలంటే అందుకు ఆ విభాగంలో నాలెడ్జ్ ఉండాలి. ఏదో స్క్రూ, న‌ట్టు బిగించిన‌ట్టు కాదు. ఏ పార్టును దేనికి అనుసంధానం చేయాలి అనే విష‌యం తెలియాలి. మ‌రి అలా తెలియాలంటే కంప్యూట‌ర్ హార్డ్‌వేర్ కోర్సు చ‌ద‌వాలి. అప్పుడే కంప్యూట‌ర్‌ను బిగించ‌డం ఎలాగో తెలుస్తుంది. అయితే… ఆ బాలుడు మాత్రం అలా కాదు. అలాంటి హార్డ్‌వేర్ కోర్సు ఏమీ చ‌ద‌వ‌లేదు. అయినా… కంప్యూట‌ర్ల‌ను అవ‌లీల‌గా బిగించ‌గ‌ల‌డు. అంతెందుకు… వాడి ప‌డేసిన కంప్యూట‌ర్ పార్ట్‌లు అన్నింటినీ క‌లిపి ఏకంగా ఓ నూత‌న కంప్యూట‌ర్‌నే ఏర్పాటు చేయ‌గ‌లిగాడు. అదీ… అత‌ని కెపాసిటీ… ఇంత‌కీ ఆ బాలుడు ఎవ‌రంటే…

అత‌ని పేరు జ‌యంత్ ప‌ర‌బ్‌. వ‌య‌స్సు 16 సంవ‌త్స‌రాలు. మ‌హారాష్ట్ర లోని ఘ‌ట్కోప‌ర్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే జ‌యంత్ 9వ త‌ర‌గ‌తిలోనే చ‌దువు మానేశాడు. దీంతో అత‌ని తండ్రి ర‌వీంద‌ర్ జ‌యంత్‌పై పెట్టుకున్న ఆశలు అడియాశ‌ల‌య్యాయి. ఈ క్ర‌మంలో జ‌యంత్‌కు అనుకోకుండా కంప్యూట‌ర్స్ అంటే ఇష్టం ఏర్ప‌డింది. తండ్రి కంప్యూట‌ర్ స్క్రాప్ అమ్మే వ్యాపారి కావ‌డంతో వారి దుకాణం వ‌ద్ద పెద్ద ఎత్తున వాడి ప‌డేసిన కంప్యూట‌ర్ విడి భాగాలు ఉండేవి. వాటితో జ‌యంత్ రోజూ ప్ర‌యోగాలు చేసేవాడు. ఈ క్ర‌మంలోనే అత‌నికి కంప్యూట‌ర్ గురించి మొత్తం అవ‌గాహ‌న వ‌చ్చేసింది. దీంతో ఓ రోజు ఏకంగా ఆ షాపులో ఉన్న కంప్యూట‌ర్ విడిభాగాల‌న్నింటినీ క‌లిపి ఓ కొత్త కంప్యూట‌ర్‌ను బిగించేశాడు.

అది చూసిన ర‌వీంద‌ర్‌కు త‌న కొడుకు ప్ర‌తిభ ప‌ట్ల ఆశ్చ‌ర్యం వేసింది. దీంతో జ‌యంత్‌ను కూడా అత‌ను త‌న‌తోపాటు కంప్యూట‌ర్ స్క్రాప్ కొనేందుకు తీసుకెళ్లేవాడు. అలా హాస్పిట‌ల్స్‌, ప్రైవేటు కార్యాల‌యాలు, ఇత‌ర అనేక సంస్థ‌ల్లో వాడి ప‌డేసిన కంప్యూట‌ర్ల‌ను కొనుగోలు చేసేందుకు ర‌వీంద‌ర్‌తోపాటుగా జ‌యంత్ వెళ్లేవాడు. ఈ క్రమంలో జ‌యంత్ కంప్యూట‌ర్ అసెంబ్లింగ్‌లో మ‌రింత ముందుకు దూసుకెళ్లాడు. దీంతో అత‌ను ఇప్పుడు ఎథిక‌ల్ హ్యాకింగ్‌, సెక్యూరిటీ సిస్ట‌మ్స్ వంటి కోర్సుల‌ను నేర్చుకుంటున్నాడు. వాటిలో రాణించి ముందుకు కొన‌సాగాల‌నేది అత‌ని ల‌క్ష్యం. అంతేకాదు, కంప్యూట‌ర్ల‌ను అసెంబుల్ చేసి త‌క్కువ ధ‌ర‌కే వాటిని పేద‌ల‌కు అందించాల‌నేది అత‌ని ఆశ‌యం. అది నెర‌వేరాల‌ని మ‌న‌మూ ఆశిద్దాం..! ఏది ఏమైనా కంప్యూట‌ర్‌ల‌ను బిగించ‌డంలో జ‌యంత్ చూపుతున్న ప్ర‌తిభ అద్భుత‌మే క‌దా..! అదీ… స్కూల్ డ్రాప‌వుట్ అయిన విద్యార్థి అత‌ను..!

Comments

comments

Share this post

scroll to top