ఆయ‌న ఒక్క‌డే 1900 మంది యువ‌త‌కు శిక్ష‌ణ‌నిచ్చి ఆర్మీలోకి పంపాడు తెలుసా..?

ఉత్త‌రాఖండ్‌లో గ‌త కొన్నేళ్ల క్రితం వ‌చ్చిన వ‌ర‌ద‌లు గుర్తున్నాయి క‌దా. కొన్ని వంద‌ల మంది యాత్రికులు ఆ వ‌ర‌దల్లో చ‌నిపోయారు. చాలా మంది గాయ‌ప‌డ్డారు. అయితే యాత్రికులకే కాదు, ఆ వ‌ర‌ద‌లు స్థానికుల‌కు కూడా ఇబ్బందుల‌ను తెచ్చి పెట్టాయి. చేసేందుకు ప‌ని లేక‌పోవ‌డం, ప‌ని ఇచ్చేవారు రాక‌పోవ‌డంతో అక్క‌డ చాలా మంది ప‌రిస్థితి దుర్భ‌రంగా మారింది. దీంతో క‌ల్న‌ల్ అజ‌య్ కొథియాల్ అనే ఓ ఆర్మీ అధికారి ఉత్త‌రాఖండ్ వాసుల‌కు స‌హాయం అందించేందుకు ముందుకు వ‌చ్చాడు. అయితే అక్క‌డ ప్ర‌ధానంగా యువ‌త‌కు ప‌ని దొర‌క‌క‌పోవ‌డాన్ని ఆయన గుర్తించాడు. దీంతో వారిని ఆర్మీలో చేర్పించేందుకు కావ‌ల్సిన అన్ని చ‌ర్య‌లు తీసుకున్నాడు. వారికి ముంద‌స్తుగా అన్ని విధాలుగా ట్రెయినింగ్ ఇచ్చేందుకు క్యాంప్‌ను ఏర్పాటు చేశాడు. ఈ క్ర‌మంలోనే ఆ క్యాంపులో చేరేందుకు చాలా మంది యువ‌త ఉత్సాహం క‌న‌బ‌రిచారు.

అలా క్యాంపులో చేరిన వారికి శారీర‌క దృఢ‌త్వం ప‌రంగా క‌ల్నల్ కొథియాల్‌ శిక్ష‌ణ‌నిచ్చేవాడు. అందుకు కొంద‌రు వాలంటీర్లు కూడా ముందుకు రావ‌డంతో కొథియాల్ ప‌ని తేలికైంది. వారంద‌రూ ఆర్మీలో చేరాల‌నుకునే యువ‌త‌ను క్యాంపులో చేర్చుకుని శిక్ష‌ణ‌ను ఇచ్చేవారు. ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌లు రాయ‌డంపై అవ‌గాహ‌న క‌ల్పించ‌డంతోపాటు మంచి శారీర‌క దృఢ‌త్వం, మాన‌సిక వికాసం క‌లిగేలా శిక్ష‌ణ‌నిచ్చారు. దీంతో ఆయ‌న క్యాంపు నుంచి ఇప్ప‌టికే 1900 మంది యువ‌త ఆర్మీలోని బీఎస్ఎఫ్, సీఎస్ఎఫ్‌, ఇండియ‌న్ ఆర్మీ, నావీ వంటి రంగాల్లో ఉద్యోగాలు సాధించారు.

అలా చాలా మందికి ఉద్యోగాలు వ‌చ్చేలా శిక్ష‌ణ‌నిచ్చాడు క‌ల్న‌ల్ అజ‌య్ కొథియాల్. ఈ క్ర‌మంలో ఈ విష‌యం స్థానికంగా అంద‌రికీ తెలిసే స‌రికి మ‌రింత మంది ఆయ‌న క్యాంపులో చేర‌డం మొద‌లు పెట్టారు. అయితే ఒకే చోట క్యాంపు ఉంటే ఇబ్బంది ఉంటుంది అని భావించిన ఆయ‌న ఉత్త‌రాఖండ్‌లో ప‌లు వేర్వేరు ప్రాంతాల్లో ఆరు ప్రీ మిల‌ట‌రీ క్యాంపుల‌ను పెట్టాడు. దీంతో యువ‌త‌కు కూడా క్యాంపుల‌కు రావ‌డం సుల‌భ‌త‌ర‌మైంది. ఆయ‌న క్యాంపుల్లో ప్ర‌స్తుతం 900 మందికి పైగా శిక్ష‌ణ పొందుతుండ‌గా వారిలో 300 మంది వ‌ర‌కు యువ‌తులే ఉన్నారు. ఇక వారిలో 60 మంది యువ‌తులు ఇప్పుడు త్వ‌ర‌లో పోలీస్ ఫోర్స్‌ల‌లో కూడా జాయిన్ కానున్నారు. ఇదంతా క‌ల్న‌ల్ కొథియాల్ చ‌ల‌వే అంటే న‌మ్మ‌గ‌ల‌రా..?

క‌ల్న‌ల్ అజ‌య్ కొథియాల్ కేవ‌లం యువ‌త ఉపాధికి మార్గం చూప‌డ‌మే కాదు, స్థానికంగా ఉన్న వారికి ఉచితంగా విద్య‌, వైద్య స‌దుపాయాలు అందేలా చేస్తున్నాడు. ఎవ‌రికైనా అత్య‌వ‌స‌ర చికిత్స అందించాల్సి వ‌స్తే వారిని ఢిల్లీకి త‌ర‌లించి అక్క‌డి ఎయిమ్స్‌లో చికిత్స అందేలా చూస్తున్నాడు. కాగా కొథియాల్ ఇదంతా ప‌లు స్వ‌చ్ఛంద సంస్థ‌ల స‌హ‌కారంతో చేస్తుండ‌డం విశేషం. అందుకు ఆయ‌న‌కు యూత్ ఫౌండేష‌న్ అనే ఓ స్వ‌చ్ఛంద సంస్థ‌తోపాటు ప‌లు ఇత‌ర స్వ‌చ్ఛంద సంస్థ‌లు కూడా కావ‌ల్సిన స‌హ‌కారాన్ని అందిస్తున్నాయి. ప్ర‌స్తుతం ఉత్త‌రాఖండ్‌లో ఉన్న డెహ్రాడూన్‌, రుద్ర‌ప్ర‌యాగ్‌, చ‌మోలి, శ్రీ‌న‌గ‌ర్‌, ఉత్త‌ర‌కాశీ త‌దిత‌ర ప్రాంతాల‌కు చెందిన యువకులు ఎక్కువ‌గా ఆయ‌న క్యాంపుల్లో శిక్ష‌ణ పొందుతున్నారు. ఆర్మీ అధికారిగానే కాక‌, ఫిలాంత్రోపిస్ట్‌గా, ఓ క‌ళాశాల ప్రిన్సిపాల్‌గా కూడా క‌ల్న‌ల్ కొథియాల్‌ వ్య‌వ‌హ‌రిస్తుండ‌గా, ఆయ‌న పెట్టిన క్యాంపుల్లో స్వ‌యంగా ఆయ‌నే రోజూ యువ‌త‌కు శిక్ష‌ణ‌నిస్తుంటాడు. అదీ… ఆయ‌న‌లో ఉన్న ప‌ట్టుద‌ల‌. యువ‌తకు ఉపాధి క‌ల్పించాల‌ని, తద్వారా దేశాభివృద్ధి జ‌రుగుతుంద‌ని న‌మ్మారు గ‌నుక‌నే ఆయ‌న ఈ ప‌నిచేస్తున్నాడు. అందుకు ఆయ‌న్ను మ‌నం క‌చ్చితంగా అభినందించాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top